Vijay Devarakonda: రీసెంట్‌గా బ్రేకప్‌ అయ్యింది.. బాధలో ఉన్నా: విజయ్‌ దేవరకొండ

ఇటీవలే తన హార్ట్‌ బ్రేక్‌ అయ్యిందని నటుడు, రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ అన్నారు. ప్రస్తుతం తాను బ్రేకప్‌ బాధలో ఉన్నట్లు చెప్పారు. తన సోదరుడు ఆనంద్‌ దేవరకొండ నటించిన ‘పుష్పక విమానం’ సినిమా ప్రమోషన్స్‌లో....

Updated : 06 Nov 2021 15:18 IST

రిలేషన్‌షిప్‌ స్టేటస్‌పై దేవరకొండ బ్రదర్స్‌ ఏం చెప్పారంటే

హైదరాబాద్‌: ఇటీవలే తన హార్ట్‌ బ్రేక్‌ అయ్యిందని నటుడు, రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ అన్నారు. ప్రస్తుతం తాను బ్రేకప్‌ బాధలో ఉన్నట్లు చెప్పారు. తన సోదరుడు ఆనంద్‌ దేవరకొండ నటించిన ‘పుష్పక విమానం’ సినిమా ప్రమోషన్స్‌లో గత కొన్నిరోజుల నుంచి విజయ్‌ సూపర్‌ యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. దామోదర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయ్‌ నిర్మాతగా వ్యవహరించారు. నవంబర్‌ 12న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో తాజాగా ఈ ఇద్దరు సోదరులు సరదా చాట్‌లో పాల్గొన్నారు. ‘పుష్పక విమానం’, దేవరకొండ సోదరుల గురించి గూగుల్‌లో ఎక్కువమంది సెర్చ్‌ చేసిన ప్రశ్నలకు వీళ్లిద్దరూ సమాధానం ఇచ్చారు. ఆ విశేషాలు మీకోసం..

‘పుష్పక విమానం’ ఏ జోనర్‌ సినిమా?

విజయ్‌: సాధారణంగా తెలుగు సినిమాలు కేవలం ఒక్క జోనర్‌కి మాత్రమే పరిమితం కావు. లవ్‌, యాక్షన్‌, కామెడీ... ఇలా అన్ని రకాల యాంగిల్స్‌ని ఒకే కథలో చూపిస్తారు. ‘పుష్పక విమానం’ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో ఎక్కువగా కామెడీ ఉంటుంది. కథ విన్నాక మేం ఎంతో నవ్వుకున్నాం. అలాగే ఈ సినిమాలో ఒక థ్రిల్లర్‌ ఎలిమెంట్‌ కూడా ఉంటుంది. కాబట్టి ఈ చిత్రాన్ని కామెడీ థ్రిల్లర్‌గా చెప్పుకొవచ్చు.

ఇది ఒరిజినలా? లేదా రీమేక్ చిత్రమా?

విజయ్‌: వందశాతం ఒరిజినల్ కథనే. రీమేక్‌ కాదు. సినిమా విడుదలయ్యాక మిగిలిన భాషల్లో రీమేక్‌ అయ్యే అవకాశం ఉంటుంది.

విజయ్‌ దేవరకొండ ఈ చిత్రాన్ని నిర్మించడానికి గల కారణమేమిటి?

విజయ్‌: డైరెక్టర్‌ దామోదర్‌తో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. నటుడిగా కెరీర్‌ ప్రారంభమై.. కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలోనే అతనితో నాకు పరిచయం ఏర్పడింది. అప్పుడు తను ఓ రచయిత. సడెన్‌గా అతను ‘పుష్పక విమానం’ కథతో ఆనంద్‌ని కలిశాడు. ఆనంద్‌ హీరోగా ఓకే చెప్పాక.. నేనూ కథ విన్నాను. నిర్మాతగా చేయాలనిపించింది. అలా, ఈ టీమ్‌లోకి నేను ఎంట్రీ ఇచ్చాను. మరో విషయం ఏమిటంటే.. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా టైమ్‌లోనే దామోదర నాకు ఓ కథ చెప్పాడు. ఇప్పుడు అదే కథను నేను నిర్మాతగా వెబ్‌ సిరీస్‌ రూపంలో తెరకెక్కిస్తున్నాను.

ఆనంద్‌ దేవరకొండ ఎందుకని కేవలం కొత్త దర్శకులతోనే సినిమాలు చేస్తున్నాడు?

ఆనంద్‌: పేరు పొందిన దర్శకుల సినిమాల్లో అవకాశాలు రావడం లేదు కాబట్టి..(నవ్వులు.. మధ్యలో విజయ్‌ అందుకుని ఇప్పుడే అవకాశాలు రావు. ఇంకా సమయం పడుతుంది అని అన్నాడు). కొత్త డైరెక్టర్లతో వర్క్‌ చేస్తే విభిన్నమైన కథల్లో నటించే అవకాశం ఉంటుంది. అందుకే నాకు వచ్చిన అవకాశాలను నటుడిగా సద్వినియోగం చేసుకుంటున్నాను.

‘పుష్పక విమానం’ ఫైనల్‌ కాపీ చూశాక విజయ్‌ రియాక్షన్‌ ఏమిటి?

ఆనంద్‌: అది విజయ్‌ మాత్రమే చెప్పగలడు.

విజయ్‌: సాధారణంగా నేను ఏ సినిమా చూసినా నా రియాక్షన్‌ ఒకేలా ఉంటుంది. ఏం మాట్లాడకుండా.. ఎలాంటి రియాక్షన్‌ లేకుండా ప్రతి సీన్‌ని అలా చూస్తూ ఉండిపోతాను. ‘పుష్పకవిమానం’ కూడా అలాగే చూశాను. ఫైనల్‌ కాపీ నాకు నచ్చింది.

ఆనంద్‌: యూఎస్‌లో ఉద్యోగం వదిలేసి ఇండియాకి వచ్చి కొన్ని నెలలపాటు ఖాళీ ఉండి.. సినిమాల్లోకి వస్తాను అని చెప్పినప్పుడు నీ రియాక్షన్‌ ఏమిటి?

విజయ్‌: నాకు అంతగా గుర్తులేదు. కానీ, ఆ మాట విని నవ్వుకున్నాను.

ఆనంద్‌: ‘‘సినిమా అవకాశం వచ్చింది. ఆనంద్‌ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు’’ అని నాన్న నీతో చెప్పారు. ఆ సమయంలో నువ్వు డిన్నర్‌ చేస్తున్నావు. నేను వేరే రూమ్‌లో ఉండి.. నువ్వు ఏం అంటావా?అని వింటున్నాను. నాన్న చెప్పడం పూర్తి కాగానే.. ఆయన జోక్‌ చేస్తున్నారనుకుని నువ్వు గట్టిగా నవ్వావు. ‘అన్నయ్య ఏంటి ఇలా నవ్వుతున్నాడు’ అని అనుకున్నాను.

‘పుష్పకవిమానం’లో మీకు బాగా నచ్చిన సాంగ్‌

విజయ్‌: సిలకా.. 

ఆనంద్‌: కల్యాణం పాట ఇష్టం. అందులో వచ్చే సన్నివేశాలు మనసును హత్తుకునేలా ఉంటాయి. ఆ సాంగ్‌ కూడా పెద్ద హిట్‌ అయ్యింది. ఇప్పుడు ఏ పెళ్లిలో విన్నా ఈ పాటే వినిపిస్తోంది. అదీ కాక.. సిద్ద్‌శ్రీరామ్‌ మొదటిసారి నా సినిమా కోసం పాట పాడాడు.

ఆనంద్‌ దేవరకొండ మొదటి సంపాదన ఎంత?

ఆనంద్‌: యూఎస్‌లో జాబ్‌లో చేరినప్పుడు నా మొదటి జీతం సంవత్సరానికి సుమారు రూ.40లక్షలు

ఆనంద్‌ దేవరకొండ షార్ట్‌ ఫిల్మ్స్‌ చేశాడా?

ఆనంద్‌: నటించలేదు

ఆనంద్‌ దేవరకొండ సింగిలా?

ఆనంద్‌: నాకు కూడా తెలీదు.

ఆనంద్‌కి ఏమంటే భయం?

ఆనంద్‌: నాకు పాములంటే చాలా భయం. నీటి అడుగుకి వెళ్లినా నాకు భయంగా ఉంటుంది.

ఆనంద్‌ ఇప్పటివరకూ నటించిన సినిమాలేమిటి?

ఆనంద్‌: దొరసాని, మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌, పుష్పక విమానం

విజయ్‌కి ఇష్టమైన నటులు

విజయ్‌: రణ్‌బీర్‌ కపూర్‌, మహేశ్‌బాబు

విజయ్‌ ఎవరితోనైనా డేటింగ్‌లో ఉన్నాడా?

విజయ్‌: ఈ మధ్య నాకు ఒక హార్ట్‌బ్రేక్‌ జరిగింది. ఇప్పటివరకూ ఆ విషయం ఎవ్వరికీ తెలీదు. అందుకే కొంచెం బాధలో ఉన్నా..!

విజయ్‌ ఎప్పుడైనా టాటూ వేయించుకున్నారా? భవిష్యత్తులో వేయించుకునే అవకాశం ఉందా?

విజయ్‌: ఇప్పటివరకూ వేయించుకోలేదు. ఒకవేళ ఈరోజు నచ్చిందని వేయించుకున్నాక.. రేపు ఎప్పుడైనా నచ్చకపోతే.. అందుకే ఎప్పుడూ ట్రై చేయలేదు.

విజయ్‌ దేవరకొండ స్టార్‌ కిడ్‌..?

విజయ్‌: నేను స్టార్‌ మాత్రమే

విజయ్‌కి హిందీ వచ్చా..?

విజయ్‌: ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నాను. ‘లైగర్‌’లో హిందీ డబ్బింగ్‌ నేనే చెప్పుకొంటున్నాను.

మీ మొదటి జీతం ఎంత?

విజయ్‌: మా మమ్మీ వాళ్ల ఆఫీస్‌లో క్లాస్‌లు చెప్పినందుకు రూ.500 ఇచ్చారు. ఓ స్కూల్‌లో చిన్నపిల్లలకి నాటకాల్లో శిక్షణ ఇచ్చాను. అప్పుడు నా జీతం రూ.35 వేలు. అప్పట్లో అది నాకు చాలా ఎక్కువ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని