MAA Elections: హేమపై చర్యలు తీసుకుంటాం: నరేశ్‌

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ నిధులను దుర్వినియోగం చేశారంటూ ఇటీవల హేమ చేసిన ఆరోపణలపై ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్‌ స్పందించారు. హేమ వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ఈ మేరకు సోమవారం ఉదయం పత్రికా ప్రకటన విడుదల చేశారు.....

Updated : 27 Aug 2021 21:32 IST

నటి ఆరోపణలను తప్పుపట్టిన ‘మా’ అధ్యక్షుడు

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ నిధులను దుర్వినియోగం చేశారంటూ ఇటీవల హేమ చేసిన ఆరోపణలపై ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్‌ స్పందించారు. హేమ వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ఈ మేరకు సోమవారం ఉదయం పత్రికా ప్రకటన విడుదల చేశారు. అసోసియేషన్‌ గౌరవాన్ని దెబ్బతీసేలా హేమ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని.. కమిటీ నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరోనా దృష్ట్యా ‘మా’ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనే విషయంపై సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. పరిస్థితులకు అనుగుణంగానే ఎన్నికలు జరుగుతాయని వివరించారు.

ఈ మేరకు మా జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్ తో కలిసి అసోసియేషన్ నిధుల వ్యయంపై మరోసారి వివరాలు వెల్లడించిన ఆయన... మా అధ్యక్ష పదవిపై తనకు ఎలాంటి వ్యాయోహం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో హేమ వ్యాఖ్యలు అర్థరహితమన్న నరేశ్‌... ఆగస్టు 22న జరిగే సర్వసభ్య సమావేశంలో నిర్ణయం మేరకు ఎన్నికలు ఉంటాయని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మా ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు.

ఈ సందర్భంగా మా కార్యదర్శి జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘హేమగారు చెప్పిన ఈ మాటలన్నీ చాలా తప్పుగా అనిపించాయి. ఎందుకంటే అందరం కూర్చొని దీనిపై చర్చించుకున్నాం. ఈ సమయంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఎన్నికలు ఎవరు పెట్టమంటున్నారు? సభ్యులను గందరగోళానికి గురి చేయొద్దు. ఆలోచించి ఓటు వేసే అవకాశాన్ని ‘మా’ సభ్యులకు కల్పిద్దాం. ఎవరికి ఓటు వేయాలి? ఎవరు పని చేస్తారు? వాళ్లను ఆలోచించుకుని ఓటు వేయనీయండి. అసోసియేషన్‌లో మనకు ఫండ్‌ ఉన్నది సభ్యుల ప్రయోజనాలకోసమే కదా’ అని అన్నారు.

‘మా’ ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వచ్చే నెలలో జరగనున్న ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు ప్రకటించడంతో ఒక్కసారిగా అందరి చూపు సిని‘మా’ పరిశ్రమపై పడింది. ‘మా’కు శాశ్వత భవనం ఏర్పాటు అనే నినాదంతో మొత్తం ఐదుగురు సభ్యులు ఈ ఏడాది అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌ తన ప్యానల్‌ను ప్రకటించగా.. విష్ణు, జీవిత, హేమ, నరసింహారావు గట్టి పోటీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని