WHO: భారత్‌లో వారంలోనే 150% పెరిగిన కరోనా కేసులు: డబ్ల్యూహెచ్‌ఓ

ఆగ్నేయాసియాలో కొవిడ్-19 కేసులు పెరిగేందుకు భారత్‌ మూలకారణం అని, ఆ దేశంలో వారంలోనే 150 శాతం కేసులు పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది......

Published : 24 Jan 2022 17:50 IST

జెనీవా: ఆగ్నేయాసియాలో కొవిడ్-19 కేసులు పెరిగేందుకు భారత్‌ మూలకారణమని, ఆ దేశంలో వారంలోనే 150 శాతం కేసులు పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. గడిచిన వారంలో భారత్‌లో 15,94,160 కేసులు నమోదయ్యాయని.. అంతకుముందు వారం 6,38,872 కేసులు మాత్రమే వెలుగుచూశాయని డబ్ల్యూహెచ్‌ఓ ఓ ప్రకటనలో తెలిపింది.

తూర్పు మధ్యధరా ప్రాంతాల్లోనూ గడిచిన వారంలో కొవిడ్‌ వ్యాప్తి బాగా పెరిగినట్లు ఆరోగ్య సంస్థ పేర్కొంది. మొరాకోలో అత్యధిక సంఖ్యలో కొత్త కేసులు నమోదైనట్లు తెలిపింది. అంతకుముందు వారం 4,610 కేసులు బయటపడితే, గడిచిన వారం 45 శాతం పెరిగిపోయి 31,701 కొత్త కేసులు నిర్ధరణ అయినట్లు వెల్లడించింది. ట్యూనీషియాలో అత్యధికంగా 194 శాతం వృద్ధిచెంది గతవారం 13,416 కొత్త కేసులు బయటపడ్డాయని, లెబనాన్‌లో 19 శాతం పెరిగి 38,112 కేసులు వెలుగుచూసినట్లు వివరించింది.

తీవ్ర వ్యాప్తిగల ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటివరకు 171 దేశాలకు పాకినట్లు WHO వెల్లడించింది. ఈ వేరియంట్‌లో తీవ్రమైన వ్యాధి, ఇన్‌ఫెక్షన్‌ కారణంగా మరణించే ప్రమాదం తక్కువగానే ఉన్నప్పటికీ.. ఓమిక్రాన్‌కు సంబంధించిన మొత్తం ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. ‘మునుపటి సార్క్‌-కోవ్‌-2 వేరియంట్‌ల కంటే ఒమిక్రాన్‌లో తీవ్రమైన వ్యాధి, సంక్రమణ అధికంగా ఉన్నప్పటికీ మరణాల ప్రమాదం తక్కువగా ఉంది. కానీ చాలా వేగంగా వ్యాప్తి చెందే గుణం కారణంగా ఎక్కువమందికి సంక్రమిస్తోంది. చాలా మంది ఆసుపత్రుల్లో చేరారు. అనేక దేశాల్లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై భారం పడింది’ అని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది: టెడ్రోస్ అధనామ్‌

కొవిడ్‌ మహమ్మారి తీవ్రమైన దశను అంతం చేసేందుకు అన్ని దేశాలు కలిసి పనిచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్ టెడ్రోస్ అధనామ్ విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు. దీన్ని అంతం చేసేందుకు ఆయా దేశాల వద్ద అన్ని సాధనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ‘కొవిడ్‌-19 ఇప్పుడు మూడో సంవత్సరంలోకి ప్రవేశిస్తోంది. మనం ఇప్పుడు క్లిష్ట దశలో ఉన్నాం. మహమ్మారి తీవ్రమైన దశను అంతం చేసేందుకు మనం కలిసి పని చేయాలి. కరోనాను ఇలాగే కొనసాగించకూడదు’ అని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని