Sivasankar: శివశంకర్‌ మాస్టర్‌ ఇకలేరు

‘‘ప్రాణం పోయే దాకా ఊపిరి పీలుస్తుంటాం.. అలాగే ఒంట్లో శక్తి ఉన్నంత వరకూ పనిచేస్తూ ఉండాలనేది నా కోరిక.’’... శివశంకర్‌ మాస్టర్‌ మాటలివి... ఎప్పుడూ ఉత్సాహంతో ఉండే ఆయన ఊపిరి వదిలేశారు. కరోనాతో పోరాడి కోలుకున్నా... మృత్యువును గెలవలేకపోయారు. ఆయన నృత్య దర్శకత్వం వహించిన పాటలు... మనలో ఉత్సాహం నింపుతున్నంత కాలం... శివశంకర్‌ మాస్టర్‌ మన కళ్లకు కనిపిస్తూనే ఉంటారు. మన కాళ్లకు నాట్యం నేర్పిస్తూనే ఉంటారు.

Updated : 29 Nov 2021 05:02 IST

చికిత్స పొందుతూ కన్నుమూత

‘‘ప్రాణం పోయే దాకా ఊపిరి పీలుస్తుంటాం.. అలాగే ఒంట్లో శక్తి ఉన్నంత వరకూ పనిచేస్తూ ఉండాలనేది నా కోరిక.’’... శివశంకర్‌ మాస్టర్‌ మాటలివి... ఎప్పుడూ ఉత్సాహంతో ఉండే ఆయన ఊపిరి వదిలేశారు. కరోనాతో పోరాడి కోలుకున్నా... మృత్యువును గెలవలేకపోయారు. ఆయన నృత్య దర్శకత్వం వహించిన పాటలు... మనలో ఉత్సాహం నింపుతున్నంత కాలం... శివశంకర్‌ మాస్టర్‌ మన కళ్లకు కనిపిస్తూనే ఉంటారు. మన కాళ్లకు నాట్యం నేర్పిస్తూనే ఉంటారు.

న్టీఆర్‌, ఏఎన్నార్‌ మొదలుకొని నేటితరం కథా  నాయకుల వరకు వాళ్లు నటించిన ఎన్నో సినిమాలకి నృత్య రీతులు సమకూర్చిన ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు శివశంకర్‌ మాస్టర్‌ (72)   కన్నుమూశారు. ఇటీవలే కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళం మొదలుకొని జపనీస్‌ వరకు పదికిపైగా భాషల్లో సినిమాలకి పనిచేసి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని గడించిన నృత్య దిగ్గజం ఆయన. తెలుగు సినిమా ‘మగధీర’లో ‘ధీర... ధీర’ పాటకిగానూ ఉత్తమ నృత్య దర్శకుడిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ‘బాహుబలి’ చిత్రంలోని పాటలకీ ఆయన నృత్య దర్శకత్వం వహించారు. వేషధారణలోనూ... హావభావాల్లోనూ ప్రత్యేకంగా కనిపించే శివశంకర్‌ మాస్టర్‌ 800కి పైగా చిత్రాల్లో పాటలకి నృత్యాలు సమకూర్చారు. తెలుగు, తమిళ భాషల్లో 30కిపైగా సినిమాల్లో నటించి వినోదం పంచారు. బుల్లితెరపైనా నటుడిగా, న్యాయ నిర్ణేతగా కనిపించి ప్రేక్షకుల్ని అలరించారు. పలువురు నృత్య దర్శకుల్ని చిత్ర పరిశ్రమకి అందించారు.

1948 డిసెంబర్‌ 7న చెన్నైలో కల్యాణ సుందర్‌, కోమల అమ్మాల్‌ దంపతులకి జన్మించిన మాస్టర్‌కి భార్య సుకన్య, కుమారులు విజయ్‌ శివశంకర్‌, అజయ్‌ శివశంకర్‌ ఉన్నారు. కుమారులిద్దరూ తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ నృత్య దర్శకులుగా రాణిస్తున్నారు. శివశంకర్‌ మాస్టర్‌తోపాటు... భార్య, పెద్ద కుమారుడు కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరారు. భార్య, కుమారుడు కోలుకుంటుండగా, మాస్టర్‌కి కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ ఆయన కన్నుమూయడం చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపింది. పరిశ్రమలో ఎంతోమందికి ఇష్టమైన మాస్టర్‌కి మెరుగైన వైద్యం అందించడం కోసం చిరంజీవి, సోనూసూద్‌, ధనుష్‌, మంచు విష్ణు, పలువురు నృత్యదర్శకులు ఆర్థికంగా చేయూత అందించినా ప్రాణాలు మాత్రం దక్కలేదు. ఆయన మృత దేహానికి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.


ఎన్టీఆర్‌కి చిన్నమాస్టర్‌

శివశంకర్‌ మాస్టర్‌ని సీనియర్‌ కథానాయకుడు ఎన్టీఆర్‌ చిన్న మాస్టర్‌ అని పిలిచేవారట. సీనియర్‌ నృత్య దర్శకుడు సలీమ్‌ మాస్టర్‌ దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్న సమయంలోనూ, ఆ తర్వాత పలు సినిమాల్లో ఎన్టీఆర్‌తో నృత్యాలు చేయించారు శివశంకర్‌ మాస్టర్‌. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ తదితర అగ్ర కథానాయకులు నటించిన సినిమాలకి నృత్యాలు సమకూర్చారు. యువతరం కథానాయకులు రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, ప్రభాస్‌ తదితరుల సినిమాలకీ అంతే దీటుగా పనిచేసి తన ప్రత్యేకతని ప్రదర్శించారు. ఊపున్న మాస్‌ బాణీలతోపాటు... క్లాసికల్‌ టచ్‌ ఉన్న గీతాలకీ తన మార్క్‌ నృత్యాల్ని సమకూర్చి ఉర్రూతలూగించారు. ‘మగధీర’లోని ధీర ధీర.. పాట కోసం 22 రోజులు, ‘అరుంధతి’ సినిమాలో పాట కోసం 32 రోజులు కష్టపడి నృత్యాలు సమకూర్చారట శివశంకర్‌ మాస్టర్‌. వాటితోపాటు ‘ఖైదీ’  సినిమాలో రగులుతోంది మొదలుపొద... పాటకి నృత్యాలు సమకూర్చడం ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పేవారు మాస్టర్‌. జాతీయ పురస్కారంతోపాటు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ నృత్య దర్శకుడిగా నాలుగుసార్లు పురస్కారాలు అందుకున్నారు. తెలుగులో ‘ఢీ’తోపాటు పలు టెలివిజన్‌ కార్యక్రమాలకి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఆయన హావభావాలపై పేరడీలు చేస్తూ సినిమాల్లో కొన్ని పాత్రలు కూడా పుట్టుకొచ్చాయంటే ఆయన చిత్ర పరిశ్రమపైనా, ప్రేక్షకులపైనా ఎంతటి ప్రభావం చూపించారో అర్థం చేసుకోవచ్చు.


వెన్నెముక దెబ్బతిన్నా...

చిన్నప్పుడు జరిగిన ప్రమాదంలో శివశంకర్‌ మాస్టర్‌ వెన్నెముకకి తీవ్ర గాయమైంది. దాంతో ఆయన ఎనిమిదేళ్ల పాటు పడుకునే ఉన్నారట. విదేశాల నుంచి వచ్చిన నరసింహ అయ్యర్‌ అనే వైద్యుడి వల్ల ఆయన గాయం నుంచి కోలుకున్నారట. ఆ తర్వాత పాటలు, నాటకాలు, డ్యాన్సులపై మమకారం పెరిగింది. అలా తనంతట తానే డ్యాన్స్‌ నేర్చుకుని 16వ ఏట నుంచే వేదికలపై నృత్యం చేయడం మొదలుపెట్టారు. ఆయన ఇష్టాన్ని   ప్రోత్సహిస్తూ ఇంట్లో నృత్యం నేర్పించారు. ఆ తర్వాత ప్రముఖ నృత్య దర్శకుడు సలీమ్‌ మాస్టర్‌ దగ్గర సహాయకుడిగా సినీ ప్రయాణం మొదలుపెట్టారు. ‘కురువికూడు’ నృత్య దర్శకుడిగా ఆయన తొలి చిత్రం. నటుడిగా తమిళ, తెలుగు చిత్రాల్లో ఎక్కువగా నటించారు. క్యారెక్టర్‌ నటుడిగా, కామెడీ పాత్రలతోనూ సందడి చేశారు. ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘అక్షర’, ‘సర్కార్‌’, ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’, ‘రాజుగారి గది3’, ‘గ్యాంగ్‌’ తదితర చిత్రాల్లో శివశంకర్‌ మాస్టర్‌ నటుడిగా సందడి చేశారు.


మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్‌, సోనూసూద్‌, కథానాయిక ఐశ్వర్యరాజేశ్‌ తదితర ప్రముఖులు శివశంకర్‌ మాస్టర్‌ మృతిపట్ల సంతాపం తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని