Updated : 19/10/2021 12:53 IST

Afghanistan: అఫ్గాన్‌ భవితను శాసించిన ఆ ముగ్గురూ ఎక్కడ..?

 ఎవరికీ మిగలని సంతోషం.. పాక్‌కు దక్కిన పెత్తనం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ప్రస్తుతం ఉన్న అఫ్గాన్‌ స్థితికి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఆ ముగ్గురు కారకులే. ఒకరు దౌత్యవేత్త.. మరొకరు రాజకీయ వేత్త.. ఇంకొకరు తాలిబన్‌..! ప్రస్తుతం వీరిలో ఎవరూ సంతృప్తిగా లేరు. అమెరికా తన భుజస్కందాలపై ఉంచిన బాధ్యతను నిర్వహించడంలో విఫలమై ఒకరు.. పాలనా వైఫల్యంతో అధికారం కోల్పోయి మరొకరు.. పేరుకు అధికారం దక్కినా.. పెత్తనం మరొకరిదైనందుకు ఇంకొకరు అసంతృప్తిగా ఉన్నారు. వారెవరో తెలుసా.. అమెరికా రాయబారి జల్మే ఖలీల్జాద్‌, అఫ్గాన్‌ మాజీ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ.. అఫ్గాలోని తాలిబన్‌ ప్రభుత్వ విదేశాంగ శాఖ ఉప మంత్రి  షేర్‌ మహమ్ముద్‌ స్టానిక్జాయ్‌..!

అఫ్గానిస్థాన్‌లో పుట్టిన ఈ మూగ్గురూ 1970ల్లో విదేశాల్లో చదువుకొన్నారు. 53 ఏళ్ల క్రితం కలుసుకొన్న ఖలీల్జాద్‌, ఘనీ లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని అమెరికన్‌ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశారు. అప్పట్లో మధ్యప్రాశ్చ్యంలో ఈ విశ్వవిద్యాలయానికి అత్యున్నత విద్యను అందించే సంస్థగా పేరుంది. ఆ తర్వాత వీరు అమెరికా చేరుకొన్నారు. ఖలీల్జాద్‌ షికాగో విశ్వవిద్యాలయంలో డాక్టరేట్‌ చేయగా.. ఘనీ కొలంబియా యూనివర్శిటీ నుంచి డాక్టరేట్‌ అందుకొన్నారు. ఇక స్టానిక్జాయ్‌ భారత్‌లోని డెహ్రాడూన్‌ ‘ఇండియన్‌ మిలటరీ అకాడమీ’లో చదివారు. ఇక్కడ ఉన్నప్పుడే అతడికి ‘షేర్‌’ అనే నిక్‌నేమ్‌ వచ్చింది. ఆ తర్వాత పాకిస్థాన్‌లోని క్వెట్టా చేరుకొని అఫ్గాన్‌ ముజాహిద్దీన్‌లకు దగ్గరయ్యారు. కాల క్రమంలో  ఖలీల్జాద్‌, ఘనీ, స్టానిక్జాయ్‌లు అఫ్గాన్‌ సంక్షోభ సమయంలో కొన్నేళ్లపాటు కీలక పాత్ర పోషించారు.

ఖలీల్జాద్‌ రాజీనామా..

అఫ్గానిస్థాన్‌పై 2002లో అమెరికా దాడి వ్యూహాన్ని ఖలీల్జాద్‌ సాయంతోనే నాటి అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్‌ అమలు చేశారు. దీంతో ఆయన్ను అఫ్గాన్‌లో దళాల ఉపసంహరణ కోసం అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ నియమించారు. కొత్తగా శ్వేతసౌధంలోకి వచ్చిన బైడెన్‌ కూడా ఆయన్ను కొనసాగించారు. కానీ, బలగాల ఉపసంహరణ గందరగోళమై అమెరికా చరిత్రలోనే భారీ అవమానం మిగిలిపోయింది. కతర్‌లో జరిగిన శాంతి చర్చల్లో ఖలీల్జాద్‌ తాలిబన్లకు అనుకూలంగా వ్యవహరించారని అమెరికా అధికారులు గుర్రుగా ఉన్నారు. తాలిబన్లపై ఒత్తిడి తీసుకురావాల్సిన సమయంలో కూడా ఆయన ఉదారంగా వ్యహరించారనే అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు. ఖలీల్జాద్‌ అమ్ముడు పోయారంటూ అఫ్గాన్‌ మాజీ అధ్యక్షుడు ఘనీ సలహాదారు తీవ్ర విమర్శలు గుప్పించారు. అసలు ఈ శాంతి చర్చలనే ఘనీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత తాలిబన్ల ఆక్రమణ తెలిసిందే.

తాజాగా సోమవారం అమెరికా విదేశాంగ  శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌ కీలక ప్రకటన చేశారు. థామస్‌ వెస్ట్‌ను అఫ్గానిస్థాన్‌లో అమెరికా రాయబారిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాజీనామా చేసిన ఖలీల్జాద్‌కు కృతజ్ఞతలు చెప్పారు.

తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘనీ..!

అఫ్గాన్‌ మాజీ అధ్యక్షుడు ఘనీ ప్రస్తుతం యూఏఈలో తలదాచుకొన్నారు. ఆయన మిలియన్ల కొద్దీ డాలర్లను తనతోపాటు తీసుకెళ్లారనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు..  పాలన సమయంలో అవినీతికి ఆస్కారమివ్వడమే కాకుండా  ప్రభుత్వ బలగాలను బలహీనపర్చి తాలిబన్ల బలోపేతానికి కారణమయ్యారని ఆరోపణలూ ఉన్నాయి. తాలిబన్ల ఆక్రమణకు ముందే దేశం విడిచి పారిపోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ప్రభుత్వంలోని అమ్రుల్లా సలేహ్‌, అబ్దుల్లా అబ్దుల్లా వంటి నాయకులు తాలిబన్లు వచ్చినా అఫ్గానిస్థాన్‌లోనే కొనసాగారు. ఇప్పుడు అఫ్గానిస్థాన్‌లో జరిగిన అవినీతి విషయంలో ఘనీ పాత్రపై దర్యాప్తు చేస్తామని  సిగర్‌ (స్పెషల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఫర్‌ అఫ్గానిస్థాన్‌ రీకన్‌స్ట్రక్షన్‌) జాన్‌ సోప్కో పేర్కొన్నారు. అంతేకాదు.. ఘనీ డబ్బుతో పారిపోయిన అంశంపై కూడా దర్యాప్తు చేయాలని అమెరికా కాంగ్రెస్‌  సిగర్‌కు సూచించింది.

అధికారం దక్కినా అసంతృప్తే..!

ఇక స్టానిక్జాయ్‌ పరిస్థితి భిన్నంగా ఉంది. తాలిబన్ల తొలి పాలనలో కూడా విదేశంగ శాఖ సహాయ మంత్రి, ఆరోగ్యశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. తాలిబన్లు అధికారం కోల్పోయాక దోహాలో తాలిబన్‌ పొలిటకల్‌ ఆఫీస్‌ తెరిచినప్పటి నుంచి అక్కడే ఉన్నారు. 2015లో తాలిబన్‌ పొలిటికల్‌ ఆఫీస్‌కు తాత్కాలిక అధిపతయ్యారు. తాలిబన్ల దోహా టీమ్‌లో కీలక పాత్ర పోషించారు. అఫ్గాన్‌ శాంతి చర్చల సమయంలో ముల్లా బరాదర్‌ తర్వాతి స్థానంలో డిప్యూటీ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించారు. తాలిబన్ల అంతర్జాతీయ సంబంధాల్లో కీలక పాత్ర పోషించారు.

తాలిబన్లు అఫ్గాన్‌ను ఆక్రమించిన తర్వాత అమెరికాతో మంచి సంబంధాలు కోరుకుంటున్నట్లు ఆగస్టు 30న స్టానిక్జాయ్‌ ప్రకటించారు. కానీ, ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. పాక్‌ ఆశీస్సులతో హక్కానీ వర్గం అఫ్గాన్‌ ప్రభుత్వంలో కీలక స్థానం దక్కించుకొంది. ఇదే సమయంలో తాలిబన్లకు అండగా ఉండాల్సిన ప్రభుత్వ సుప్రీం లీడర్‌ హిబయితుల్లా అఖుంద్‌జాద్‌ అడ్రస్‌ లేదు. డిప్యూటీ హెడ్‌ ముల్లా బరాదర్‌ కూడా చురుగ్గా లేరు. పాక్‌ జోక్యంపై స్టానిక్జాయ్‌ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు అఫ్గాన్‌ విదేశాంగశాఖ డిప్యూటీ మినిస్టర్‌గా పదవి దక్కినా.. ఇంత వరకూ బాధ్యతలు చేపట్టలేదు. ఇటీవల దోహాలో అమెరికాతో చర్చలు ముగిసిన వెంటనే ఆయన అఫ్గాన్‌కు కాకుండా నేరుగా దుబాయ్‌కు వెళ్లిపోవడం గమనార్హం.

అఫ్గాన్‌ పాలనలో చక్రం తిప్పిన ఈ ముగ్గురూ ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉన్నారు. అధికారం దక్కేదాకా వేచి చూసిన పాక్‌ ప్రేరిత హక్కానీ నెట్‌వర్క్‌ శాంతి చర్చల ఫలాలను లాగేసుకుంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని