Sivasankar: శివశంకర్‌ని కలవడం అదే చివరిసారి అవుతుందనుకోలేదు: చిరంజీవి

తన నృత్య రీతులతో ఎన్నో పాటలకు వన్నె తీసుకొచ్చి, ఎందరో నటులకు స్టార్‌డమ్‌ తెచ్చిన శివశంకర్‌ మాస్టర్‌ మరణం చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపింది.

Published : 29 Nov 2021 01:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన నృత్య రీతులతో ఎన్నో పాటలకు వన్నె తీసుకొచ్చి, ఎందరో నటులకు స్టార్‌డమ్‌ తెచ్చిన శివశంకర్‌ మాస్టర్‌ మరణం చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపింది. కరోనా నుంచి కోలుకుని వస్తారనుకున్న ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. శివశంకర్‌ ఇకలేరన్న విషయం తెలుసుకున్న రాజకీయ, సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం ప్రకటించారు.

* శివశంకర్‌ మృతితో సినీ పరిశ్రమ ముద్దుబిడ్డను కోల్పోయింది. నృత్యం, నటనతో లక్షలమంది అభిమానాన్ని ఆయన సంపాదించారు.-చంద్రబాబు

* శివశంకర్‌ మాస్టర్‌ మరణ వార్త నన్ను కలచివేసింది. ఆయనా నేనూ కలిసి చాలా సినిమాలకు పనిచేశాం. ‘ఖైదీ’ చిత్రంతో మా స్నేహం మొదలైంది. ఇటీవల ‘ఆచార్య’ సెట్‌లో కలుసుకున్నాం. అదే చివరిసారి అవుతుందని అస్సలు ఊహించలేదు. ఓ ఆత్మీయుడ్ని కోల్పోయా. ఆయన మృతి నృత్య కళకే కాదు యావత్‌ సినీ     పరిశ్రమకే తీరనిలోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. - నటుడు చిరంజీవి

* శివశంకర్‌ మాస్టర్‌ చనిపోయారన్న వార్త విని నా గుండె పలిగింది. ఆయన్ను రక్షించేందుకు మా వంతు ప్రయత్నం చేశాం. కానీ, భగవంతుడు ఇలా చేశాడు. మాస్టర్‌.. సినీ పరిశ్రమ మిమ్మల్ని మిస్‌ అవుతుంది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. -నటుడు సోనూసూద్‌

* శివశంకర్‌ మాస్టర్‌ లేరన్న విషయం బాధ కలిగించింది. ఆయన కుటుంబానికి మా సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం. - శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణ సంస్థ

* కొవిడ్‌కు చికిత్స పొందిన శివశంకర్‌ మాస్టర్‌ కోలుకుంటారని భావించా. ఆయన కన్నుమూయడం బాధాకరం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. శాస్త్రీయ నృత్యంలో పట్టున్న ఆయన సినీ నృత్యంలో ఆ పరిజ్ఞానాన్ని మేళవించారు. ప్రేక్షకుల్ని మెప్పించారు. ‘మగధీర’లోని ఓ పాటకు జాతీయస్థాయి       పురస్కారాన్ని అందుకున్నారు. శివశంకర్‌ మాస్టర్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా. - నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.

* శివశంకర్‌ మాస్టర్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన చాలా మంచి వ్యక్తి. కొన్ని సినిమాలకు ఇద్దరం కలిసి పనిచేశాం. ఆయన మృతిపట్ల చింతిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దైవాన్ని ప్రార్థిస్తున్నా. - నటుడు బాలకృష్ణ.

* శివశంకర్‌గారు చనిపోయారన్న వార్త బాధను కలిగించింది. ‘మగధీర’ సినిమా కోసం ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి పంచింది.  ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా. శివశంకర్‌ కుటుంబ సభ్యులకు నా సానుభూతి. - దర్శకుడు రాజమౌళి.

* శివశంకర్‌ మాస్టర్‌ నృత్యానికి బ్రాండ్‌ అంబాసిడర్‌. అనేక చిత్రాలకు అద్భుత నృత్యరీతులు సమకూర్చారు.-నారా లోకేశ్‌

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని