Sirivennela: ‘ఇదే చివరి పాట కావొచ్చు’ అని ఆ రోజు గట్టిగా నవ్వేశారు!

ప్రముఖ సినీ గేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి(Sirivennela SeetharamaSastry) మృతిని చిత్ర పరిశ్రమ ఇప్పటికీ మరువలేకపోతోంది.

Published : 05 Dec 2021 02:12 IST

హైదరాబాద్‌: ప్రముఖ సినీ గేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి (Sirivennela SeetharamaSastry) మృతిని చిత్ర పరిశ్రమ ఇప్పటికీ మరువలేకపోతోంది. ‘పాటల రూపంలో ఆయన బతికే ఉన్నారు’ అన్న నిజంతో ముందుకు సాగుతోంది. కాగా, నాని కథానాయకుడిగా రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. సాయిపల్లవి, కృతిశెట్టి కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. మిక్కీ జే మేయర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమా కోసం ‘సిరివెన్నెల’ రెండు పాటలు రాశారు. అందులో ఒక పాటకు ఆయన పేరే పెట్టి విడుదల చేస్తున్నట్లు కథానాయకుడు నాని (Nani) ప్రకటించారు. అసలు ఈ పాట రాసినప్పుడు సిరివెన్నెల (Sirivennela SeetharamaSastry) ఏమన్నారన్న విషయాన్ని దర్శకుడు రాహుల్‌ పంచుకున్నారు.

‘‘నవంబరు 3వ తేదీ రాత్రి సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela SeetharamaSastry) గారు ఫోన్‌ చేశారు. ‘ఆరోగ్యం సహకరించక ఈ పాటను పూర్తి చేయలేకపోతున్నా ఇంకెవరితోనైనా రాయిద్దాం’ అన్నారు. ‘పర్వాలేదు సర్‌’ అని చెప్పా. మరుసటి రోజు ఉదయం ఆయనే కాల్‌ చేసి నన్ను నిద్రలేపారు. ఆ రోజు దీపావళి. ‘పల్లవి అయిపోయింది చెబుతాను రాసుకో’ అన్నారు. సడెన్‌గా చెప్పేసరికి ఎక్కడ రాయాలో అర్థం కాలేదు. పక్కనే మహాభారతం పుస్తకం ఉంటే దాని మీద రాసేశాను. అద్భుతమైన ఆరు లైన్లు ఇచ్చారు. అందులో మొదటి లైన్‌లో ఆయన పేరు రాశారు. ‘ఎందుకు సర్‌ ఈ పాటకు మీ సంతకం ఇచ్చారు’ అని అడిగాను. ‘బహుశా ఇదే నా ఆఖరి పాట అవ్వొచ్చు’ అని గట్టిగా నవ్వారు’’ అని రాహుల్‌ చెప్పారు. ‘‘ఈ పాట రికార్డింగ్‌ మొదలు పెట్టిన రోజునే ఆయన అంత్యక్రియలు జరిగాయి. పాట చాలా బాగా వచ్చింది సర్‌.. అందుకే మీ పేరే పెట్టుకున్నాం. మీరు వెళ్లిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని కొత్తగా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం మాకు వచ్చినందుకు మా టీమ్ తరపున ధన్యవాదాలు’’ అని రాహుల్‌ సాంకృత్యన్‌ భావోద్వేగంతో మాట్లాడారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని