MAA Elections: ఆయనతోనే నాకు సమస్య.. వారంలో మళ్లీ మీ ముందుకు వస్తా: ప్రకాశ్‌రాజ్‌

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికలు రోజురోజుకీ రకారకాల మలుపులు తీసుకుంటోంది. ఓవైపు ఎన్నికల్లో గెలిచి మంచు విష్ణు, అతని ప్యానెల్‌ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయగా..

Published : 18 Oct 2021 14:21 IST

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికలు ముగిసినప్పటికీ.. ఆ వేడి ఇంకా చల్లారడం లేదు. ఓవైపు ఎన్నికల్లో గెలిచి మంచు విష్ణు, అతని ప్యానెల్‌ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయగా.. మరోవైపు ప్రకాశ్‌రాజ్‌ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈక్రమంలోనే ఆయన సోమవారం మధ్యాహ్నం ‘మా’ ఎన్నికల పోలింగ్‌ సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. ఈమేరకు తన ప్యానెల్‌ సభ్యులైన బెనర్జీ, తనీశ్‌లతో కలిసి జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌కు చేరుకుని.. ఫుటేజీని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘‘మాకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవడం కోసమే ఈరోజు పోలింగ్‌ సెంటర్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాం. ఇంకా ఎన్నికల అధికారి వద్ద ఏడు కెమెరాలకు సంబంధించిన ఫుటేజీ ఉంది. దానిని కూడా పరిశీలించాక.. మేము మీడియా ముందుకు వస్తాం. సీసీ ఫుటేజీ పరిశీలించడానికి అంగీకారం తెలిపిన మంచు విష్ణుకి ధన్యవాదాలు. మాకు కేవలం ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌తోనే ఇబ్బందులున్నాయి. ఫుటేజీ ఇవ్వాలని కోరుతూ ఇటీవల ఆయనకు లేఖ రాశాను. మొదట ఆయన ఓకే అన్నారు. కానీ, ఆ తర్వాత ఫుటేజీ ఇవ్వడం కుదరదు.. దానికంటూ ఓ ప్రోటోకాల్‌ ఉంటుందని చెబుతున్నారు. ఆ మేరకు మేము చర్యలు చేపట్టాం. త్వరలోనే మిగిలిన ఫుటేజీ పరిశీలించి.. మీడియా ముందుకు వస్తాం’’ అని ప్రకాశ్‌రాజ్‌ వివరించారు.

మరోవైపు ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ స్పందిస్తూ.. ‘‘మా’ ఎన్నికలు సక్రమంగా నిర్వహించడం వరకే నా బాధ్యత. ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు. సీసీటీవీ ఫుటేజీ కావాలంటే కోర్టుకు వెళ్లండి. కోర్టు తీర్పునకు అనుగుణంగానే నేను వ్యవహరిస్తా’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని