MAA Elections: ‘మా’ అధ్యక్షుడిపై నటి హేమ తీవ్ర ఆరోపణలు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్ష ఎన్నికలపై నటి హేమ తీవ్ర ఆరోపణలు చేశారు.

Updated : 07 Aug 2021 15:28 IST

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు నరేశ్‌పై నటి హేమ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఏడాది జరగనున్న ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం రేసులోకి దిగుతున్న హేమ తాజాగా ఎలక్షన్స్‌ గురించి స్పందించారు. ఈ ఏడాది ‘మా’ అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడేలా కొంతమంది చూస్తున్నారని.. లేదా ఎన్నికలు లేకుండా నరేశ్‌నే అధ్యక్షుడిగా కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె వ్యాఖ్యలు చేశారు. అసోసియేషన్ నిధులను నరేశ్‌ విచ్చలవిడిగా ఖర్చుపెట్టారని విమర్శించారు. అధ్యక్ష పీఠం నుంచి దిగకుండా ఉండేందుకు నరేశ్‌ ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె తీవ్రంగా ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఉదయం 200 మంది అసోసియేషన్‌ సభ్యులకు హేమ లేఖలు రాశారు. ఏది ఏమైనా ఈ ఏడాది ‘మా’ అధ్యక్ష ఎన్నికలు జరిగేలా చూడాలంటూ వారందరి నుంచి ఆమె సంతకాలు సేకరించారు.

ఈ మేరకు సభ్యులతో హేమ మాట్లాడిన వాయిస్ రికార్డ్ బయపడింది. ఎన్నికల కోసం పట్టుపట్టాలని సభ్యులంతా సంతకాలు చేయాలని కోరుతున్నట్లు ఆడియో రికార్డు లో హేమ స్పష్టం చేశారు. హేమ వాయిస్ రికార్డు బయటకు రావడంపై మా అసోసియేషన్ ఎన్నికలపై కొద్దిరోజుల నుంచి స్తబ్దుగా ఉన్న వాతావరణం మరోసారి వేడెక్కింది. ఇటీవలే మా ఎన్నికల వివాదంపై సమావేశమైన క్రమశిక్షణ కమిటీ సెప్టెంబర్ 12న మా ఎన్నికలు జరపాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ క్రమంలో హేమ వాయిస్ రికార్డు బయటికి రావడం అసోసియేషన్ లో దుమారం చెలరేగింది. ఏకంగా ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్‌పై ఆరోపణలు చేయడం ఈ వివాదానికి మరింజ ఆజ్యం పోసినట్టైంది.

‘మా’ అధ్యక్ష ఎన్నికలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నడూ లేనివిధంగా ఈసారి మొత్తం ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ప్రకాశ్‌ రాజ్‌ తన ప్యానల్‌ని ప్రకటించగా.. మంచు విష్ణు, జీవిత, హేమ, సీవీఎల్‌ నరసింహారావు బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల తేదీని వెంటనే ప్రకటించాలని ఓ వైపు ప్రకాశ్‌రాజ్‌ కోరుతుండగా.. ఈ సారి ఎన్నికలు ఏకగ్రీవం కావాలనుకుంటున్నట్లు విష్ణు పలు ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ క్రమంలోనే గత కొన్నిరోజుల నుంచి సైలెంట్‌గా ఉన్న హేమ ఉన్నట్లుండి అధ్యక్షుడు నరేశ్‌పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని