Naresh: ఆ వివాదంతో ‘మా’కు సంబంధం లేదు.. అందుకే స్పందించలేదు: నరేశ్‌

ప్రత్యక్ష రాజకీయాల్లోకి రమ్మని ఒకట్రెండు పార్టీలు ఆహ్వానించాయని, కానీ తనకు రావటం ఇష్టం లేదని సినీ నటుడు నరేశ్‌(Naresh) అన్నారు.

Published : 19 Jan 2022 23:20 IST

హైదరాబాద్‌: సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్య, వివాదం విషయంలో ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌)కు సంబంధం లేదని, అది కేవలం ‘మా’ సభ్యుల సంక్షేమం కోసమే ఏర్పాటు చేసిన స్వతంత్ర సంస్థ అని సినీ నటుడు నరేశ్‌(Naresh) అన్నారు. సినీ పరిశ్రమ, ముఖ్యంగా ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం తాను నిరంతరం కష్టపడతానని స్పష్టంచేశారు. నటుడిగా, నిర్మాతగా మరింత ముందుకు వెళ్లాలని ఉందని అన్నారు. జనవరి 20న నరేశ్‌ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రమేశ్‌బాబును కోల్పోవడం, కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఈసారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం లేదని తెలిపారు.

‘‘పండంటి కాపురం’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశా. ఈ ఏడాదితో నేను సినీ కెరీర్‌ను మొదలు పెట్టి 50 సంవత్సరాలు పూర్తవుతాయి. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా, హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఇన్ని సంవత్సరాల ప్రయాణం చాలా అరుదు. అందుకు కృష్ణ గారు, విజయ నిర్మలగారితో పాటు, మా గురువు జంధ్యాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అంతేకాదు, నా కెరీర్‌లో ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు నన్ను ప్రోత్సహించారు. నటుడిగా కొనసాగుతూనే సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహించా. భాజపాతో పాటు కలిసి ప్రయాణం చేసి ఉన్నత పదవుల్లో ఉన్నా. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా)కు నా వంతు బాధ్యత నిర్వహించా. ఇప్పటికీ బిజీ యాక్టర్‌గా కొనసాగుతున్నా. అందుకు సినీ పరిశ్రమకు, నా శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. ప్రభుత్వం అందించే పథకాలు సినీ పరిశ్రమలో అర్హులైన వారికి అందేలా నా వంతు ప్రయత్నం చేస్తా’’

‘‘సెకండ్‌ ఇన్నింగ్స్‌లో యువ దర్శకులందరూ నాకు మంచి పాత్రలు ఇచ్చారు. గతేడాది విజయం సాధించిన ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించా. ఈ ఏడాది మరికొన్ని కొత్త పాత్రలు పోషిస్తున్నా. వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటిస్తున్నా. విజయకృష్ణ మూవీస్‌, విజయకృష్ణ ఎంటర్‌టైన్‌ ద్వారా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు నిర్మిస్తాం. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో వివిధ పదవుల్లో పనిచేశా. వెల్ఫేర్‌ కోసం ‘మా’లో ఒక బెంచ్‌ మార్క్‌ క్రియేట్‌ చేశా. అదే గత ఎన్నికల్లో మాకు విజయాన్ని అందించింది. ‘మా’కు ఒకసారే అధ్యక్షుడిగా పోటీ చేస్తానని గతంలో చెప్పా. ఒకవేళ భవిష్యత్‌లో పోటీ చేసినా, ఇండస్ట్రీ బిడ్డగా, ‘మా’ సభ్యులకు సహకారం అందిస్తా’’

‘‘సినీ పరిశ్రమలో నష్టపోయేవారే ఎక్కువమంది ఉన్నారు. ఎప్పటికప్పుడు కొత్త వాళ్లు వస్తుంటారు. ఇతర రంగాల్లో ఉన్నట్లే ఇక్కడ కూడా సమస్యలు ఉంటాయి. దీనిపై పెద్దలందరూ చర్చలు జరుపుతున్నారు. నేను ఆ వివాదంలోకి వెళ్లదలుచుకోలేదు. సినీపరిశ్రమ-ప్రభుత్వం కలిసి ఒక మంచి నిర్ణయానికి వస్తాయని అనుకుంటున్నా. ఇటీవల చిరంజీవిగారు కూడా సీఎం జగన్‌ను కలిశారు. ఈ విషయంలో ‘మా’ స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ‘మా’ అనేది ఆర్టిస్టుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసింది. ఛాంబర్‌లో ఒక భాగం మాత్రమే. వాళ్ల వరకే మా బాధ్యత. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌కు రాజకీయాలతో సంబంధం ఉండకూడదని నా అభిప్రాయం. కొవిడ్‌ ఇంకా తగ్గలేదు. ఈ క్రమంలో ‘మా’ సభ్యుల సంక్షేమమే మాకు ముఖ్యం. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై ఛాంబర్‌ నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రిగారిని కలుస్తుందని భావిస్తున్నా. పదవులు ఆశించి నేను రాజకీయాల్లోకి రాలేదు. ప్రజాసేవ చేసేందుకు చాలా మంది ఉన్నారు. ఒక నటుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, నిర్మాతగా సామాజిక కార్యకర్తగా ముందుకు సాగుతా. వివిధ పార్టీల నుంచి ఆహ్వానాలు అందాయి. నాకు వెళ్లాలని లేదు’’ అని నరేశ్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని