మంచి చేసేవాడికి బతికుండగానే మంచి జరగాలి

‘మంచి చేసేవాడికి బతికుండగానే మంచి జరగాలి. కష్టపడేవాడికి భూమ్మీదే ఫలితం లభించాలి.. ఇదే టైమ్‌ బ్యాంకింగ్‌ సిద్ధాంతం ’ అని అంటున్నారు పూరీ జగన్నాథ్‌. పూరీ మ్యూజింగ్స్‌ వేదికగా ఆయన ఎన్నో అంశాల గురించి తన అభిప్రాయాన్ని బహిర్గతం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో...

Published : 16 Oct 2020 14:37 IST

‘టైమ్‌ బ్యాంకింగ్‌’ గురించి పూరీ ఏమన్నారంటే..!

హైదరాబాద్‌: ‘మంచి చేసేవాడికి బతికుండగానే మంచి జరగాలి. కష్టపడేవాడికి భూమ్మీదే ఫలితం లభించాలి.. ఇదే టైమ్‌ బ్యాంకింగ్‌ సిద్ధాంతం ’ అని అంటున్నారు పూరీ జగన్నాథ్‌. పూరీ మ్యూజింగ్స్‌ వేదికగా ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ‘టైమ్‌ బ్యాంకింగ్‌’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

‘దాదాపు 35 సంవత్సరాల క్రితం ఎడ్గర్‌ఖాన్‌ అనే వ్యక్తి ‘టైమ్‌ బ్యాంకింగ్‌’ కనిపెట్టారు. ఇది డబ్బు మీద కాదు సేవలపై ఆధారపడి పనిచేస్తుంది. మొట్టమొదట స్విట్జర్లాండ్‌లో వృద్ధుల కోసం దీనిని ప్రారంభించారు. ఇందులో మనం చేయాల్సిన పని ఏమిటంటే.. సేవలు ఇచ్చిపుచ్చుకోవడం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో 500 టైమ్‌ బ్యాంక్‌లు అందుబాటులో ఉన్నాయి. మనదేశంలోని మధ్యప్రదేశ్‌లో త్వరలో ‘టైమ్‌ బ్యాంకింగ్‌’ ప్రారంభించనున్నారు. ఒకరికొకరు సాయం చేసుకుంటే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది. గడిచిపోతున్న ప్రతి గంటను ఎందుకు వృథా చేయాలి’ అని పూరీ జగన్నాథ్‌ తెలిపారు.

అనంతరం ఆయన ‘ట్రావెలింగ్‌’ గురించి స్పందిస్తూ..‘‘ట్రావెలింగ్‌’ ఒక అద్భుతమైన విషయం. మీరు ఏం చేస్తున్నారు అని అడిగితే ‘ఐ యామ్‌ ఏ ట్రావెలర్‌’ అని చెప్పాలని ఉంది. ప్రపంచం మొత్తాన్ని అన్వేషించాలనుంది. కానీ సంసారం అనే సాగరంలో చిక్కుకున్నాను కాబట్టి కుదరదు. అయినా పర్వాలేదు. ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశానికి వెళ్లండి.. తిరిగి రండి. ఒక గ్రూప్‌తో వెళ్లి గైడ్‌ వెనకాల తిరిగే వాళ్లని టూరిస్ట్‌లంటారు. ఇష్టమొచ్చిన ప్రాంతానికి వెళ్లేవాడిని ట్రావెలర్స్‌ అంటారు. ఈ ప్రపంచం ఒక పెద్ద పుస్తకం. నువ్వు మీ ఊళ్లోనే పుట్టి.. అక్కడే మరణిస్తే నీకు ఒక పేజీ మాత్రమే తెలుసు అని అర్థం. వీలైనన్ని పేజీలు తిరగేయండి. అతి తక్కువ ఖర్చుతో ఎలా ట్రావెల్‌ చేయాలో ఒకసారి గూగుల్‌ చేయండి’ అని పూరీ వివరించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని