Naresh: శ్రీకాంత్‌ జోక్యం చేసుకోవడం సమంజసం కాదు: నరేశ్‌

సాయి ధరమ్‌ తేజ్ రోడ్డు ప్రమాదం విషయంలో తనపై కథానాయకుడు శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలను సీనియర్ నటుడు నరేశ్‌ తప్పుపట్టారు.

Updated : 14 Sep 2021 15:56 IST

హైదరాబాద్‌: సాయి ధరమ్‌ తేజ్ రోడ్డు ప్రమాదం విషయంలో తనపై కథానాయకుడు శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలను సీనియర్ నటుడు నరేశ్‌ తప్పుపట్టారు. సాయితేజ్ విషయంలో తాను విడుదల చేసిన వీడియో బైట్ మీడియాలో తప్పుగా ప్రసారం కావడం వల్ల పెద్దలు మందలించారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో శ్రీకాంత్ జోక్యం చేసుకోవడం సమంజసంగా లేదని మండిపడ్డారు. తన ముందే హీరోగా ఎదిగి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీకాంత్... మా ఎన్నికల్లో పోటీ చేసి దురదృష్టవశాత్తూ తమ ప్యానల్ ముందు ఓడిపోయారని తెలిపారు. 50 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్న తాను ఎలాంటి వివాదాలు, విమర్శలకు తావులేకుండా మాట్లాడతానని నరేశ్‌ స్పష్టం చేశారు. శ్రీకాంత్ మరోసారి వీడియోలు విడుదల చేసేముందు జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికారు. యుక్త వయస్సులో వచ్చిన వాళ్లకు ద్విచక్రవాహనాలు నడపడం సహజమని, అదే స్థాయిలో ప్రమాదాలు కూడా సహజమని నరేశ్‌ వ్యాఖ్యానించారు. సాయితేజ్ స్పీడ్‌గా వెళ్లలేదని, జారిపడిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని మరోమారు తెలిపారు.

అసలు ఏం జరిగింది?

సాయిధరమ్‌ తేజ్‌కు రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత నటుడు నరేశ్‌ స్పందించారు. తన ఇంటి నుంచే సాయితేజ్‌ బయలుదేరి వెళ్లినట్లు చెప్పారు. ఆస్పత్రిలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వెళ్లి కలవలేకపోయానని, ఇంటికి వచ్చాక వెళ్లి కలుస్తానని చెప్పారు. ‘గతంలో కూడా కోట శ్రీనివాసరావు, బాబూమోహన్‌, కోమటిరెడ్డిగారి కుమారులు ఇలాగే ప్రమాదాలకు గురై, కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచెత్తి వెళ్లారు. రానున్న రోజుల్లో బైక్‌లు ముట్టుకోకుండా చేయాలి’ అని నరేశ్‌ అన్నారు. నరేశ్‌ అలా మాట్లాడటం సినీ పరిశ్రమలోని కొందరిని బాధించింది. ఈ క్రమంలోనే సాయితేజ్‌ ప్రమాదం గురించి శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. నరేశ్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.

‘‘సాయిధరమ్‌ తేజ్‌కు ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. చాలా చిన్న యాక్సిడెంట్.  ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. నాకు తెలిసి, ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఉన్న యువ కథానాయకుల్లో పరిణతి కలిగిన వ్యక్తుల్లో సాయితేజ్‌ ఒకరు. అతను వాహనాన్ని వేగంగా నడిపే వ్యక్తి మాత్రం కాదు. ప్రమాదం గురించి చాలా మంది తమ అభిప్రాయాలను చెబుతున్నారు. వీడియోలు విడుదల చేసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకుని పెట్టండి. ఎందుకంటే ప్రమాదం జరిగిన వ్యక్తి కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంటుంది. అలాంటి సమయంలో జాగ్రత్తగా మాట్లాడాలి. నరేశ్‌ చనిపోయిన వారి గురించి మాట్లాడకుండా ఉంటే బాగుండేదనిపించింది’’ అని శ్రీకాంత్‌ అనడంతో వీరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని