‘రైతుల పక్షాన నిలబడినందుకు అభినందనలు’

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కేంద్రమంత్రి పదవికి, ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగిన శిరోమణి అకాలీదళ్‌ను నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ అభినందించారు. అకాలీదళ్‌...

Published : 28 Sep 2020 01:26 IST

శిరోమణి అకాలీదళ్‌ నేతలకు శరద్‌పవార్ మద్దతు

ముంబయి: వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కేంద్రమంత్రి పదవికి, ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగిన శిరోమణి అకాలీదళ్‌ను నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ అభినందించారు. అకాలీదళ్‌ నేతలు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాద్‌, హర్‌సిమ్రత్‌  కౌర్ బాదల్‌ను శరద్‌ పవార్‌ ప్రశంసించారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా శరద్‌ పవార్‌ రైతుల పక్షాన నిలబడిన అకాలీదళ్‌ నేతలకు అభినందనలు తెలిపారు. ‘ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ నాయకత్వంలో  అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌, ఎంపీ హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌కు శుభాకాంక్షలు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు నిరసనగా ఎన్డీఏ నుంచి వైదొలగడం మంచి పరిణామం. రైతుల పక్షాన నిలిచినందుకు ధన్యవాదాలు’’ అని పవార్ ట్వీట్‌ చేశారు. ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగిన మూడో పార్టీ శిరోమణి అకాలీదళ్‌. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు తెదేపా బయటకు రాగా.. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా శివసేన వైదొలిగిన విషయం తెలిసిందే.

వ్యవసాయ బిల్లులపై చర్చ సందర్భంగా రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన టీఎంసీ ఎంపీ డేరెక్‌ ఓబ్రిన్‌ కూడా అకాలీదళ్‌ నిర్ణయానికి మద్దతు తెలిపారు. రైతుల కోసం పోరాటం చేయడం టీఎంసీ డీఎన్‌ఏలోనే ఉందని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన అకాలీదళ్‌ నిర్ణయం సాహసోపేతమని కొనియాడారు. దీనికి సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ ట్వీటర్‌ వేదికగా స్పందించారు. ‘పార్లమెంట్‌లో వ్యవసాయ బిల్లుల సందర్భంగా మీరు తెలియజేసిన నిరసన గురించి తెలుసు. మీరు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని ట్వీట్‌ చేశారు. అకాలీదళ్‌ నిర్ణయాన్ని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ప్రశంసించారు. రైతుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉన్న బిల్లులను తీసుకొచ్చిన ఎన్డీఏ కూటమి నుంచి అకాలీదళ్‌ బయటకు రావడం మంచి నిర్ణయమని సంజయ్‌ రౌత్‌ చెప్పారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా వేలాది మంది రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని