Updated : 07/10/2021 18:07 IST

MAA Elections: నాగబాబుకు విష్ణు కౌంటర్‌: 10 కాదు.. రూ.75వేలు ఇస్తున్నాం!

హైదరాబాద్‌: మా ఎన్నికల్లో ఒక్కో సభ్యుడికి రూ.75వేలు ఇస్తున్నామని, తన తండ్రి మోహన్‌బాబు, తమ్ముడు మనోజ్‌, అక్క లక్ష్మికి కూడా ఇచ్చానని సినీ నటుడు, ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు అన్నారు. ‘మంచు విష్ణు ప్యానెల్‌ ఒక్కో సభ్యుడికి రూ.10వేలు ఇస్తోంది’ అని ఇటీవల నాగబాబు అన్న వ్యాఖ్యలకు మంచు విష్ణు కౌంటర్‌ ఇచ్చారు. స్టార్‌ హీరో మహేశ్‌బాబుకు రూ.75వేలు గూగుల్‌ పే చేశానని, ఆయన ఊళ్లో లేకపోవడంతో చూసుకోలేదని వెటకారంగా అన్నారు. ఓటు వేయని వాళ్లను గుర్తు పెట్టుకుని వాళ్ల దగ్గరి నుంచి రూ.75వేలు వెనక్కి తిరిగి తీసుకుంటానని అదే తన అజెండానని మంచు విష్ణు వ్యంగ్యంగా మాట్లాడారు. గురువారం ‘మా’ ఎన్నికల్లో తమ ప్యానెల్‌ గెలిస్తే, ఏమేమి చేస్తామో చెబుతూ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆ వివరాలు తెలిపిన తర్వాత పలు విషయాలపై విష్ణు మాట్లాడారు.

లోకల్‌.. నాన్‌ లోకల్‌  సమస్య కాదు!

‘‘25 సంవత్సరాల ముందు ‘మా’ స్థాపించినప్పుడు అప్పుడున్న ఛాలెంజెస్‌ వేరు. మేము ఇప్పుడు అసోసియేట్‌ మెంబర్స్‌ సహా 950మంది ఉన్నాం. ఈ సంఖ్య 5వేల వరకూ చేరాలి. భారతదేశంలోనే ఒక పవర్‌ఫుల్‌ యాక్టింగ్‌ అసోసియేషన్‌గా ‘మా’ ఉండాలి. అది నా కల. మేము అమలు చేసే పథకాలు వారందరికీ  భరోసాను కల్పిస్తాయి. ఇక్కడ లోకల్‌, నాన్‌లోకల్‌ సమస్య కాదు. అవకాశాలు.. ఒక నటుడిగా ఈ ఏడాది నేను బిజీగా ఉండవచ్చు. వచ్చే ఏడాది నాకు మూడు వారాలు కూడా పనిలేకపోవచ్చు. అదే ప్రయారిటీ. చిత్ర పరిశ్రమ చాలా ప్రత్యేకమైంది. ప్రజలు ఎప్పుడు ఎవరిని ఆదరిస్తారో.. ఎవరిని తిరస్కరిస్తారో తెలియదు. ఒక ప్రొడ్యూసర్‌ ట్రెండింగ్‌లో ఉన్న యాక్టర్‌ను పెట్టుకుంటారు. అతడు ఈరోజు ట్రెండ్‌లో ఉండవచ్చు. కొన్నాళ్లకు ఆయన ట్రెండ్‌ ముగియవచ్చు. ‘మా యాప్‌’ ఎందుకంటే నూటికి 95మంది నటులు తమని తాము ప్రమోట్‌ చేసుకోలేరు. అందుకే వాళ్లకు సహకరిస్తాం! జాబ్‌ కమిటీ వచ్చినప్పుడు నిర్మాతలు మాకు సహకరిస్తారని నమ్మకం ఉంది’’

టాలెంట్‌ ఉంటే ఏ భాష వాళ్లనైనా తీసుకోవచ్చు!

‘‘ఒక క్యారెక్టర్‌ ఎవరికి ఇవ్వాలన్న నిర్ణయం దర్శకుడిపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అతడు క్రియేటర్‌. ఆయన క్రియేటివిటీని మేము తుంచేయలేం. ఉదాహరణకు జగపతిబాబుగారు అన్ని భాషల్లో ప్రతినాయకుడిగా అదరగొడుతున్నారు. మన మార్కెట్‌ను పెంచుకోవాలి. ఇతర భాషా నటులను పెట్టుకుంటే మార్కెట్‌ పరిధి పెరుగుతుందని నిర్మాతలందరూ ఆశిస్తారు. అందులో తప్పులేదు. అదంతా వ్యాపారం. అదే సమయంలో మనవాళ్లకూ అవకాశాలు ఇవ్వండని కోరడంలో తప్పులేదు. ‘ఫలానా నటుడే కావాలి’ అని ఏ హీరో చెప్పడు. భారతదేశంలో ఏ నటుడైనా ఎక్కడైనా నటించవచ్చు. టాలెంట్‌ ఉంటే తప్పకుండా ఏ భాష వాళ్లైనా తీసుకుంటారు. ఒకప్పుడు తమిళనాడు నుంచి డ్యాన్స్‌ మాస్టర్లు ఇక్కడకు వచ్చేవాళ్లు. ఇప్పుడు మన డ్యాన్స్‌ మాస్టర్స్‌కు భారతదేశ వ్యాప్తంగా డిమాండ్‌ ఉంది. క్రియేటివ్‌ ఇండస్ట్రీలో రిజర్వేషన్‌ అనేది అసాధ్యం. నా వరకూ అది నాన్సెన్స్‌’’

అది చాలా పెద్ద సమస్య!

‘‘నిర్మాత అనేవాడు దేవుడు. ఎందుకంటే డబ్బు పెడుతున్నాడు. ఒక నిర్మాతగా ఎవరైనా నా దగ్గరకు వచ్చి ‘ఫలానా నటుడిని పెట్టు’ అని అంటే వాళ్ల చేతికి గాలిపటం ఇచ్చి వెళ్లి ఎగరేసుకో అని చెబుతా. ‘మా’ సభ్యత్వం విస్తృతమైంది. ‘స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌’ అనేది అమెరికాలో ఉంది. అది పవర్‌ఫుల్‌ అసోసియేషన్‌. అన్నీ నాకు తెలుసని నేను చెప్పను. అక్కడున్న పాలసీలు మన వాతావరణానికి ఏవి సరిపోతాయో వాటిని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అసోసియేషన్‌లో ఉన్న నియమ, నిబంధలను అనువుగా తీసుకుని ‘మా’ అసోసియేషన్‌ లోపలికి వచ్చి కొందరు మా మధ్య వివాదాలు సృష్టిస్తున్నారు. నేను వచ్చిన తర్వాత అది లేకుండా చేస్తా! రవిబాబు ఒక రాడికల్‌ వ్యక్తి. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన మాట్లాడిన దాంట్లో చాలా వరకూ నిజం ఉంది. ‘కేవలం మన భాషా నటులను మాత్రమే తీసుకోవాలి’ అనేది చాలా పెద్ద సమస్య. దాన్ని పరిష్కరించాలంటే ఇండస్ట్రీ అంతా ఒక్కటవ్వాలి. మనం బయట నుంచి టాలెంట్‌ను ఎందుకు తీస్తామో ఇంతకుముందే చెప్పాం. ఆ అవసరం రాకూడదనే ‘మోహన్‌బాబు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌’ స్థాపిస్తున్నాం.’’ అని మంచు విష్ణు అన్నారు. ఇక ‘‘ప్రకాశ్‌రాజ్‌ మూడుసార్లు ‘మా’కు అధ్యక్షుడిగా ఉండాలి. ఆయన ఉంటేనే ‘మా’ బాగుపడుతుంది’’ అని నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన సొంత అభిప్రాయమని మంచు విష్ణు తెలిపారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని