Seetimaarr: ఓటీటీలోకి గోపీచంద్‌ ‘సీటీమార్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ఓటీటీలోకి గోపీచంద్‌ ‘సీటీమార్‌’ చిత్రం. ఎప్పుడు? ఏ ఓటీటీ అంటే...?

Updated : 07 Dec 2022 14:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన చిత్రం ‘సీటీమార్‌’. కబడ్డీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఇప్పుడు డిజిటల్‌ మాధ్యమం వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో అక్టోబరు 15 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు చిత్ర బృందం కొత్త పోస్టర్‌ని పంచుకుంది. గోపీచంద్‌, తమన్నా ప్రధాన పాత్రల్లో సంపత్‌ నంది తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమాలో ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్‌గా గోపీచంద్‌ (కార్తీక్‌), తెలంగాణ కబడ్డీ జట్టు కోచ్‌గా తమన్నా (జ్వాలారెడ్డి) నటించారు. భూమిక కీలక పాత్ర పోషించారు.

ఇదీ కథ..

కార్తీక్ స్పోర్ట్స్ కోటాలో బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజ‌ర్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. క‌డియంలో త‌న తండ్రి స్థాపించిన రామ‌కృష్ణ మెమోరియ‌ల్ స్కూల్ మూత‌ప‌డే ప‌రిస్థితి త‌లెత్తుతుంది. దాంతో ఎలాగైనా తాను తీర్చిదిద్దిన కబ‌డ్డీ జ‌ట్టుని జాతీయ స్థాయి పోటీల్లో గెలిపించి, ఆ జ‌ట్టు ద్వారా ఊళ్లోని స్కూల్ స‌మస్య వెలుగులోకి తీసుకురావాల‌ని నిర్ణయిస్తాడు. ఆ  ప్రయ‌త్నంలో ఉన్న కార్తీక్‌కి  ఊళ్లోనే ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయి? దిల్లీలో పోలీస్ అధికారిగా ఉద్యోగం చేస్తూనే మాఫియాని న‌డిపిస్తున్న మాకన్‌సింగ్ (త‌రుణ్ అరోరా) తో కార్తీక్‌కి ఎలా వైరం ఏర్పడింది? త‌న జ‌ట్టు జాతీయ స్థాయి పోటీల్లో విజేత‌గా నిలిచిందా? కార్తీక్ ఆశ‌యం నెర‌వేరిందా? కార్తీక్‌కి జ్వాలారెడ్డి అండ‌గా ఎలా నిలిచింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని