మాగురించి భాజపా తప్పుగా ఆలోచిస్తోంది: మమత

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ పౌర పట్టిక, జాతీయ జనాభా పట్టిక, పౌరసత్వ సవరణ చట్టం గురించి రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హామీ ఇచ్చారు.

Published : 16 Dec 2020 01:54 IST

కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ పౌర పట్టిక, జాతీయ జనాభా పట్టిక, పౌరసత్వ సవరణ చట్టం గురించి రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం శరణార్థుల కాలనీలను గుర్తించిందని వెల్లడించారు. అల్లర్లతో సతమతమైన గుజరాత్‌లా ఈ రాష్ట్రాన్ని కూడా మార్చాలని భాజపా ప్రయత్నిస్తోందని ఆమె మండిపడ్డారు. వర్గాల మధ్య అల్లర్లు, విద్వేషాలను భాజపా సృష్టిస్తోందని ఆమె విరుచుకుపడ్డారు. మంగళవారం జల్‌పాయ్‌గురిలో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ..అధికార పార్టీ చర్యలను తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి తప్పుపట్టారు.   

అలాగే ఇటీవల బెంగాల్‌ పర్యటనలో భాగంగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై జరిగిన దాడి గురించి మమత ప్రస్తావించారు. ఆయన కాన్వాయ్‌పై దాడి చేయలేదని పునరుద్ఘాటించారు. ‘కేంద్ర బలగాలను తీసుకువచ్చి, రాష్ట్ర కేడర్‌కు చెందిన అధికారులను బదిలీ చేయడం వల్ల మమ్మల్ని భయపెట్టవచ్చని భాజపా అనుకుంటోంది. కానీ, అది తప్పు. మా అధికారులకు సమన్లు ఇస్తోంది. ఎవరు ఆయనకు, ఆయన కాన్వాయ్‌కు ఇబ్బంది కలిగించాలనుకోలేదు’ అని అన్నారు. తమ అధికారులకు సమన్లు ఇచ్చి, రాష్ట్రాల అధికార పరిధిలోకి కేంద్రం తలదూర్చుతోందని ఆరోపించారు. మరి కొద్ది నెలల్లో బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇప్పటికే టీఎంసీ, భాజపా మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 

ఇవీ చదవండి:

అమిత్‌ షా సమక్షంలో భాజపాలోకి సువెందు!

బెంగాల్‌లో కేంద్ర బలగాలను దింపాలి: భాజపా

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని