Published : 06/12/2021 17:21 IST

Nayeem Diaries: నిజాలు ఎక్కడా దాచిపెట్టలేదు

నిజ జీవిత కథలకు ప్రస్తుతం చిత్ర  సీమలో మంచి డిమాండ్‌ ఉంది. ‘నయీం డైరీస్‌’ పేరుతో అలాంటి ఓ సినిమానే మనముందుకు తెస్తున్నారు దర్శకుడు దాము బాలాజీ. గతంలో రామ్‌గోపాల్‌ వర్మ దగ్గర రచయితగా పనిచేసిన ఆయనకిది దర్శకుడిగా తొలిచిత్రం. ఈ సినిమాను వరదరాజు నిర్మిస్తున్నారు. ఈ నెల 10న ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘స్వతహాగా నేను నక్స్‌లైట్లలో పనిచేశాను కాబట్టి... ఆ నేపథ్యంలో వచ్చే అడవి సన్నివేశాలు... జైలు జీవితంపై వచ్చే సీన్లు పకడ్బందీగా తీయగలిగాను. వీటితో పాటు భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి’’ అని చెప్పే దాము బాలాజీతో ‘ఈనాడు సినిమా’ ప్రత్యేకంగా మాట్లాడింది. ఆ విశేషాలు...

‘నయీం డైరీస్‌’ లాంటి కథను ప్రేక్షకుల ముందుకు ఎందుకు తేవాలనుకున్నారు?
‘నయీం’ పీపుల్స్‌వార్‌ గ్రూప్‌  నక్స్‌లైట్‌. అతను పోలీసు ఇన్‌ఫార్మర్‌. అతను ఓ క్రూరుడు. అతను ఓ ప్రేమికుడు. అతను అక్కను ఎంతగానో గౌరవించే సోదరుడు. ఇలా భిన్నమైన కోణాలున్న వ్యక్తి. అతని గురించి... అతను అలా తయారుకావడానికి  కారణాల గురించి చర్చించాలని అనిపించింది. అందుకే ఈ కథ మీద ఎంతో రీసెర్చ్‌ చేశా. ముందు ఈ చిత్రాన్ని దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తీయాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ఆయన తీయలేదు. తర్వాత నాకు నిర్మాత వరదరాజు దొరికారు. నేనే మొదలు పెట్టి తీశాను.

నక్స్‌లైట్‌గా ఉన్న మీరు దర్శకుడు కావాలని ఎందుకనుకున్నారు?
చిన్నప్పటి నుంచి నాకు కథలు రాయడం ఇష్టం. దర్శకుడు కావాలని కోరిక ఉండేది. డాక్యుమెంటరీలు చేశాను. పదేళ్ల పాటు నక్స్‌లైట్‌గా పనిచేశాను. ఆ తర్వాత అధ్యాపకుడిగా ఉన్నా. ఈ సమయంలో నా చిన్నప్పటి కోరిక మళ్లీ మొగ్గ తొడిగింది. దర్శకులు రాఘవేంద్రరావు తీసిన ‘సుభాష్‌ చంద్రబోస్‌’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేశా. తర్వాత రామ్‌గోపాల్‌వర్మ దగ్గర   రచయితగా మారా. ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’ చిత్రానికి రీసెర్చి మొత్తం చేశా. నయీం జీవితంపై సినిమా తీస్తున్నట్లు 2016లో ఆర్జీవీ ప్రకటించారు. ఆయన కోసమే నయీంపై పరిశోధన మొదలుపెట్టా. తర్వాత వర్మ ఈ సినిమా చేయట్లేదని చెప్పారు. నేను అప్పటికే మంచి కథ తయారు చేసుకున్నా. దాన్నే ఇప్పుడు ‘నయీం డైరీస్‌’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నా.

ఈ సినిమా ద్వారా ఏం చెప్పనున్నారు?
నయీం అనే గ్యాంగ్‌స్టర్‌ తయారు కావడానికి దారి తీసిన పరిస్థితులన్నీ ఇందులో కళ్లకు కట్టే ప్రయత్నం చేశా. నిజాలను ఎక్కడా దాచిపెట్టలేదు. నయీంతో పాటు జైలులో ఉన్న వారితో మాట్లాడాను. అక్కడి పరిస్థితులన్నీ తెలుసుకున్నా. అప్పట్లో ముషీరాబాద్‌ జైలులో నక్స్‌లైట్లకు ప్రత్యేక విభాగం ఉండేది. అక్కడ వందమంది వరకూ  నక్స్‌లైట్లు ఉండేవారు. వారికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండేవి. ఇక్కడ వీరందరికీ నాయకత్వం వహించడానికి కమ్యూన్‌ కమిటీ అంతర్గతంగా ఉండేది. ఈ కమిటీలో నయీం సభ్యుడు. తర్వాత వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. అతన్ని కమిటీ నుంచి బహిష్కరించారు. అంతేగాక నయీం వాళ్ల అక్క జీవితం నాశనం కావడానికి ఓ మాజీ నక్స్‌లైట్‌ కారణం. దీంతో వారిపై నయీం పగ పెంచుకున్నాడు. ఈ సమయంలో పోలీసులు నయీంను మచ్చిక చేసుకొని నక్స్‌లైట్ల గురించి సమాచారం తెలుసుకున్నారు. ఒక మనిషి సంఘవిద్రోహ శక్తిగా మారడానికి ఆర్థిక, పాలన, రక్షణ, రాజకీయ వ్యవస్థలూ కారణమవుతాయనే కోణంలో కథ చూపించాం. ఈ చిత్రంలోని ఓ సన్నివేశం చూసి పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రియల్‌ పాత్రలకు సంబంధించిన వ్యక్తుల తాలుకూ మనుషులు సినిమా రిలీజ్‌ కానివ్వమని బెదిరిస్తున్నారు.


నిజ జీవిత పాత్రలకు తగిన నటులను ఎలా ఎంపిక చేశారు?

నిజ జీవిత పాత్రలకు తగ్గట్లుగా ఆహార్యం ఉండే వారిని ఎంపిక చేసుకోవాలని నేను అనుకోలేదు. పాత్ర తాలుకూ భావోద్వేగాలను పండించే వారు ఉంటే మంచిదని ముందు నుంచి నా ఆలోచన. కన్నడ నటుడు వశిష్ట సింహా నయీం పాత్రకు సరిపోతాడని అనిపించింది. అతను కర్నాటకలో ఉత్తమ నటుడిగా పురస్కారాలు సైతం అందుకున్నాడు. అతని పూర్వికులది కరీంనగర్‌ జిల్లానే. తర్వాత వారి కుటుంబం మైసూర్‌ వెళ్లి స్థిరపడ్డారు. ఈ చిత్రానికి సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకొన్నాడు. మా సినిమా చేస్తుండగానే ‘నారప్ప’, ‘కేజీఎఫ్‌’ వంటి చిత్రాల్లో వశిష్ట సింహాకు అవకాశాలొచ్చాయి. ఇక యజ్ఞశెట్టి, దివి, నిఖిల్‌, శశికుమార్‌ వంటి నటులు పాత్రల్లో  ఒదిగిపోయారు. అరుణ్‌ ప్రభాకర్‌ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌, సురేష్‌ భార్గవ్‌ కెమెరా పనితనం నా కథను మరోస్థాయిలో నిలబెట్టాయి. ఈ సినిమా   కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని