దేశంలోని థియేటర్లు ఒకే రోజు ఓపెన్‌ చేసేలా..!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి శనివారం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా సమయంలో చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యల గురించి చర్చించారు. ఇందులో సురేష్ బాబు, తేజ, జెమిని కిరణ్, త్రిపురనేని వరప్రసాద్....

Updated : 23 May 2020 17:51 IST

టాలీవుడ్‌ ప్రముఖులతో కిషన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి శనివారం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా సమయంలో చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యల గురించి చర్చించారు. ఇందులో సురేష్ బాబు, తేజ, జెమిని కిరణ్, త్రిపురనేని వరప్రసాద్, దాము కానూరి, అభిషేక్ అగర్వాల్, శరత్, ప్రశాంత్, రవి తదితరులు పాల్గొన్నారు. వీరంతా ఈ సందర్భంగా షూటింగులకు అనుమతి, థియేటర్ల పునఃప్రారంభం, క్యాప్టివ్ పవర్, పైరసీ, ఓటీటీలో సినిమా విడుదల, రీజనల్ జీఎస్టీ, సినిమా కార్మికుల ప్రత్యేక ప్యాకేజీ తదితర అంశాల గురించి కిషన్‌ రెడ్డి దృష్టికి తెచ్చారు.

ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘షూటింగ్‌లకు త్వరలోనే అనుమతి లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లను ఒకే రోజు ఓపెన్‌ చేసేలా నిర్ణయం తీసుకుంటాం. అలానే సినిమా పైరసీ అరికట్టడానికి చర్యలు తీసుకుంటాం. ప్రాంతీయ భాషా సినిమాలు పెంపొందేలా, నిర్మాణం జరిగేలా.. రీజినల్ జీఎస్టీ గురించి కూడా ఆలోచిస్తాం. చిత్ర పరిశ్రమ వరకు క్యాప్టివ్ పవర్ కోసం ఆ శాఖ మంత్రితో మాట్లాడతాం. దేశంలో ఎక్కడైనా సినిమా షూటింగ్‌లు, స్టూడియోల నిర్మాణం చేసుకోవడానికి వీలుగా ఆయా సీఎంలతో చర్చిస్తాం. తెలుగు, తమిళ, హిందీ సినీ పరిశ్రమ ప్రతినిధులతో త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చిద్దాం’ అని చెప్పారు. ఇదే సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరి యోగక్షేమాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. సినీ ప్రముఖులు కూడా కిషన్ రెడ్డిని అభినందిస్తూ, ప్రభుత్వం బాగా పని చేస్తోందని కితాబు ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని