Lavanya - Varuntej: వరుణ్‌ తేజ్‌తో పెళ్లి.. ఫొటోతో క్లారిటీ ఇచ్చిన భామ

మెగా హీరోతో తన పెళ్లి గురించి వస్తోన్న వార్తలకు ఫొటోతో సమాధానమిచ్చారు నటి లావణ్య త్రిపాఠి. తాను ప్రస్తుతం కుటుంబంతో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అసలేం జరిగిందంటే..

Updated : 20 Jan 2022 14:42 IST

హైదరాబాద్‌: మెగా హీరో వరుణ్‌ తేజ్‌తో పెళ్లి అంటూ వస్తోన్న పుకార్లకు ఫొటోలతో సమాధానమిచ్చారు కథానాయిక లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం తాను సొంతూరులో కుటుంబంతో ఉన్నట్లు చెప్పకనే చెప్పారు. దీంతో బుధవారం ఉదయం నుంచి వస్తున్న పెళ్లి పుకార్లకు తెరపడినట్లయింది. వరుణ్‌తేజ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన కొన్ని ఫొటోల వల్లే ఇదంతా జరిగింది. ఇంతకీ ఏమైందంటే.

వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా చేసిన ‘మిస్టర్‌’, ‘అంతరిక్షం’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించారు నటి లావణ్య త్రిపాఠి. ఆ రెండు చిత్రాల్లో వీరి మధ్య కెమిస్ట్రీ చూసి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని ఆ మధ్య అందరూ చెవులు కొరుక్కున్నారు. అంతేకాకుండా వరుణ్‌ సోదరి నటి నిహారిక పెళ్లికి లావణ్య హాజరయ్యారు. దీంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది. కానీ ఆ తర్వాత ఎలాంటి పుకార్లూ రాలేదు. బుధవారం వరుణ్‌ పుట్టిన రోజు కావడంతో, వేడుకల కోసం వరుణ్‌ బెంగళూరు వెళ్లారు. ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. దీంతో పుకార్ల తాకిడి మళ్లీ మొదలైంది.

లావణ్యతో కలిసి బర్త్‌డే పార్టీ స్పెషల్‌గా చేసుకోవడానికే వరుణ్‌ బెంగళూరు వెళ్లారని, ఆమె కోసం అత్యంత ఖరీదైన డైమండ్‌ రింగ్‌ని కొనుగోలు చేశారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలు ఆ నోట ఈ నోట పడి లావణ్య దగ్గరకి చేరినట్లున్నాయి. దీంతో వాటిపై సోషల్‌ మీడియా వేదికగా పరోక్షంగా స్పందించారు లావణ్య. దేహ్రాదూన్‌లో ఉన్నానంటూ ఫ్యామిలీతో కలిసి ఉన్నట్లు కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారామె. ప్రకృతి అందాలు తన మనసుని కట్టిపడేస్తున్నాయని ఆ ఫొటోలతోపాటు పోస్టులో రాసుకొచ్చారు. లావణ్య షేర్‌ చేసిన కొత్త ఫొటోలతో ఆమె పెళ్లి, ప్రేమ వార్తలకు మరోసారి చెక్‌ పడినట్లు అయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని