Afghanistan: అఫ్గానిస్థాన్‌లో దారుణం.. నలుగురు మహిళల హత్య!

అఫ్గాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి.. స్థానికంగా పౌర హక్కుల కార్యకర్తలు, న్యాయమూర్తులు, పాత్రికేయులు భయంభయంగా కాలం వెళ్లదీస్తున్న విషయం తెలిసిందే! ముఖ్యంగా మహిళల పరిస్థితి దీనంగా మారింది. తమను...

Updated : 06 Nov 2021 20:55 IST

మృతుల్లో ఒకరు మహిళా హక్కుల కార్యకర్త

కాబుల్‌: అఫ్గాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి.. స్థానికంగా పౌర హక్కుల కార్యకర్తలు, న్యాయమూర్తులు, పాత్రికేయులు భయంభయంగా కాలం వెళ్లదీస్తున్న విషయం తెలిసిందే! ముఖ్యంగా మహిళల పరిస్థితి దీనంగా మారింది. తమను తాలిబన్లు వేటాడుతున్నారంటూ, ప్రాణభయం ఉందంటూ చాలామంది ఇది వరకే వాపోయారు. కొందరు దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. తాజాగా ఇదే ప్రయత్నాల్లో ఉన్న మహిళా హక్కుల కార్యకర్త ఫ్రోజన్ సఫీ(29)తో సహా నలుగురు మహిళలను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపడం స్థానికంగా చర్చనీయాంశమైంది. బాల్ఖ్‌ ప్రావీన్స్‌లోని మజారే షరీఫ్‌లో వీరు హత్యకు గురయ్యారు. ఓ ఇంట్లో వీరి మృతదేహాలు లభ్యమయ్యాయని తాలిబన్ల అధికార ప్రతినిధి ఖరీ సయ్యద్‌ ఖోస్త్‌ తెలిపారు. ఈ వ్యవహారంలో ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. వారిని తామే ఆహ్వానించినట్లు నిందితులు విచారణలో అంగీకరించారన్నారు. ఇటీవల తాలిబన్ల పాలన మొదలయ్యాక.. ఓ మహిళా హక్కుల కార్యకర్త హత్యకు గురికావడం ఇదే మొదటిసారి! అక్టోబరు 20న ఇంటినుంచి బయటకు వెళ్లిన ఆమె.. తాజాగా మృతదేహమై తేలారు.

‘దుస్తులను బట్టి గుర్తించాం..’ 

ఫ్రోజన్‌ సఫీ ఎకనామిక్స్‌ లెక్చరర్‌గానూ పని చేసినట్లు సమాచారం. ‘మేం దుస్తులను బట్టి ఆమెను గుర్తించాం. బుల్లెట్లు ఆమె ముఖాన్ని ఛిద్రం చేశాయి’ అని సఫీ సోదరి రీటా కన్నీటిపర్యంతమయ్యారు. ‘ఇటీవల ఫ్రోజన్‌కు ఓ గుర్తుతెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది. హక్కుల కార్యకర్తగా ఉన్న ఆమె తన పనులకు సంబంధించిన దస్త్రాలతోసహా వస్తే, సురక్షిత ప్రాంతానికి చేరవేస్తామని చెప్పారు. అప్పటికే జర్మనీలో ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్న ఆమె.. తన విజ్ఞప్తి నెరవేరుతోందని భావించి, డిప్లొమాతోసహా కొన్ని పత్రాలను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయారు’ అని రీటా వివరించారు. అయితే ఆమెను ఎవరు కాల్చి చంపారో తెలియదన్నారు. మిగతా ముగ్గురికీ ఇదే తరహా ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై తాలిబన్‌ నేత జబీహుల్లా నూరానీ స్పందిస్తూ.. వ్యక్తిగత కక్షతోనే ఈ హత్యలు జరిగి ఉండొచ్చన్నారు. పోలీసులు ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని