Corona Virus: జర్మనీలో ఆగని కొవిడ్‌ కేసులు.. బూస్టర్‌ డోసుకు ఓకే

భారీ సంఖ్యలో కొవిడ్‌ కేసులతో జర్మనీ అల్లాడుతోన్న విషయం తెలిసిందే. వైరస్‌ వ్యాప్తి మొదలైనప్పటినుంచి రోజువారీగా ఎన్నడూ రానన్ని కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఇంటెన్సివ్ కేర్ రోగులతో దేశంలో కొవిడ్‌ పరిస్థితి గడ్డుకాలంలోకి ప్రవేశిస్తోందని...

Published : 06 Nov 2021 01:53 IST

బెర్లిన్: భారీ సంఖ్యలో కొవిడ్‌ కేసులతో జర్మనీ అల్లాడుతోంది. వైరస్‌ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి రోజువారీగా ఎన్నడూ రానన్ని కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఇంటెన్సివ్ కేర్ రోగులతో దేశంలో కొవిడ్‌ పరిస్థితి గడ్డుకాలంలోకి ప్రవేశిస్తోందని ఆరోగ్య మంత్రి జెన్స్ స్పాన్ తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పౌరులందరికీ బూస్టర్‌ డోసు వేసేందుకు ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించారు. ప్రతి ఒక్కరూ తమ మునుపటి డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించారు. ఇది ఒక కట్టుబాటుగా మారాలి.. మినహాయింపులా కాదని స్పాన్ స్పష్టం చేశారు. పౌరులంతా విధిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని, కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. 

వరుసగా రెండో రోజు కేసుల పెరుగుదల

తాము యువకులమని, తమకేం కాదని భావిస్తున్నవారు ఎవరైనా ఉంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఇంటెన్సివ్ కేర్ సిబ్బందిని అడిగి తెలుసుకోవాలని స్పాన్‌ హెచ్చరిక ధోరణిలో అన్నారు. వెంటనే అత్యవసర చర్యలు తీసుకోని పక్షంలో దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ విధించాల్సి వస్తుందని జర్మనీ నాయకులు ఇదివరకే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. జర్మనీలో గడచిన 24 గంటల వ్యవధిలో 37,120 కొత్త కేసులు నమోదయ్యాయి. గతేడాది మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి అత్యధిక రోజువారీ కేసుల పెరుగుదలను నమోదు చేయడం ఇది వరుసగా రెండో రోజు. అధికారిక గణాంకాల ప్రకారం..  జర్మనీలో 83 మిలియన్ల జనాభాలో మూడింట రెండొంతుల మందికి మాత్రమే వ్యాక్సినేషన్‌ తొలి డోసు పూర్తయింది. మరోవైపు.. దేశంలో బూస్టర్‌ డోసు అందుబాటులోకి తేవాలని ఆగస్టులోనే అధికారులు అంగీకరించారు. తొలుత 60 ఏళ్లు పైబడినవారికి, నర్సింగ్‌ హోమ్‌ రెసిడెంట్స్‌, సిబ్బందికి మాత్రమే ఇవ్వాలని నిర్ణయించగా.. తాజాగా అందరికీ ఇవ్వనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని