Updated : 08/10/2021 13:23 IST

MAA Elections: నరేశ్‌ వల్లే ‘మా’లో ఇన్ని గొడవలు

శివాజీ రాజా సంచలన ఆరోపణలు

హైదరాబాద్‌: ‘మా’లో ఇప్పుడు జరుగుతోన్న వివాదాలన్నింటికీ నరేశ్‌ ఒక్కడే కారణమని ‘మా’ మాజీ అధ్యక్షుడు, నటుడు శివాజీ రాజా ఆరోపించారు. విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలతో ఈసారి ‘మా’ ఎన్నికల ప్రచారం వాడీవేడీగా సాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మా’ అధ్యక్షుడిగా పనిచేసిన శివాజీ రాజా తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశారు. గతేడాది నాగబాబు మద్దతు ప్రకటించి ఉండకపోయి ఉంటే నరేశ్‌ విజయం సాధించేవాడు కాదని అన్నారు. నరేశ్‌కు నాగబాబు ఎందుకు మద్దతు ఇచ్చారో ఇప్పటికీ తనకి తెలియదని పేర్కొన్నారు. ఇక నరేశ్‌ ఆడే పాచికల ఆటలో ప్రాణమిత్రులు కూడా విడిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయని శివాజీ రాజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో నరేశ్‌ చిన్నపిల్లాడు. అతడు ఎప్పుడూ అబద్ధాలే చెబుతాడు. అతడి నోటి వెంట నిజం వచ్చిన రోజు నేను ఆశ్చర్యపోతా. నరేశ్‌ నాకు శత్రువు కాదు. కానీ అతడు నాపై అసత్యప్రచారాలు చేశాడు. నేను ‘మా’ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఫండ్‌ రైజింగ్‌ కోసం అమెరికాలో ఓ ఈవెంట్‌ నిర్వహించాం. సినీ పరిశ్రమకు చెందిన సీనియర్‌, జూనియర్‌ నటీనటుల్ని తీసుకువెళ్లి అక్కడ ప్రోగ్రామ్‌ చేశాం. చిరంజీవి కూడా వచ్చారు. జనరల్‌ సెక్రటరీగా వ్యవహరిస్తున్న నరేశ్‌ ఆ ప్రోగ్రామ్‌కి రాలేదు. ఇక్కడ వేరే వాళ్లతో మీటింగ్‌ పెట్టుకున్నాడు. యూఎస్‌ టూర్‌ విమాన టిక్కెట్ల వ్యవహారంలో నేను, శ్రీకాంత్‌ డబ్బులు వాడుకున్నామని ఆరోపణలు వచ్చేలా చేశాడు. దీనిపై చిరంజీవి.. సినీ పెద్దలతో ఓ కమిటీ వేసి అవన్నీ అవాస్తవాలే అని.. శ్రీకాంత్‌, నేను డబ్బుల విషయంలో ఎలాంటి తప్పులు చేయలేదని తేల్చారు. అయినా సరే.. నరేశ్‌ ఇప్పటివరకూ మాకు క్షమాపణలు చెప్పలేదు. నా హయాంలో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్‌ల ద్వారా వచ్చిన ఫండ్‌ని ఇప్పుడు ‘మా’ సంక్షేమం కోసం నరేశ్‌ వినియోగిస్తున్నాడు. అతని రాకతోనే అసోసియేషన్‌లో రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ‘మా’ ఎన్నికలు రచ్చకెక్కడానికి అతడే కారణం.  చిన్న చిన్న విషయాలకు కూడా అబద్ధాలు ఆడతాడు. నాకు, శ్రీకాంత్‌కి సారీ చెప్పేవరకూ నేను అతడిని తిడుతూనే ఉంటాను. అతడి వల్ల మా స్నేహ్నాలు కూడా చెడిపోయాయి’

‘‘మా’ సభ్యుల కోసం ఓ వృద్ధాశ్రమం నిర్మించాలని నేను అనుకున్నాను. దానికి ఫండ్‌ రైజ్‌ చేయడం కోసం యూఎస్‌లో మరోసారి ప్రోగ్రామ్‌ పెట్టాలనుకున్నాను. మహేశ్‌తో ఆ విషయం చెప్పగానే.. ‘నాకు ఓకే. ఒక్కసారి నమ్రతని కలిసి ఈ విషయం చెప్పండి’ అని అన్నారు. వెంటనే నేను, బెనర్జీ, నరేశ్‌ మరో ఎనిమిది మంది సభ్యులు మహేశ్‌ ఇంటికి వెళ్లి నమ్రతతో మాట్లాడాం.. ఆమె కూడా ఓకే అన్నారు. ప్రభాస్‌ని కలిస్తే.. ‘వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాను. రాలేకపోవచ్చు. మీరు ఎక్కువగా శ్రమించకండి. ఆ ఫండ్‌లో నా వాటాగా రూ.2 కోట్లు ఇస్తాను’ అని చెప్పారు. ఆ మాట నాకెంతో తృప్తినిచ్చింది. ఇలా స్టార్‌హీరోహీరోయిన్స్ ప్రోగ్రామ్‌కి ఓకే అన్నాక.. నరేశ్‌ ప్రెస్‌మీట్ పెట్టి నాపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత వెంటనే ‘మా’ ఎన్నికలు జరిగాయి. మా ప్యానల్‌ ఓడిపోయింది. దాంతో ఆ ప్రోగ్రామ్‌ ఆగిపోయింది. నా కల అలాగే నిలిచిపోయింది. నిజం చెప్పాలంటే మహేశ్‌ వాళ్ల ఇల్లు ఎక్కడో కూడా నరేశ్‌కి సరిగ్గా తెలీదు’ అని శివాజీ రాజా తీవ్ర ఆరోపణలు చేశాడు. అనంతరం ఈసారి జరుగుతున్న ‘మా’ ఎన్నికలపై తాను స్పందించాలనుకోవడం లేదని అన్నారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని