Farmers protest: సీఎం ఇంటిముందు ఆందోళన.. రైతులపై జల ఫిరంగుల ప్రయోగం

హరియాణాలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై మరోసారి పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ నివాసం వద్ద శనివారం రైతులు ఆందోళన చేస్తుండగా.. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వీటిని ఉపయోగించారు.

Published : 02 Oct 2021 17:55 IST

చండీగఢ్‌: హరియాణాలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై మరోసారి పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ నివాసం వద్ద శనివారం రైతులు ఆందోళన చేస్తుండగా.. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వీటిని ఉపయోగించారు. వారంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో ధాన్యం సేకరణను పది రోజుల పాటు నిలిపివేయాలన్న కేంద్రం నిర్ణయంపై సంయుక్త కిసాన్‌ మోర్చా ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా పంజాబ్‌, హరియాణాలోని ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ఆందోళన చేయాలని రైతులకు సూచించింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం హరియాణా సీఎం నివాసం ముందు వందలాది మంది రైతులు ఆందోళనకు దిగారు. రాత్రంతా జాగారం చేస్తామన్నారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డంగా పెట్టిన బారికేడ్లు ఎక్కి మరీ నిరసన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు జల ఫిరంగులు ప్రయోగించారు.

శుక్రవారం సైతం ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. హరియాణా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్‌ చౌతాలాకు వ్యతిరేకంగా శుక్రవారం రైతులు నిరసన తెలిపారు. జజ్జర్‌లోని ఓ కార్యక్రమానికి హాజరవ్వగా... రైతులు మార్చ్‌ నిర్వహించ తలపెట్టారు. ఈ క్రమంలో రైతులపై పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు. ఇందుకోసం మురుగునీటిని ఉపయోగించారని రైతులు ఆరోపించారు. అనంతరం నిరసనకారులు ఆందోళన చేస్తున్న ప్రదేశానికి డిప్యూటీ సీఎం హాజరవ్వగా.. నల్లజెండాలు చూపించి నిరసన తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని