Jai Bhim: ఆస్కార్‌ బరిలో ‘జైభీమ్‌’.. ‘మరక్కర్‌’

అతి పెద్ద సినీ సంబరం ఆస్కార్‌ పురస్కారాల  వేడుకకు రంగం సిద్ధమవుతోంది. మార్చిలో జరగనున్న 94వ ఆస్కార్‌ వేడుకల కోసం.. బరిలో నిలిచే(షార్ట్‌లిస్ట్‌) 276 చిత్రాలను ఆస్కార్‌ అకాడమీ ప్రకటించింది. ఇందులో మన దేశం నుంచి బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌(విదేశీ) విభాగంలో సూర్య ‘జై భీమ్‌’, మోహన్‌లాల్‌ ‘మరక్కర్‌’ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి.

Updated : 22 Jan 2022 07:14 IST

షార్ట్‌లిస్ట్‌లో స్థానం
వరుసగా రెండో ఏడాది సూర్య చిత్రం

అతి పెద్ద సినీ సంబరం ఆస్కార్‌ పురస్కారాల వేడుకకు రంగం సిద్ధమవుతోంది. మార్చిలో జరగనున్న 94వ ఆస్కార్‌ వేడుకల కోసం.. బరిలో నిలిచే(షార్ట్‌లిస్ట్‌) 276 చిత్రాలను ఆస్కార్‌ అకాడమీ ప్రకటించింది. ఇందులో మన దేశం నుంచి బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌(విదేశీ) విభాగంలో సూర్య ‘జై భీమ్‌’, మోహన్‌లాల్‌ ‘మరక్కర్‌’ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. ఈ మొత్తం సినిమాలకు సంబంధించిన జాబితాను ఆస్కార్‌ అకాడమీ శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. సూర్య నటించిన ‘సూరారై పొట్రు’ (తెలుగులో ‘ఆకాశమే హద్దురా’) గతేడాది ఆస్కార్‌ రేసులో పోటీపడిన సంగతి   తెలిసిందే. ఇప్పుడాయన ‘జై భీమ్‌’ ద్వారా వరుసగా రెండో ఏడాది ఆస్కార్‌ బరిలో నిలవడం విశేషం. తా.సే.జ్ఞానవేల్‌ తెరకెక్కించిన చిత్రమిది. జస్టిస్‌ చంద్రు జీవితంలోని వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కోర్టు డ్రామా కథాంశంతో రూపొందించారు. ఇందులో సూర్య గిరిజన హక్కుల కోసం పోరాడే న్యాయవాదిగా చంద్రు పాత్రలో కనిపించి మెప్పించారు. గతేడాది ఓటీటీలో విడుదలైన ఈ సినిమా.. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసల్ని దక్కించుకుంది. 

* ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌లో ‘జైభీమ్‌’తో పాటే నిలిచిన మరో భారతీయ సినిమా మోహన్‌లాల్‌ ‘మరక్కార్‌’. మలయాళ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమైన చిత్రమిది. కుంజలి మరక్కర్‌-ఖిజు జీవిత కథతో ప్రియదర్శన్‌ తెరకెక్కించిన ఈ పీరియాడికల్‌ సినిమా.. విడుదలకు ముందే మూడు జాతీయ అవార్డులు (ఫీచర్‌ ఫిల్మ్‌, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌, కాస్ట్యూమ్‌ డిజైన్‌) గెలుచుకుని అందరి దృష్టినీ ఆకర్షించింది. గతేడాది థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఆస్కార్‌ రేసులో నిలిచి మరోసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 

ఫిబ్రవరి 8న తుది జాబితా 

ప్రస్తుతం ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్‌లో నిలిచిన వాటిలో ‘స్పైడర్‌మ్యాన్‌ : నో వే హోమ్‌’, ‘వెస్ట్‌ సైడ్‌ స్టోరీ’, ‘బీయింగ్‌ ద రికార్డస్‌’, ‘బెల్‌ఫాస్ట్‌’, ‘కోడా’, ‘డ్యూన్‌’, ‘ఎన్‌ కాంటో’, ‘హౌస్‌ ఆఫ్‌ గస్సీ’, ‘ద పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌’, ‘ఏ క్వైట్‌ ప్లేస్‌ పార్ట్‌2’, ‘స్పెన్సర్‌’ తదితర చిత్రాలున్నాయి. కాగా, తుది జాబితాకు ఎంపికైన సినిమాలను ఫిబ్రవరి 8న ప్రకటించనున్నారు. మార్చి 27న ఆస్కార్‌ పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని దాదాపు 200 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని