Updated : 04/10/2021 18:39 IST

MAA Elections: అందరూ జీవితా రాజశేఖర్‌నే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు

హైదరాబాద్‌: ప్రపంచంలో అందరూ జీవితా రాజశేఖర్‌ను ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారో అర్థం కావటం లేదని, తాము ఎవరూ చేయని తప్పులు చేశామా? అని ప్రశ్నించారు. అక్టోబరు 10న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనరల్‌ సెక్రటరీగా ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమపై వస్తున్న విమర్శలకు చెక్‌ పెట్టేందుకు జీవిత విలేకరులతో మాట్లాడారు.

మంచి చేయడం తప్పా?

‘‘తప్పులు చేయడం మానవ సహజం. వాటిని మేము సరిదిద్దుకున్నాం. సినీ కళాకారుల సంఘానికి తోచిన సాయం చేశాం. ఎవరు ఏ ప్యానెల్‌లో ఉంటారన్నది వాళ్ల ఇష్టం. ఇదే విషయం మోహన్‌బాబుగారితో చెప్పాను. 24గంటలు పాటు బండ్ల గణేశ్‌ నా గురించి మాట్లాడారు. అందుకే ఆయనపై మాట్లాడాల్సి వచ్చింది. పృథ్వీ కూడా నాపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఆరోపణలు హాస్యాస్పదం. అంతా జీవితా రాజశేఖర్‌నే టార్గెట్‌ చేస్తున్నారు. మంచి చేయడమే మేం చేస్తున్న తప్పా? గతంలో ‘మా’ ఎన్నికల్లో పాల్గొనాలని నరేశ్‌గారే మమ్మల్ని కలిశారు. ఆయన చెప్పిన మాటలు విని ఎన్నికల్లో పోటీ చేశాం. ఆయన ఎవరిని తిడితే వాళ్లను తిట్టాం. నరేశ్‌కు మద్దతుగా నిలిచాం. అయితే, ఈ ఆరోపణలు ఎన్నికల వరకే పరిమితం చేయాలని నరేశ్‌కు రాజశేఖర్‌గారు సూచించారు. ఆయన కూడా సరే అన్నారు. ఈ విషయంలోనే మాకూ నరేశ్‌కూ విభేదాలు తలెత్తాయి. డైరీ విడుదల కార్యక్రమం సందర్భంగా ఏం జరిగిందో మీరంతా చూశారు. అప్పటి నుంచే మా మధ్య విభేదాలు మొదలయ్యాయి. ‘మా’ కోసం నరేశ్‌ పనులు చేయలేదని నేను ఎక్కడా చెప్పలేదు’’ అని జీవిత అన్నారు.

నరేశ్‌ వల్లే డైరీ వేడుకలో గొడవ జరిగింది

‘‘నరేశ్‌ అందరినీ కలుపుకొని పోలేదు. అలా చేయకపోవటం వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయి. ఏ నిర్ణయం తీసుకుందామన్నా ఎవరినీ పిలిచే వారు కాదు. ‘వాళ్లంతా ఎందుకు? మనం సరిపోతాం కదా’ అనేవారు. రెండు మూడు ఈసీ మీటింగ్‌లు జరిగాయి. అందులో ఒకరినొకరు కొట్టుకోవడమే తక్కువే. అప్పుడు కూడా మేము సర్ది చెప్పాం. ఒక ఫారెన్‌ ప్రోగ్రాంను నరేశ్‌గారు నిర్ణయించారు. ఇదే కార్యక్రమం విషయంలో ఆయన రచ్చ రచ్చ చేశారు. చిరంజీవితో సహా పెద్దలందరూ కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఆ కార్యక్రమానికి సంబంధించిన లావాదేవీలను లెక్కించారు. చివరకు ఎలాంటి తప్పూ జరగలేదని నిర్ధారించారు. అయినా కూడా నరేశ్‌ అదే అంశంపై ఎలక్షన్లలో మాట్లాడారు. ఆ పాయింట్‌తోనే ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత ఎవరైతే ఆ ఫారెన్‌ ప్రోగ్రాం చేశారో అదే వ్యక్తులతో మళ్లీ కాంట్రాక్టు కుదుర్చుకుని, వాళ్ల దగ్గర అడ్వాన్స్‌ తీసుకున్నారు. వాళ్లలో ఒక వ్యక్తి వచ్చి అమెరికాలో ప్రోగ్రాం చేసినందుకు రూ.కోటి ఇస్తామని అన్నారు. ఇదే విషయాన్ని నరేశ్‌ మాతో చర్చించారు. ‘ఎవరివల్ల అయితే సమస్య వచ్చిందో వారితోనే మళ్లీ ప్రోగ్రాం చేస్తామనడం సమంజసం కాదు’ అని 14మంది మా ప్యానెల్‌లోని సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈసీ మీటింగ్‌ పెట్టి నిర్ణయం తీసుకుందామని నరేశ్‌కు చెబితే, అందుకు ఆయన ఒప్పుకోలేదు. అక్కడే మాకూ ఆయనకు సమస్య వచ్చింది. ఇప్పటివరకూ అసలు ఈసీ సమావేశమే జరగలేదు. అప్పటి నుంచి మేము ఏం మాట్లాడినా నరేశ్‌ తప్పుగా భావించేవారు. ‘మా’ సభ్యులకు సినిమా అవకాశాలు కల్పించేందుకు వారి పేర్లు, ఫొటోలతో కూడిన వెబ్‌సైట్‌ మొదలు పెడదామంటే అందుకు కూడా ఒప్పుకోలేదు. జనరల్‌ బాడీ మీటింగ్‌ పెడదామంటే మాకు నోటీసులు పంపారు. 150మంది సభ్యుల వద్ద సంతకాలు తీసుకుని జనరల్‌ బాడీ మీటింగ్‌ పెడదామనుకునే సరికి ఇండస్ట్రీ పెద్దలు రంగంలోకి దిగి సర్ది చెప్పారు. అందరం కలిసి చర్చిద్దామని సలహా ఇచ్చారు. నాలుగైదు సమావేశాలు జరిగాయి. వాటికీ నరేశ్‌ రాలేదు. సభ్యుల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయని డైరీ విడుదల వేడుక సింపుల్‌గా చేద్దామని మేము సూచించాం. కాదని, దాన్ని ఒక పెద్ద కార్యక్రమంగా చేసింది నరేశ్‌. అప్పుడే రాజశేఖర్‌గారు మాట్లాడారు. అది తప్పు ఎలా అవుతుంది? ఇన్ని తప్పులు పెట్టుకుని భాయీ-భాయీ అంటూ ఎలా కౌగిలించుకుంటాం? పెద్దా చిన్నా ఎవరూ రాజశేఖర్‌కు సపోర్ట్‌ చేయలేదు. దీంతో రాజశేఖర్‌ రాజీనామా చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మాతో మాట్లాడటానికి నరేశ్‌ వచ్చారు. రాజశేఖర్‌ మీకోసం మాట్లాడితే మీరెవరూ ఆయనకు సపోర్ట్‌ చేయలేదు. మంచి చేద్దామని మాట్లాడిన మేము పిచ్చి వాళ్లమయ్యాం’ అని నరేశ్‌ను అడిగా. ఆ తర్వాత మా సభ్యులకు, నరేశ్‌కు నేను అనుసంధానకర్తగా వ్యవహరించా’’

మీరు ఇల్లు కట్టిస్తామంటే ఇటుకలు, సిమెంట్ నేను ఎత్తుకొచ్చానా?

‘‘ఇటీవల నరేశ్‌ మాట్లాడుతూ.. పనులన్నీ శివబాలాజీ చేసినట్లు చెప్పారు. ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే జనరల్‌ సెక్రటరీ సంతకం పెట్టలేదని నాపై ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఎవరికి దరఖాస్తు చేశారు? లబ్దిదారులకు ఇళ్లు రావాలంటే కొన్ని డాక్యుమెంట్స్‌ కావాలని అధికారులు అడిగారు. అది చేయాల్సిన బాధ్యత ‘మా’దే. ఆ పనులు జరగకుండా, ఎవరికీ ఏ పని చెప్పకుండా చేసింది మీరు కాదా? ఏ పని అయినా ఆగిందంటే నా వల్ల కాదు.. మీ(నరేశ్‌)వల్లే. మీరు ఇళ్లు కట్టిస్తానంటే నేనేమైనా ఇటుకలు, సిమెంట్ ఎత్తుకొచ్చానా? నా గురించి మీరెందుకు మాట్లాడతారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘మా’ ట్రెజరర్‌ రాజీవ్‌ కనకాల చేసిన వ్యాఖ్యలు బాధించాయి. ప్రొడక్షన్స్‌ మేనేజర్‌ అసోసియేషన్‌ 25ఏళ్లు అయిన సందర్భంగా వాళ్లకు రూ.10లక్షల చెక్కు ఇచ్చాం. ఇచ్చిన కవర్‌లో చెక్కులేదని నాపై ఆరోపణల చేశారు. నేను, రాజశేఖర్‌గారూ వ్యక్తిగతంగా మరో రూ.10లక్షల చెక్కు ఇచ్చాం. మీకు నా గురించి, రాజశేఖర్‌ గురించి ఏం తెలుసని మాట్లాడతారు? మేము చేసిన తప్పు ఏంటి? ఒక మహిళను టార్గెట్‌ చేయడం మీకు సిగ్గుగా లేదా? పృథ్వీ, బండ్ల గణేశ్‌, నరేశ్‌ మీరు దీనికి సమాధానం చెప్పాలి’’

జూ.ఎన్టీఆర్‌ బాధపడ్డారు!

‘‘మోహన్‌బాబుగారు, విష్ణు అంటే నాకు గౌరవం. విష్ణు తనకున్న సామర్థ్యంతో ఎన్నికల బరిలో నిలిచి పోటీ చేస్తున్నారు. అలాంటి మీరు నరేశ్‌ను వెనకేసుకుని ఎందుకు తిరుగుతున్నారు. మీకెవరు ఓట్లు వేస్తారో వారితో ఒక గ్రూప్‌ ఏర్పాటు చేసుకుంటారు. వాళ్లకు సాయం చేస్తామంటారు. మొత్తం 900మందికి సాయం చేయొచ్చు కదా! ఒకరిపై ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేసుకోవడం ఎందుకు? ‘మా’ ఎన్నికల్లో ప్రాంతీయవాదాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న వాళ్లు ఏమైనా తెలుగు వాళ్లా? ప్రకాశ్‌రాజ్‌ విషయంలో ప్రాంతీయవాదాన్ని ఎందుకు లేవనెత్తుతున్నారో అర్థం కావటం లేదు. ఇటీవల ఒక పార్టీలో జూ.ఎన్టీఆర్‌గారిని కలిశా. ‘మీరు నాకు ఓటు వేయాలి’ అని ఆయనను అడిగా. ‘నన్ను అడగొద్దు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది’ అని అన్నారు. ఆయన చెప్పినట్లు నిజంగా పరిస్థితి అలాగే ఉంది’’ అని జీవితా రాజశేఖర్‌ చెప్పుకొచ్చారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని