Updated : 05/10/2021 05:16 IST

MAA Elections: మేమే ఎందుకు టార్గెట్‌?

‘‘అందరూ జీవిత, రాజశేఖర్‌లనే ఎందుకు టార్గెట్‌ చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు’’ అన్నారు నటి జీవిత. ప్రపంచంలో ఎవరూ చేయని పనులు.. తప్పులు తామేం చేశామని అడిగారు. మంచి చేయాలనుకోవడమే తాము చేసిన తప్పా? అని ప్రశ్నించారు. అక్టోబరు 10న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ నుంచి జనరల్‌ సెక్రటరీగా పోటీ చేస్తున్న ఆమె తమపై వస్తున్న విమర్శలపై సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు. గతంలో నరేశ్‌ గారే తమని ‘మా’ ఎన్నికల్లోకి ఆహ్వానించారని, ఆయన మాటలు వినే ఎన్నికల్లో పోటీ చేశామని అన్నారు. ‘‘ఈ ఎన్నికల్లో నేను ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ తరపున పోటీ చేస్తానని మోహన్‌బాబు, నరేశ్‌, విష్ణులకు ముందే చెప్పా. అయినా ఎవరు ఏ ప్యానల్‌లో ఉంటారన్నది వాళ్ల వాళ్ల ఇష్టాల్ని బట్టి ఉంటుంది. గతంలో మేము నరేశ్‌కు మద్దతుగా నిలిచాం. ఆయన ఎవరిని తిడితే వాళ్లను తిట్టాం. అయితే ఆ ఆరోపణలు ఎన్నికల వరకే పరిమితం చేయాలని రాజశేఖర్‌.. నరేశ్‌కు సూచించారు. దానికి ఆయన కూడా సరే అన్నారు. కానీ, తర్వాత ఆ విషయంలోనే మాకు.. నరేశ్‌కు విభేదాలు తలెత్తాయి. ఇక ‘మా’ డైరీ విడుదల కార్యక్రమం తర్వాత మా మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ‘మా’ కోసం నరేశ్‌ పనులు చేయలేదని నేను ఎక్కడా చెప్పలేదు. ఆయన అందరినీ కలుపుకొని పోకపోవడం వల్లే ఇన్ని సమస్యలొచ్చాయి. ఏ నిర్ణయం తీసుకుందామన్నా ఎవరినీ పిలిచే వారు కాదు. ‘వాళ్లంతా ఎందుకు? మనం సరిపోతాం కదా’ అనేవారు. తర్వాత ఆయన ఓ ఫారెన్‌ ప్రొగ్రాం నిర్ణయించారు. ఇదే కార్యక్రమం విషయంలో ఆయన రచ్చ రచ్చ చేశారు. చిరంజీవితో సహా పెద్దలందరూ కలిసి ఓ కమిటీ ఏర్పాటు చేసి, ఆ కార్యక్రమానికి సంబంధించిన లావాదేవీలను లెక్కించారు. చివరకు ఎలాంటి తప్పు జరగలేదని నిర్ధారించారు. అయినా కూడా అదే అంశంపై నరేశ్‌ ఎలక్షన్స్‌లో మాట్లాడారు. ఆ పాయింట్‌తోనే ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత ఎవరైతే ఆ ఫారెన్‌ ప్రొగాం చేశారో అదే వ్యక్తులతో మళ్లీ కాంట్రాక్ట్‌ కుదుర్చుకుని, వాళ్ల దగ్గర అడ్వాన్స్‌ తీసుకున్నారు. వాళ్లలో ఓ వ్యక్తి అమెరికాలో ప్రోగ్రాం చేసినందుకు రూ,కోటి ఇస్తామన్నారు. ఇదే విషయాన్ని నరేశ్‌ మాతో చర్చించారు. ‘ఎవరి వల్ల అయితే సమస్య వచ్చిందో వాళ్లతోనే మళ్లీ ప్రోగ్రాం చేస్తామనడం సమంజసం కాద’ని 14 మంది ‘మా’ ప్యానెల్‌లోని సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈసీ మీటింగ్‌ పెట్టాకే నిర్ణయం తీసుకుందామని నరేశ్‌కు చెబితే అందుకు ఆయన ఒప్పుకోలేదు. అక్కడే మాకూ ఆయనకు సమస్య వచ్చింది. అప్పటి నుంచి మేం ఏం మాట్లాడినా ఆయన తప్పుగా భావించేవారు. జనరల్‌ బాడీ మీటింగ్‌ పెడదామంటే మాకు నోటీసులు పంపారు. సభ్యుల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయని డైరీ విడుదల వేడుక సింపుల్‌గా చేద్దామని మేము సూచించాం. కాదని, దాన్ని ఓ పెద్ద వేడుకలా చేసింది నరేశ్‌. అప్పుడే రాజశేఖర్‌ మాట్లాడారు. అది తప్పెలా అవుతుంది. ఇన్ని తప్పులు పెట్టుకుని భాయీ.. భాయీ అంటూ ఎలా కౌగలించుకుంటారు. పెద్ద చిన్నా ఎవరూ రాజశేఖర్‌కు సపోర్ట్‌ చేయలేదు. దీంతో రాజశేఖర్‌ రాజీనామా చేశారు’’ అన్నారు.


ఎన్టీఆర్‌ బాధపడ్డారు..

‘మా’ ఎన్నికల్లో ప్రాంతీయ వాదాన్ని ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కావడం లేదన్నారు జీవిత. ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న వాళ్లు ఏమైనా తెలుగు వాళ్లా? అని ప్రశ్నించారు. ‘‘ఇటీవల ఓ వేడుకలో ఎన్టీఆర్‌ను కలిశా. ‘మీరు నాకు ఓటు వేయాలి’ అని ఆయన్ని అడిగా. ‘నన్ను అడగొద్దమ్మా.. నేను రానమ్మా.. జరుగుతున్నది చూస్తుంటే నిజంగా బాధాకరంగా ఉందమ్మా’ అని అన్నారు. నిజంగా ఆయన చెప్పినట్లు పరిస్థితి అలాగే ఉంది’’ అని ఆమె చెప్పుకొచ్చారు.


 


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని