MAA Elections: వ్యక్తిగత లాభం కోసం మోహన్‌బాబు ఎప్పుడూ మాట్లాడలేదు: తలసాని

సాధారణ సార్వత్రిక ఎన్నికలను తలపించేలా ఈసారి ‘మా’ ఎన్నికలు జరిగాయని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో...

Updated : 16 Oct 2021 15:29 IST

హైదరాబాద్‌: సాధారణ సార్వత్రిక ఎన్నికలను తలపించేలా ఈసారి ‘మా’ ఎన్నికలు జరిగాయని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో నిర్వహించిన ‘మా’ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి తలసాని శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ‘మా’ నూతన అధ్యక్షుడిగా విష్ణుని ఎన్నుకోవడం ఆనందంగా ఉందన్నారు. ‘మా’ అభివృద్ధి కోసం మంచు విష్ణు చేపట్టే కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

‘‘అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను తలపించేలా ఈసారి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు లాంటి యువకుడిని, అతని ప్యానెల్‌ని ఎన్నుకున్న ‘మా’ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. నేడు ఈ ప్రమాణాస్వీకార కార్యక్రమానికి హాజరు కావడం ఆనందంగా ఉంది. ‘మా’ అంటే చిన్న వ్యవస్థ కాదు. కుటుంబం కాదు. ఇది ఒక పెద్ద వ్యవస్థ. అలాంటి వ్యవస్థ అభివృద్ధిని తన భుజాలపై వేసుకుని.. సభ్యుల సంక్షేమం కోసం ఆయన ముందుకు వచ్చి ఎన్నికల్లో నిలబడటం గర్వించదగ్గ విషయం. ఎదుటివారితో ఎలా సంస్కారంగా ఉండాలో విష్ణుకి మోహన్‌బాబు నేర్పించారు. క్రమశిక్షణ అలవర్చారు. అలాగే, సుమారు 25 సంవత్సరాల నుంచి మోహన్‌బాబుకీ, నాకూ మధ్య అన్నదమ్ముల అనుబంధం ఉంది. మోహన్‌బాబుకి కోపం ఎక్కువ అని ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు. నిజం చెప్పాలంటే ఆ కోపంతో ఆయన ఎంతో నష్టపోయాడు. ఆ విషయం ఆయన మనసుకు కూడా తెలుసు. సమాజ హితం కోసమే ఆయన మాట్లాడతారు. వ్యక్తిగత లాభం కోసం ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు. మంచి వ్యక్తులను ‘మా’ సభ్యులుగా ఎన్నుకోవడం సంతోషంగా ఉంది. విష్ణుకి తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలుగా సహకారం అందిస్తుంది. సినిమా పరిశ్రమకు హైదరాబాద్‌ హబ్‌గా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పించారు. అందుకు అనుగుణంగా ఎన్నో సంస్కరణలను ఆయన చేపట్టారు. సినిమా షూటింగ్‌కు అనువుగా ఉండే ఎన్నో ప్రదేశాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అందులోనూ రామోజీ ఫిలింసిటీ ఓ అద్భుతమైన కళాఖండం. కరోనా కారణంగా సినిమా వాళ్లు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. వాళ్లకు చేయూత అందించడం కోసం ప్రభుత్వం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఇప్పుడిప్పుడే థియేటర్లు మరలా పునర్‌వైభవం సంతరించుకుంటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ థియేటర్లలోనే సినిమాలు చూడాలని కోరుకుంటున్నాను. పైరసీని అంతం చేసేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది’’ అని తలసాని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని