BJP: లఖింపుర్‌ ఎఫెక్ట్‌ .. భాజపా కమిటీలో ‘గాంధీ’లకు దక్కని చోటు!

80మందితో భాజపా జాతీయ కార్యనిర్వాహక కమిటీని ఆ పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. ప్రత్యేక ఆహ్వానితులు, ఎక్స్‌ అఫిషియో సభ్యుల పేర్లను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు .......

Published : 08 Oct 2021 02:33 IST

80మందితో జాతీయ కార్యనిర్వాహక కమిటీ ప్రకటన

తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి అవకాశం

దిల్లీ: భాజపా ప్రకటించిన పార్టీ జాతీయ కార్యనిర్వాహక కమిటీలో ఎంపీలు మేనకా గాంధీ, వరుణ్‌ గాంధీలకు ఈసారి చోటు దక్కలేదు. వ్యవసాయ చట్టాలు, లఖింపుర్‌ ఖేరి ఘటనలపై వరుణ్‌ గాంధీ ట్వీట్లు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. గురువారం 80మందితో భాజపా జాతీయ కార్యనిర్వాహక కమిటీని ఆ పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. ప్రత్యేక ఆహ్వానితులు, ఎక్స్‌ అఫిషియో సభ్యుల పేర్లను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఖరారు చేసినట్టు భాజపా జాతీయ అధికార ప్రతినిధి అరుణ్‌ సింగ్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ జాతీయ కార్యనిర్వాహక కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీ, ఎల్‌కే ఆడ్వాణీ, డాక్టర్‌ మురళీమనోహర్‌ జోషీ, రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, పీయూష్‌ గోయల్‌ సహా పలువురు కీలక నేతలు ఉన్నారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు నేతలకు చోటు దక్కింది. ఏపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ; తెలంగాణ నుంచి కేంద్రమంత్రి జి.కిషన్‌ రెడ్డి, జితేందర్‌ రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, జి. రామ్మోహన్‌రావులకు అవకాశం లభించింది. 

అలాగే, ఈ జాతీయ కార్యవర్గ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితులుగా 50మంది, ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా  179మందిని ఎంపిక చేసినట్టు అరుణ్‌సింగ్‌ వెల్లడించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా విజయశాంతి, ఈటల రాజేందర్‌కు అవకాశం లభించింది. వచ్చే నెల7న భాజపా జాతీయ కార్యనిర్వాహక కమిటీ దిల్లీలో భేటీ కానుంది. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ కమిటీ సమావేశం కానుండటం గమనార్హం. 

వరుణ్‌ గాంధీ, మేనకా గాంధీలకు మొండిచేయి!
మరోవైపు, భాజపా జాతీయ కార్యనిర్వాహక కమిటీ నుంచి మేనకా గాంధీ, వరుణ్‌ గాంధీలను ఈసారి తప్పించడం గమనార్హం. వరుణ్‌ గాంధీ ఫిలిబిత్‌ నియోజకవర్గం నుంచి, మేనకా గాంధీ సుల్తాన్‌పుర్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలతో పాటు లఖింపుర్‌ ఖేరిలో హింసాత్మక ఘటనలు తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ విధానాలపై తన వాణి విన్పిస్తున్నారు. లఖింపుర్‌ ఖేరి ఘటనపై ఈ రోజు కూడా రెండు వీడియోలను ట్విటర్‌లో షేర్‌ చేసిన ఆయన.. ఈ వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో మేనకా గాంధీ, వరుణ్‌ గాంధీలను జాతీయ కార్యనిర్వాహక కమిటీ నుంచి తప్పిస్తూ నిర్ణయం రావడం చర్చనీయాంశంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని