Vijay Deverakonda: ఆ విషయంలో నాకు ఏడుపొస్తుంది: విజయ్‌ దేవరకొండ

‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంతో సంచలన హీరోగా మారిన విజయ్‌ దేవరకొండ  త్వరలోనే ‘లైగర్‌’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఈ నెల 25న విడుదలకానున్న నేపథ్యంలో ప్రచారాన్ని ఫుల్‌జోష్‌తో చేస్తున్నారు. ఇప్పటికే పలు నగరాల్లో ప్రెస్‌మీట్‌లలో పాల్గొన్న ఆయన సోమవారం నగరంలో ఏర్పాటు చేసిన మీట్‌కి హాజరయ్యారు.

Published : 15 Aug 2022 17:22 IST

హైదరాబాద్‌: ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంతో సంచలన హీరోగా మారిన విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) త్వరలోనే ‘లైగర్‌’గా (Liger) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఈ నెల 25న విడుదలకానున్న నేపథ్యంలో ప్రచారాన్ని ఫుల్‌జోష్‌తో చేస్తున్నారు. ఇప్పటికే పలు నగరాల్లో ప్రెస్‌మీట్‌లలో పాల్గొన్న ఆయన సోమవారం నగరంలో ఏర్పాటు చేసిన మీట్‌కి హాజరయ్యారు. విజయ్‌తోపాటు కథానాయిక అనన్య పాండే పాల్గొన్నారు. మరి, ఏ విషయంలో విజయ్‌కి ఏడుపొస్తుంది? ఆయన మాటల్లోనే..

పక్కా తెలుగు సినిమా

‘‘ముందుగా ఈ సినిమాని తెలుగులోనే తెరకెక్కించాలనుకున్నాం. ఇప్పటికే మన తెలుగు సినిమాలు కొన్ని పాన్‌ ఇండియా స్థాయిలో సత్తా చాటాయి. ‘మన కంటెంటూ అన్ని భాషల వారినీ ఆకట్టుకుంటుంది. ఆ రేంజ్‌లో మనమెందుకు చేయకూడదు’ అని అనిపించింది. అలా ప్రాంతీయ సినిమాగా రూపొందించాలనుకున్నది కాస్తా జాతీయ స్థాయిలో తెరకెక్కింది. ‘‘లైగర్‌’ హిందీ సినిమాలా అనిపిస్తోంది’ అనే భావన చాలామందిలో ఉంది. ఈ చిత్రానికి పనిచేసిన సంగీత దర్శకులంతా బాలీవుడ్‌ వారు. అందుకే పాటలన్నీ హిందీలో ఉన్నట్టు అనిపిస్తుంది. చిత్రీకరణ సమయానికి హిందీ వెర్షన్‌ పాటలు మాత్రమే పూర్తయ్యాయి. టాకీ పార్ట్‌ని తెలుగు, హిందీ వెర్షన్లలో షూట్‌ చేశాం. కథ పరంగా ఇది పక్కా తెలుగు సినిమా’’

కరణ్‌తో పరిచయం..

‘‘నా ‘అర్జున్‌రెడ్డి’ సినిమా తనకి బాగా నచ్చటంతో కరణ్‌ జోహార్‌ నాకు కాల్‌ చేసి, మాట్లాడారు. నాతో సినిమా చేసే ఉద్దేశం ఉందని చెప్పారు. తన దగ్గరకు వచ్చే కొన్ని కథలను నాకు పంపిస్తానన్నారు. ఓ రోజు.. ‘‘పూరీ జగన్నాథ్‌ నాతో చేయబోయే సినిమాని పాన్‌ ఇండియా స్థాయిలో చేయాలనుంది’’ అని లైగర్‌ గురించి ఆయనకు వివరించా. కథ వినకుండానే సినిమాను నిర్మించేందుకు కరణ్‌ ఓకే అన్నారు’’

ఆ సినిమాతో సంబంధం ఉండదు

‘‘చాలామంది ‘లైగర్’ను ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమాతో పోలుస్తున్నారు. కానీ, రెండింటికీ ఏం సంబంధం ఉండదు. నేను రీమేక్‌లు, గత చిత్రాలకు దగ్గరకు ఉండే కథల్ని ఎంపిక చేసుకునే వాణ్ణి కాదు. ‘లైగర్‌’.. తల్లీకొడుకుల ఎమోషన్‌ ప్రధానంగా సాగుతుంది. ఇందులోని హీరో పాత్రకి నత్తి ఉంటుంది. దాన్ని ఎంజాయ్‌ చేస్తూ నటించా. నత్తి బాగా అలవాటు కావటంతో ఇప్పుడు మామూలుగా మాట్లాడాలంటే నచ్చట్లేదు’’

ట్రోలింగ్‌ తప్పదు!

‘‘నటుణ్ణికాక ముందు మా బంధువులు నన్ను విమర్శించేవారు. ‘ఏ ర్యాంక్‌ నీది? మా వాళ్లు ఆ కాలేజీ.. ఈ కాలేజీ. జీవితంలో నువ్వు ఏం చేస్తావ్‌రా?’ అని ట్రోల్‌ చేసేవారు. యాక్టర్‌ని అయ్యాక కొందరు సోషల్‌ మీడియా ద్వారా నన్ను ట్రోల్‌ చేస్తున్నారు. ఎప్పుడైనా విమర్శలు అనేవి తప్పవు. నా తొలి సినిమా నుంచీ నేను ఒకేలా ఉన్నా. నేను నటించిన సినిమాల గురించి నాకు అనిపించింది చెప్తుంటా. అలా చేయటం వల్ల మీడియా వారు కూడా నన్ను వదల్లేదు. ‘వీడికి బలుపు. సినిమా విడుదలవకుండానే హిట్‌ అని చెప్తాడు. వీడు చాలా నేర్చుకోవాలి’ అని కొందరు అన్నారు’’

అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశా

‘‘కెరీర్‌ తొలినాళ్లలో నటుడిగా అవకాశాలు లభించకపోవడంతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూ పరిచయాలు పెంచుకుని, ఆ తర్వాత యాక్టర్‌ని కావాలనుకున్నా. ఆ క్రమంలో దర్శకుడు తేజ దగ్గర కొంతకాలం పనిచేశా. ‘అసిస్టెంట్‌ డైరెక్టర్లకు పూరీ జగన్నాథ్‌ ఎక్కువ డబ్బులు ఇస్తాడు. అతని దగ్గర పనిచేసేందుకు ప్రయత్నించు’ అని మా నాన్న అన్నారు. ఆయన మాట మేరకు పూరీ ఆఫీస్‌కు వెళ్లా. అక్కడంతా బిజీగా ఉంది. నేను ఎవరో అప్పటికి ఎవరికీ తెలియదు కాబట్టి వెళ్లిన పని కాలేదు. ఇంటికి వచ్చాక ‘పూరీని కలిశా’ అని నాన్నకు అబద్ధం చెప్పా. నేను హీరోగా నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’ సమయంలో పూరీ జగన్నాథ్‌ని కలిశా. ఆయన చెప్పిన ‘లైగర్‌’ కథ వినగానే బాగా నచ్చేసింది. దాంతో ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చాం’’

సవాలు విసిరింది

‘‘మంచి కంటెంట్‌ ఉన్న చిత్రమిది. శారీరకంగా, మానసికంగా నాకు సవాలు విసిరింది. ఫిజికల్‌ ట్రాన్సఫర్మేషన్‌ కోసం సుమారు 18 నెలలు కష్టపడ్డా. అది ఏమోగానీ డ్యాన్స్‌ చేయాలంటే మాత్రం నాకు ఏడుపొస్తుంది. నానా కష్టాలుపడి చిత్రీకరణ పూర్తి చేస్తుంటా. ప్రేక్షకులు థియేటర్లకు వస్తే ఈ సినిమా తప్పకుండా హిట్‌ అవుతుంది. అందులో ఎలాంటి సందేహం ఉండదు. కానీ, వారిని థియేటర్లకు రప్పించటం కష్టం. ఇప్పుడు అదే మన పని. ప్రేక్షకులు ఒక్కసారి థియేటర్‌లో అడుగుపెట్టారంటే కథలో వెంటనే లీనమవుతారు. నాకు తేదీల సెంటిమెంట్‌ లేదు. చిత్రీకరణ పూర్తయిన సినిమాని ఎంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తే అంత మంచిది అని భావిస్తా’’

టైసన్‌ని చూసి భయపడ్డా

‘‘మైక్‌ టైసన్‌తో ఫైట్‌ అని చెప్తే అమ్మ చాలా భయపడింది. ఆయన్ను కలవగానే నేనూ టెన్షన్‌ పడ్డా. తర్వాత ఆ భయం పోయింది. టైసన్‌ పైకి ఎంత భయంకరంగా కనిపిస్తారో వ్యక్తిత్వంలో అంత మంచి మనిషి. కొన్నేళ్ల క్రితం వరకు నేనెవరో మీకు తెలియదు. మీకు నాకూ మధ్య సినిమానే వారధి. నా మునుపటి సినిమా విడుదలై రెండేళ్లవుతోంది. పైగా గత రెండు చిత్రాలు ఫెయిల్‌ అయ్యాయి. నేను కూడా ఎవరికీ అందుబాటులో లేను. అయినా ‘లైగర్‌’ ట్రైలర్‌ విడుదలకు చాలామంది వచ్చారు. అంతమందిని చూసి షాక్‌ అయ్యా. వారిని అలరించేందుకు మరిన్ని మంచి కథలను ఎంపిక చేసుకునే బాధ్యత పెరిగింది’’ అని విజయ్‌ దేవరకొండ వివరించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు