Maharastra: 12మంది భాజపా ఎమ్మెల్యేలపై వేటు

12 మంది భాజపా ఎమ్మెల్యేలపై సంవత్సరంపాటు సస్పెన్షన్‌ విధిస్తున్నట్లు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ ప్రకటించారు.

Updated : 06 Jul 2021 12:47 IST

ముంబయి: రెండురోజుల పాటు కొనసాగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రసాభాసగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఓబీసీ రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై చర్చ జరపాలని ప్రతిపక్ష భాజపా పట్టుబట్టింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఇంఛార్జి స్పీకర్‌ భాస్కర్‌ జాదవ్‌పై భాజపా సభ్యులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో వారిపై చర్యలకు ఉపక్రమించిన స్పీకర్‌, 12 మంది భాజపా ఎమ్మెల్యేలపై ఏడాది పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే, దీనిపై చర్చ జరగాల్సిందేనని ప్రతిపక్ష భాజపా ఆందోళనకు దిగింది. దీంతో కొద్ది సమయంపాటు స్పీకర్‌ సభను వాయిదా వేశారు. అదే సమయంలో స్పీకర్‌ క్యాబిన్‌కు వెళ్లిన ప్రతిపక్ష సభ్యులు ఆయనపై దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్‌, భాజపా సీనియర్‌ నేత చంద్రకాంత్ పాటిల్‌ సమక్షంలోనే వారు తనపై దాడికి యత్నించినట్లు స్పీకర్‌ భాస్కర్‌ జాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సభా కార్యకలాపాలు అడ్డుకుంటున్న కారణంగా 12మంది ఎమ్మెల్యేలను ఏడాది పాటు సస్పెండ్‌ చేశారు.

అయితే, స్పీకర్‌ వాదనను ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్‌ ఖండించారు. భాజపా ఎమ్మెల్యేలు స్పీకర్‌ను దూషించలేదని స్పష్టం చేశారు. స్పీకర్‌ క్యాబిన్‌లో కేవలం శివసేన, భాజపా సభ్యుల మధ్య వాడీవేడీ వాదనలు మాత్రమే జరిగాయన్నారు. అందుకు స్పీకర్‌కు క్షమాపణ కూడా చెప్పారని తెలిపారు. కేవలం భాజపా సభ్యులను సస్పెండ్‌ చేసేందుకు ప్రభుత్వం కట్టుకథ అల్లిందని ఆరోపించారు. అయినప్పటికీ తమ పోరాటాన్ని కొనసాగిస్తామని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని