Published : 14/09/2021 23:10 IST

Nithiin: ఈ రీమేక్‌ చేసేందుకు భయపడ్డా.. కానీ!

హైదరాబాద్‌: ‘‘అందాధున్‌’ రీమేక్‌ చేసేందుకు ముందుగా భయపడ్డా’ అని సినీ నటుడు నితిన్‌ అన్నారు. అతడు హీరోగా నటించిన చిత్రం ‘మాస్ట్రో’. హిందీలో ఘన విజయం అందుకున్న ‘అందాధున్‌’కి రీమేక్‌గా రూపొందింది. మేర్లపాక గాంధీ దర్శకుడు. నభా నటేశ్‌, తమన్నా, నరేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సెప్టెంబరు 17 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ + హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా నితిన్‌ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా చేద్దామనుకున్నప్పుడు కొంచెం భయమేసింది. ఈ సమయంలో మనకు ఇలాంటి చిత్రం అవసరమా? కమర్షియల్‌ సినిమాలు చేసుకుంటే సరిపోతుంది కదా అనిపించింది. కానీ, ఓ నటుడిగా రిస్క్‌ తీసుకోవాలని భావించి ఈ చిత్రాన్ని ఓకే చేశా. ఈ సినిమా కోసం దర్శకుడు మేర్లపాక గాంధీ చాలా కష్టపడ్డాడు. రీమేక్‌ చేయడమంటే అంత తేలికైన విషయం కాదు. మాతృకలోని ఆత్మని ఏమాత్రం మార్చకుండా, మన నేటివిటీకి తగ్గట్టు కామెడీని జతచేసి అద్భుతంగా రూపొందించాడు. మహతి స్వరసాగర్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకి బలంగా నిలుస్తాయి. ఈ సినిమాని థియేటర్లలో చూస్తే ఆ మజానే వేరు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఓటీటీకి ఇవ్వాల్సి వచ్చింది. అగ్ర నాయికగా కొనసాగుతోన్న తమన్నా ఈ చిత్రంలో నటిస్తుందా, లేదా? అనుకున్నాం. కానీ, ఆమె ధైర్యం చేసి ముందుకొచ్చింది. పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది. నా సహనటులు, సాంకేతిక బృంద సభ్యులు, నిర్మాతలకి థ్యాంక్స్‌. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని అన్నారు.

మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. ‘నితిన్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకునేవాడ్ని. తన డ్యాన్సు, కామెడీ టైమింగ్‌ని దృష్టిలో పెట్టుకుని మంచి కమర్షియల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ చేద్దామనుకున్నా. కానీ, అది సాధ్యపడలేదు. అనుకోకుండా ‘అందాధున్‌’ రీమేక్‌ పట్టాలెక్కింది. ఇలాంటి సినిమాని తెరకెక్కించడం చాలా ఆనందంగా ఉంది. నితిన్‌ ఇందులో కొత్తగా కనిపిస్తారు. ఈ సినిమాతో తమన్నా గొప్ప నటిగా మారుతుంది. ఇకపై ఆమెని ‘మిల్కీబ్యూటీ’ అని పిలవకుండా ‘గ్రేట్‌ ఆర్టిస్ట్‌’గా అభివర్ణిస్తే బాగుంటుంది. నభా నటేశ్ తన పాత్రకి న్యాయం చేసింది. శ్రీముఖి, మంగ్లీ, రచ్చ రవి, మహేశ్‌ తదితరులు తమ తమ పాత్రలతో అలరిస్తారు’ అని చెప్పారు.

తమన్నా మాట్లాడుతూ... ‘చాలా రోజుల తర్వాత సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి రావడం ఆనందంగా ఉంది. నాపై మీరు చూపించే అభిమానం వల్లే నేను ఇలాంటి కథల్ని ఎంపిక చేసుకోగలుగుతున్నా. నితిన్‌తో కలిసి ప్రేమకథలో నటిస్తానేమో అనుకునేదాన్ని. అనుకోకుండా ఇలాంటి వైవిధ్యభరిత సినిమా కోసం మేం కలిసి పనిచేశాం. నితిన్‌ అంధుడి పాత్రలో చాలా బాగా నటించాడు. ఈ సినిమాలో నాకు కీలక పాత్ర ఇచ్చిన దర్శకుడు మేర్లపాక గాంధీ, నిర్మాత సుధాకర్‌రెడ్డికి చాలా చాలా థ్యాంక్స్‌’ అని అన్నారు. ‘తొలిసారి రీమేక్‌లో నటించా. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాలో ఇప్పటివరకు చూడని నితిన్‌ని చూస్తారు’ అని నభా నటేశ్‌ తెలిపింది. ఈ కార్యక్రమంలో నరేశ్, మంగ్లీ, రచ్చరవి, మహేశ్‌, కాసర్ల శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని