Puri Musings: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు పూరీ జగన్నాథ్‌ సూచన

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ చిన్న సలహా ఇచ్చారు. వ్యాపారం అభివృద్ధి చెందాలంటే కేవలం సంస్థకు పెట్టే పేరు, మార్కెటింగ్‌ మాత్రమే కాకుండా.. ఆ టౌన్‌షిప్‌ బోర్డు కూడా భారీ...

Published : 20 Jan 2022 10:48 IST

హైదరాబాద్‌: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ చిన్న సలహా ఇచ్చారు. వ్యాపారం అభివృద్ధి చెందాలంటే కేవలం సంస్థకు పెట్టే పేరు, మార్కెటింగ్‌ మాత్రమే కాకుండా..  ఆ టౌన్‌షిప్‌ బోర్డు కూడా భారీగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఈ మేరకు తాజాగా ఆయన ‘హాలీవుడ్‌’ అంశంపై ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘హాలీవుడ్‌’ అంటే కేవలం సినిమా అని మాత్రమే గుర్తుకొస్తుందని.. కానీ దాని వెనుక వేరే కథ ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

‘‘హాలీవుడ్‌.. ఈ పేరు తెలియనివాళ్లు ఉండరు. హాలీవుడ్‌లో పనిచేయాలనేది ప్రతి ఒక్కరి కల. అసలు ఈ పేరు ఎలా వచ్చిందంటే.. హార్వే హెండర్సన్ విల్కాక్స్ (Harvey Henderson Wilcox) అనే వ్యక్తికి లాస్‌ ఏంజెల్స్‌లో ఓ పెద్ద రాంచ్‌(Ranch) ఉండేది. ఆ స్థలంలో విట్లీ అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారితో కలిసి ప్లాట్స్‌ వేయాలని అతడు నిర్ణయించుకున్నాడు. ఆ ప్రాజెక్ట్‌కి హార్వే వాళ్ల సతీమణి ‘హాలీవుడ్‌’ (ది ల్యాండ్‌ ఆఫ్‌ హోలీ బుష్‌) అనే పేరు పెట్టింది. లాస్‌ ఏంజెల్స్‌ అనేది ఎడారి ప్రాంతం. అలాంటి ఈ ప్రాంతంలో మొక్కలు, చెట్లు రాబోతున్నాయి అని దాని అర్థం. 1887లో హాలీవుడ్‌ని ప్రారంభించి.. అందర్నీ ఆకర్షించడం కోసం అక్కడ కొండ మీద హాలీవుడ్‌ అని భారీగా రాశారు. సుసంపన్న, ప్రసిద్ధ నివాస ప్రాంతం అని చెబుతూ విట్లీ మార్కెటింగ్‌ చేయడం ప్రారంభించాడు.

1910లో అక్కడి ప్రభుత్వం దాన్ని మున్సిపాలిటీగా మార్చింది. దాంతో అక్కడ ఎక్కువగా సినిమావాళ్లు స్థలాలు కొనుగోలు చేశారు. ఆ తర్వాత సినిమా చేయాలంటే హాలీవుడ్‌ సరైన ప్రాంతంగా మారింది. దానికి మరొక కారణం కూడా ఉంది. థామస్ అల్వా ఎడిసన్ 21 ఏళ్లకే దాదాపు 1000 పేటెంట్‌ రైట్స్‌ రిజిస్టర్‌ చేయించుకున్నాడు. టెలీగ్రాఫ్‌, టెలీఫోన్‌, మైక్రోఫోన్‌, మోషన్‌ పిక్చర్‌.. ఇలా చాలా పేటెంట్‌ రైట్స్‌ అతని దగ్గర ఉండేవి. ఎవరైనా మోషన్‌ పిక్చర్‌ తీయాలంటే అతడ్ని కలవాల్సి వచ్చేది. ఆ రోజుల్లో హాలీవుడ్‌ ఏరియాలో ఉండేవారికి అది వర్తించేది కాదు. దాంతో ‘‘ఇఫ్‌ యూ వాంట్‌ టు మేక్‌ మూవీస్‌, గో టు హాలీవుడ్‌. ఇట్‌ ఈజ్‌ ది బెస్ట్‌ ప్లేస్ టు మేక్‌ మూవీస్‌’’ అనే స్లోగన్‌ వచ్చింది. అంతేకాకుండా అక్కడ ఉన్న ప్రకృతి అందాలు కూడా మూవీ మేకింగ్‌కు ఎంతో ఉపయోగపడేవి. దాంతో హాలీవుడ్‌ అనేది సినిమాలకు ఉత్తమమైన ప్రాంతంగా మారింది.

ఆ తర్వాత మిస్టర్‌ ఖన్నా అనే వ్యక్తి హాలీవుడ్‌ను స్ఫూర్తిగా తీసుకుని బాలీవుడ్‌ పెట్టారు. బాలీవుడ్‌ అనే మాట తనకు నచ్చలేదని అమితాబ్‌ బచ్చన్‌ ఫోన్‌ చేసి మరీ ఖన్నాను తిట్టారు. కానీ, అప్పటికే మీడియాలో అందరూ రాసేయడం వల్ల ఆ పేరు పాపులర్‌ అయిపోయింది. దాన్ని చూసి మనం టాలీవుడ్‌, కోలీవుడ్‌ అని పెట్టుకున్నాం. మనమే కాదు కొరియన్‌ వాళ్లు హోయూవుడ్‌, పాకిస్థాన్‌ వాళ్లు లాలీవుడ్‌ అని పెట్టుకున్నారు. కానీ యూకే, కెనడాలో ఉన్న ఫిల్మ్‌ ఇండస్ట్రీ హాలీవుడ్‌ కిందకు రాదు. ఇవన్నీ పక్కన పెడితే హాలీవుడ్‌ అనేది ఒక రియల్‌ ఎస్టేట్‌ బోర్డు. అది అందరికీ కనిపించేలా పెద్ద పెద్ద అక్షరాలతో కొండపై పెట్టడం వల్ల దాని జాతకం మారిపోయింది. పాపులర్‌ అయిపోయింది. అందుకే రియల్‌ ఎస్టేట్‌ వాళ్లు గుర్తు పెట్టుకోవాల్సి విషయం ఏమిటంటే.. టైటిల్‌, మార్కెటింగ్‌తోపాటు సైజ్‌ ఆఫ్‌ ది బోర్డ్‌ కూడా ఎంతో అవసరం. ఏ పేరు పెట్టినా పెద్ద బోర్డు మాత్రం పెట్టండి’’ అని పూరీ జగన్నాథ్‌ సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని