MAA Elections: కొంతమంది బెదిరింపులకు పాల్పడ్డారు: మోహన్‌బాబు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ అనేది కళాకారుల వేదికని.. ఇక్కడ రాజకీయాలు ఉండకూడదని సీనియర్‌ నటుడు మంచు మోహన్‌బాబు అన్నారు...

Updated : 27 Dec 2022 16:43 IST

ఇక్కడ రాజకీయాలు ఉండకూడదు

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ అనేది కళాకారుల వేదికని.. ఇక్కడ రాజకీయాలు ఉండకూడదని సీనియర్‌ నటుడు మంచు మోహన్‌బాబు అన్నారు. ‘మా’ నూతన అధ్యక్షుడిగా తన తనయుడు మంచు విష్ణు ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడమంటే సాధారణమైన విషయం కాదని.. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలని విష్ణుకి సూచించారు. అంతేకాకుండా అసోసియేషన్‌లో ఉన్న అందరూ కలిసి కట్టుగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

‘‘ఇది కళాకారుల వేదిక. ఇక్కడ రాజకీయాలు ఉండకూడదు. ‘మా’ ఎన్నికల సమయంలో మేము ఇంతమంది ఉన్నాం.. అంతమంది ఉన్నామని కొంతమంది వ్యక్తులు బెదిరించారు. కానీ ఆ బెదిరింపులకు ఎవరూ భయపడలేదు. మా ఓటు మా ఇష్టమని నా బిడ్డను గెలిపించినందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. ఒకరి దయాదాక్షణ్యాలపై సినీ పరిశ్రమ ఉండలేదు. కేవలం టాలెంట్‌తోనే ఇక్కడ కొనసాగగలరు. ఎన్నికల్లో విజయం సాధించడం కోసం కమిటీ సభ్యులందరూ ఎంతో కష్టపడి పనిచేశారు. నాకు పగ, రాగద్వేషాలు లేవు. మనం కేవలం కళాకారుల గురించే మాట్లాడదాం. రాజకీయాల గురించి మాట్లాడవద్దు. ఎన్నికల్లో విజయాన్ని అందించిన మీరే నా బిడ్డకు దేవుళ్లు. ఇకపై, నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాను. కళాకారులందరూ ఒకటిగా ఉండండి. ఓటు వేయని వాళ్లపై పగ వద్దు. ఎందుకంటే పగ మనిషిని సర్వనాశనం చేస్తుంది. భారతదేశం గర్వించేలా ‘మా’ ఖ్యాతిని పెంచాలి. ‘మా’ సభ్యులకు ఇళ్ల నిర్మాణం.. వాళ్ల సమస్యల పరిష్కారం కోసం త్వరలో నేను ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసి మాట్లాడతాను. ఎవరు ఎక్కడ ఉన్నా సరే.. అసోసియేషన్‌తో మీకు సంబంధం లేదు అనుకోకండి. ఇది మన అసోసియేషన్‌. నూతన కార్యవర్గానికి మీ సహాయసహకారాలు ఎంతో అవసరం. ‘మా’ అధ్యక్షుడు అనేది చిన్న ఉద్యోగం కాదు. అది ఒక పెద్ద బాధ్యత. ఎంతో మంది మహామహులు దీన్ని ఏర్పాటు చేశారు. కార్యవర్గంలోని సభ్యులందరికీ నేను చెప్పేది ఒక్కటే.. మీలో మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రెసిండెంట్‌తో చెప్పి సమస్యలను పరిష్కరించుకోండి. అంతేకానీ, టీవీలకు ఎక్కొద్దు. సినిమా పరిశ్రమ కోసం నేను ఎన్నో చేశాను. కానీ అందరూ అది మర్చిపోయారు. వాళ్లు గుర్తుపెట్టుకున్నా లేకున్నా.. నా కుటుంబానికి ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నా తనయుడు విష్ణు గెలుపునకు నరేశ్‌ ఎంతో సాయం చేశారు. షూటింగ్స్‌ ఉన్నా సరే.. వాటన్నింటి నుంచి కొంత సమయం తీసుకుని మరీ నా కొడుకు కోసం పనిచేశాడు. నరేశ్‌ని ఎప్పటికీ మర్చిపోను’’ అని మోహన్‌బాబు అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని