Anthahpuram Review: రివ్యూ: అంతఃపురం

Anthahpuram Review: ఆర్య, రాశీఖన్నా, ఆండ్రియా, సుందర్‌ సి నటించిన ‘అంతఃపురం’ ఎలా ఉందంటే?

Updated : 24 Nov 2022 15:18 IST

చిత్రం: అంతఃపురం; నటీనటులు: సుందర్ సి, ఆర్య, రాశీఖన్నా, ఆండ్రియా, సాక్షి అగర్వాల్‌, వివేక్‌ యోగిబాబు, మనోబాల; సంగీతం: సి.సత్య; సినిమాటోగ్రఫీ: యూకే సెంథిల్‌ కుమార్‌; ఎడిటింగ్‌: ఫెన్నీ ఓలివర్‌; నిర్మాత: ఖుష్బూ; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుందర్‌ సి; విడుదల: జీ5

తెలుగు, తమిళ భాషల్లో హారర్‌ కామెడీ చిత్రాలకు కొదవలేదు. ఈ జానర్‌లో పలు చిత్రాలు విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాల్ని అందుకున్నాయి. ఇలాంటి చిత్రాలు తీయడంలో తమిళ దర్శకుడు సుందర్‌ది ప్రత్యేకమైన శైలిలో గతంలో ఆయన ‘అరణ్మణై ’, ‘అరణ్మణై 2’ చిత్రాలు తీసి విజయం సాధించారు. అవే తెలుగులో ‘చంద్రకళ’, ‘కళావతి’గా విడుదలై ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆ కోవలో వచ్చిన చిత్రమే ‘అరణ్మణై3’. ఇటీవల తెలుగులో ‘అంతఃపురం’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇంతకీ ‘అంతఃపురం’ కథేంటి? అందులో ఏం జరిగింది?

కథేంటంటే: జ్యోతి(రాశీఖన్నా) జమీందారు రాజశేఖర్‌ (సంపత్‌రాజ్‌) కుమార్తె. చిన్నతనంలోనే తల్లి ఈశ్వరి(ఆండ్రియా) చనిపోవడంతో ఒంటరిగా పెరుగుతుంది. అంతఃపురంలాంటి ఇంట్లో ఆమెకు దెయ్యాలు కనపడుతూ ఉంటాయి. అదే విషయాన్ని తండ్రికి చెబితే, చదువుకునేందుకు ఇష్టంలేక అబద్ధాలు చెబుతోందని ఆమెను హాస్టల్‌కు పంపుతాడు. 22ఏళ్ల తర్వాత ఒకరోజు జమీందారు కారు డ్రైవర్ ‌(విన్సెంట్‌ అశోకన్‌) అనుమానాస్పద స్థితిలో ఈతకొలనులో పడి చనిపోతాడు. అతడిని ఆఖరి చూపు చూసేందుకు తిరిగి వస్తుంది జ్యోతి. ఈసారి జ్యోతిపై హత్యాయత్నం జరుగుతుంది. ఆ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంటుంది. ఇంతకీ జ్యోతిని హత్య చేసేందుకు ప్రయత్నించింది ఎవరు? ఆమె తల్లి ఈశ్వరి ఎలా చనిపోయింది? ఈ సమస్యను జ్యోతి బంధువు రవి(సుందర్‌ సి) ఎలా పరిష్కరించాడు? ఇందులో జ్యోతిని ప్రేమించిన రాఘవ(ఆర్య) పాత్ర ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ‘అరణ్మణై’ సిరీస్‌లో సుందర్‌ సి. రూపొందించిన చిత్రాలన్నీ హారర్‌ రివేంజ్‌ డ్రామాలే. ఇప్పుడు వచ్చిన ‘అంతఃపురం’ కూడా ఆ కోవలోదే. గత కొంతకాలంగా బాక్సాఫీస్‌ వద్ద ఇలాంటి హారర్‌ రివేంజ్‌ డ్రామాలు ఎన్నో అలరించాయి. ఈ తరహా కథలన్నింటికీ ఇతివృత్తం ఒకటే అయినా, వాటిని ఎంత ఉత్కంఠగా చూపించామన్న దానిపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు సుందర్‌.సి పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. రొటీన్‌ రివేంజ్‌ డ్రామాను తీసుకుని నాలుగు దెయ్యం షాట్‌లు.. నాలుగు కామెడీ సీన్లు, మరో నాలుగు విజువల్‌ ఎఫెక్ట్స్‌తో సినిమాను వండి వార్చారు. జమీందారు కారు డ్రైవర్‌ చనిపోవటం, ‘అంతఃపురం’లో ఉన్న దెయ్యం జ్యోతిపై హత్యాయత్నం చేయడంతో.. అసలు ఆమెను దెయ్యం ఎందుకు చంపాలనుకుంటోందన్న ఆసక్తి ప్రేక్షకుడిలో మొదలవుతుంది. సరిగ్గా అదే సమయంలో తన కుమార్తెను చూసి వెళ్లేందుకు వచ్చిన జమీందారు సోదరి భర్త రవికి ఇంట్లో దెయ్యం ఉందన్న విషయం జ్యోతి ద్వారా తెలుస్తుంది. అప్పటి వరకూ కథ అంతా సోసోగా నడిపించాడు దర్శకుడు. ఈ క్రమంలో వచ్చే వివేక్‌, యోగిబాబు, మనోబాలల కామెడీ ట్రాక్‌ కూడా పెద్దగా నవ్వించదు. హారర్‌ సినిమాల్లో భయపడుతూ ఉండే సగటు పాత్రలే వాళ్లు పోషించారు. ఇంట్లో ఉన్న దెయ్యం ఎవరు? దాని కథ ఏంటో తెలుసుకునేందుకు రవి రంగంలోకి దిగిన తర్వాతే అసలు కథలు మొదలవుతుంది. అప్పటి నుంచి కథనంలో కాస్త వేగం పెరుగుతుంది. రవి తెలుసుకునే ఒక్కో విషయం ఆసక్తిగా ఉంటుంది. ఆ ట్విస్ట్‌లు కూడా గతంలో వచ్చిన ఒక ట్రెండు హారర్‌ సినిమాలో చూసినట్లే కనిపిస్తాయి. అయితే, దెయ్యం జ్యోతిని ఎందుకు చంపాలనుకున్నదే ఇందులో అసలైన ట్విస్ట్‌. హారర్‌ సినిమాల్లో ఉన్నట్లే పతాక సన్నివేశాలు ఉత్కంఠగా సాగుతాయి. సినిమా ప్రారంభమైన దగ్గరి నుంచి చివరి వరకూ కనిపించే విజువల్‌ ఎఫెక్ట్‌లు మాత్రం చాలా బాగున్నాయి.

ఎవరెలా చేశారంటే: ‘అంతఃపురం’లో నటించిన ఆండ్రియా, ఆర్య, రాశీఖన్నా, సుందర్‌ సి, సంపత్‌ రాజ్‌ ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్ర పరిధి మేరకు నటించారు. ఆర్యతో సహా ఏ పాత్రకూ పెద్దగా స్కోప్‌లేదు. యోగిబాబు, వివేక్‌, మనోబాల కామెడీ ట్రాక్‌ పర్వాలేదు. హారర్‌ సినిమాల్లో ఇలాంటి కాంబినేషన్‌ గతంలో మనం చూసిందే. ఇక తాంత్రిక విద్యలు, సడెన్‌గా దెయ్యాలు కనిపించటం, కుర్చీలు-సోఫాలు గాల్లోకి లేవటం, దెయ్యాన్ని బంధించేందుకు చేసే ప్రయత్నాలు ఇవన్నీ కామన్. సాంకేతికంగా ఈ సినిమా చక్కగా ఉంది. సి.సత్య నేపథ్య సంగీతం హారర్‌ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. అయితే, గుర్తుండిపోయే పాట ఒక్కటీ లేదు. ఫెన్నీ ఓలివర్‌ ఎడిటింగ్‌ ఓకే. కామెడీ ట్రాక్‌ను ఇంకా ట్రిమ్‌ చేసి ఉంటే బాగుండేది. ఇక సినిమాకు ప్రధానంగా చెప్పుకోవాల్సింది యూకే సెంథిల్‌ కెమెరా. ప్రతి సన్నివేశాన్ని చాలా బాగా చూపించారు. ముఖ్యంగా హారర్‌ సీన్స్‌, విజువల్‌ ఎఫెక్ట్‌ సీన్స్‌ బాగున్నాయి. దర్శకుడు సుందర్‌ సి. ఎంచుకున్న పాయింట్‌ కొత్తదేమీ కాదు. అదే పాత రివేంజ్‌ డ్రామా. ఇందులో మరో కొత్త దెయ్యం ప్రతీకారాన్ని చూపించారంతే. అయితే, కథనాన్ని ఉత్కంఠగా తీర్చిదిద్దడంలో తన మార్కు కనిపించింది. మంచిపై చెడు ఎన్నటికీ విజయం సాధించదని తెలిసినా, ఆ విజయం ఎలా లభించిందన్నది పాయింటే సినిమాను చివరి వరకూ చూసేలా చేస్తుంది. హారర్‌ మూవీ కాబట్టి, లాజిక్‌లు పూర్తిగా వదిలేయాల్సిందే. హారర్‌ సినిమాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. సాధారణ ప్రేక్షకులు కూడా కాలక్షేపం కోసం ‘అంతఃపురం’ చూడొచ్చు.  ‘జీ5’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

బలాలు

+ ద్వితీయార్ధం

+ విజువల్‌ ఎఫెక్ట్స్‌

+ పతాక సన్నివేశాలు

బలహీనతలు

- రొటీన్‌ రివేంజ్‌ స్టోరీ

- నిడివి

చివరిగా: కాలక్షేపానికే ‘అంతఃపురం’!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని