పోలవరంపై అపోహలకు తావులేదు: మంత్రి అనిల్‌కుమార్

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎటువంటి అపోహలకు తావులేదని, సామర్థ్యం మేరకే నీటి నిల్వ చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ

Updated : 18 Nov 2020 11:11 IST

పోలవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎటువంటి అపోహలకు తావులేదని, సామర్థ్యం మేరకే నీటి నిల్వ చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. ప్రాజెక్టు పనులను మంగళవారం ఆయన పరిశీలించి ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్షించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. వచ్చే 3 నెలల్లో ఏఏ పనులు చేయాలనే దానిపై సమీక్ష జరిపినట్లు చెప్పారు. కేంద్ర జలసంఘం నిబంధనల ప్రకారం ప్రాజెక్టులో దశల వారీగా లక్ష్యం మేరకు నీటిని నిల్వ చేస్తామన్నారు. 2021 డిసెంబర్‌ నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. రూ.55 వేల కోట్ల ప్రాజెక్టులో రూ.17 వేల కోట్లు ఖర్చు చేసిన గత పాలకులు గొప్పగా చెప్పుకుంటున్నారని, పునరావాసాన్ని వారు పూర్తిగా విస్మరించారని మంత్రి ఆక్షేపించారు.

‘పోలవరం జాతీయ ప్రాజెక్టు, ప్రతి రూపాయి ఖర్చు బాధ్యత కేంద్రానిదే. 2014 భూ సేకరణ చట్టప్రకారం కేంద్రమే నిధులివ్వాలి. ప్రాజెక్టుకు ప్రధాని మోదీ అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తామంటూ ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. డెడ్‌ స్టోరేజ్‌ నుంచి విశాఖకు నీళ్లు తరలించేందుకు ప్రయత్నిస్తున్నాం. డ్యాం పూర్తిస్థాయి ఎత్తులో నీరు నిలుపుతాం, అంగుళం కూడా తగ్గదు. పోలవరం ప్రాజెక్టు వద్ద వైఎస్‌ఆర్‌ విగ్రహం పెడుతున్నాం’ అని మంత్రి అనిల్‌ కుమార్‌ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని