Akash puri: మా నాన్న గర్వపడేలా నటిస్తా!

‘‘విధి నన్ను, పూరి జగన్నాథ్‌, ఛార్మిని కలిపింది. మేం ముగ్గురం ఒక్కటే ఫిక్స్‌ అయిపోయాం. ‘లైగర్‌’తో భారతదేశాన్ని ఊపేయాలని! 2022లో అది జరుగుతుంది’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ. ఆయన శుక్రవారం...

Updated : 23 Oct 2021 10:15 IST

- ఆకాష్‌ పూరి

‘‘విధి నన్ను, పూరి జగన్నాథ్‌, ఛార్మిని కలిపింది. మేం ముగ్గురం ఒక్కటే ఫిక్స్‌ అయిపోయాం. ‘లైగర్‌’తో భారతదేశాన్ని ఊపేయాలని! 2022లో అది జరుగుతుంది’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ. ఆయన శుక్రవారం వరంగల్‌లో జరిగిన ‘రొమాంటిక్‌’ ముందుస్తు విడుదల వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎంపీ పసునూరి దయాకర్‌, మేయర్‌ సుధారాణి వేడుకకి హాజరయ్యారు. ఆకాష్‌ పూరి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. కేతిక శర్మ కథానాయిక. అనిల్‌ దర్శకత్వం వహించారు. పూరి జగన్నాథ్‌ కథ, మాటలు, స్క్రీన్‌ప్లే సమకూర్చారు. ఆయనే ఛార్మితో కలిసి నిర్మించారు. ఈ నెల 29న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్బంగా విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘‘ఆకాష్‌లో తపన ఉంది. ఇంత మంది మధ్య తను అనుకున్నది చెప్పే ధైర్యం ఉంది. ఆకాష్‌ సినిమా పిచ్చి గురించి నాకు ఛార్మి చెబుతుంటారు. అన్ని సినిమాలూ నచ్చుతుంటాయి. నీలాంటివాళ్లు వందశాతం విజయవంతం కావాలి. కేతికకి మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమా నిర్మాత, రచయత ఛార్మి, పూరి జగన్నాథ్‌ నా మనుషులు. ‘లైగర్‌’ కోసం వీళ్లు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు’’ అన్నారు. పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ ‘‘వరంగల్‌ ప్రజలకి కళాకారులంటే పిచ్చి. మాకు వరంగల్‌ అంటే సెంటిమెంట్‌. ఇకపై ప్రతీ సంబరం ఇక్కడే చేసుకుంటాం. ‘రొమాంటిక్‌’ సినిమాని అనిల్‌ చాలా బాగా తెరకెక్కించాడు. ఎక్కడా బోర్‌ కొట్టదు. ఆకాష్‌, కేతిక, రమ్య చాలా బాగా నటించారు. చాలా ట్రెండీగా ఉండే సినిమా. మా అబ్బాయి చిన్నప్పట్నుంచి ఉదయం లేవగానే ఓ డైలాగ్‌ చెప్పి ఓ వేషం అని అడిగేవాడు. దర్శకుడిగా తన గురించి ఒక మాటే చెబుతాను, వాడు మంచి నటుడు. రమ్యకృష్ణ వల్ల ఈ సినిమా జాతకమే మారిపోయింది. ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసిన ప్రభాస్‌ డార్లింగ్‌కి కృతజ్ఞతలు చెబుతున్నా. విజయ్‌ దేవరకొండతో ‘లైగర్‌’ చేస్తున్నాను, తన నటన నాకే షాకింగ్‌గా ఉంది’’ అన్నారు. ‘‘దర్శకుడు, మా బృందం అంతా  ప్రాణం పెట్టి చేశాం. ఎలాంటి నేపథ్యం లేకున్నా కష్టపడి పరిశ్రమ అనే మహాసముద్రంలో దూకారు మా నాన్న. మధ్యలో పూరి కెరీర్‌ అయిపోయిందని అన్నారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో ఆయనిచ్చిన ఊపు మామూలుది కాదు. థియేటర్లలో మా నాన్న సంభాషణలు విని ఎగురుతుంటే కాలర్‌ ఎగరేశా. అలా మా నాన్న కూడా గర్వపడేలా నేను నటిస్తా. మా నాన్న పరిశ్రమ కోసం ఎంతో ఇచ్చారు. నేను ఈ పరిశ్రమలో పుట్టి పెరిగాను. మా నాన్న పరిశ్రమకి ఇచ్చినదానికంటే ఇంకో శాతం ఎక్కువే ఇస్తాను. ఓ లక్ష్యం ఉండాలని చెబుతుంటారు మా నాన్న. ఇకపై మా నాన్న కాలర్‌ ఎగరేసేలా చేయడమే నా లక్ష్యం’’ అన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ‘‘పూరి జగన్నాథ్‌ తీసే ప్రతీ సినిమా ఇక్కడే మొదలు పెట్టాలని చెబుతున్నా. వరంగల్‌లో ఏది మొదలు పెట్టినా విజయవంతం అవుతుంది. ఇక్కడ ఎన్నో పురాతనమైన కట్టడాలు ఉన్నాయి. వాటన్నిటినీ తీర్చిదిద్దాం’’ అన్నారు. ఛార్మి, వరంగల్‌ శ్రీనివాస్‌తోపాటు ‘రొమాంటిక్‌’ చిత్రబృందం పాల్గొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని