vaccines for children: 5-11 ఏళ్ల వారికి టీకాలు ప్రారంభించనున్న అగ్రరాజ్యం

5-11 ఏళ్ల పిల్లలకు వచ్చే నెల నుంచి టీకాలు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వైట్‌హౌస్‌ బుధవారం ప్రకటించింది. వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (CDC)......

Published : 20 Oct 2021 23:21 IST

వాషింగ్టన్‌: అమెరికాలో కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతుండటంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను అగ్రరాజ్యం వడివడిగా చేపడుతోంది. ఇప్పటివరకు వయోజనులతోపాటు 12-18 ఏళ్ల వారికి వ్యాక్సిన్లు ఇస్తున్న అమెరికా.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. 5-11 ఏళ్ల పిల్లలకు వచ్చే నెల నుంచి టీకాలు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వైట్‌హౌస్‌ బుధవారం ప్రకటించింది. వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (CDC) నుంచి అనుమతులు రాగానే నిర్ణీత వయసు పిల్లలకు వ్యాక్సిన్లు అందిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. ఆరోగ్యశాఖ నిపుణుల సూచనల మేరకు ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని వెల్లడించింది.

5-11 ఏళ్ల పిల్లలకు శిశువైద్యుల కార్యాలయాలు, స్థానిక ఫార్మసీలు, వారి పాఠశాల్లోనూ ఫైజర్‌ టీకాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారయంత్రాంగం పేర్కొంది. నవంబర్‌లో మొదటి టీకా తీసుకున్నవారికి డిసెంబర్‌లో రెండో డోసు వేసి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని బైడెన్‌ ప్రభుత్వం భావిస్తోంది. అయితే టీకా భద్రత, రక్షణపై నెలకొన్న అనుమానాలను తొలగించేందుకు సైతం ముమ్మర చర్యలు చేపడుతోంది. భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరులు, వారి పిల్లలకు భరోసా కల్పిస్తోంది. ప్రజలు టీకాలు తీసుకునేలా.. విద్యావేత్తలు, వైద్యులు, నేతలతో అవగాహన కల్పిస్తోంది.

అమెరికాలో వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 83 వేల మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు వైరస్‌ బారిన పడ్డవారి సంఖ్య 4.51 కోట్లకు చేరింది. వైరస్‌తో మొత్తంగా 7.28 లక్షల మంది మృతిచెందారు. కాగా 12-18 ఏళ్లవారితో కలిసి అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 21.9 కోట్ల మంది కనీసం ఒక్కడోసు తీసుకున్నారు. 19 కోట్ల మంది పూర్తిస్థాయిలో వ్యాక్సిన్లు తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని