Updated : 11/07/2021 11:57 IST

J&K: ప్రభుత్వ ఉద్యోగుల ముసుగులో..!

* ఉగ్రవాదులకు సాయం

ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం ‌

సయ్యద్‌ సలాహుద్దీన్‌.. ఉగ్రసంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ చీఫ్‌. మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది. అతడికి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక్క కుమారుడు తప్ప అందరూ జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. 2016లో వీరిలో ఒక కుమారుడు పనిచేస్తున్న కార్యాలయంపై ఉగ్రవాదులు దాడి చేస్తే.. భద్రతా బలగాలు ప్రాణాలకు తెగించి అందరితోపాటు అతడిని కూడా కాపాడాయి. తాజాగా సలాహుద్దీన్‌ సంతానంలో ఇద్దరు కుమారులు ఉగ్రవాదులకు సాయం చేస్తున్నట్లు తేలింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగం నుంచి వారిని తొలగించారు.

జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం 11 మంది ప్రభుత్వ ఉద్యోగులపై వేటు వేసింది. వీరిలో ఉగ్ర సంస్థ హిజ్బుల్‌  చీఫ్‌ సయ్యద్‌ సలాహుద్దీన్‌ కుమారులిద్దరు ఉన్నారు. ఉగ్రవాదులకు కీలక సమాచారంతోపాటు వారి రవాణాకు అవసరమైన సహకారం అందించారనే ఆరోపణలు వీరిపై ఉన్నాయి. సలాహుద్దీన్‌ కుమారులైన సయ్యద్‌ అహ్మద్‌ షకీల్‌, షాహిద్‌ యూసఫ్‌లు ఉగ్రవాదులకు నిధులు సేకరించడం, హవాలా మార్గంలో పంపించడం వంటి పనులు చేస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. ఉద్యోగాల్లోంచి తొలగించిన 11 మందిలో నలుగురు జమ్ముకశ్మీర్‌ విద్యా శాఖలో, ఇద్దరు రాష్ట్ర పోలీస్‌ విభాగంలో, షేర్‌ ఈ కశ్మీరీ మెడికల్‌ సైన్సెస్‌, వ్యవసాయ శాఖ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, పవర్‌ అండ్‌ హెల్త్‌ విభాగాల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

* పోలీసు శాఖలో పని చేస్తూ ఉగ్రవాదులకు సాయం చేసిన ఇద్దరూ బలగాల ఆపరేషన్లకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఉగ్రవాదులకు చేరవేశారు. వీరిలో అబ్దుల్‌ రషీద్‌ షిగన్‌ అనే వ్యక్తి భద్రతా దళాలపై దాడులు కూడా చేసినట్లు గుర్తించారు.

* వైద్య శాఖలో పనిచేస్తున్న నాజ్‌ ఎం. అల్లాయ్‌ అనే వ్యక్తి హిజ్బుల్‌కు క్షేత్రస్థాయి కార్యకర్తగా పని చేశాడు. అతడు గతంలో ఇద్దరు ఉగ్రవాదులకు తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు.

* విద్యాశాఖలో పని చేసే జబ్బార్‌ అహ్మద్‌ పరాయ, నాసిర్‌ అహ్మద్‌ తంత్రిలు పాకిస్థాన్‌, జమాత్‌ ఇ ఇస్లామ్‌ నుంచి నిధులు పొంది.. వేర్పాటువాద భావజాలాన్ని ప్రచారం చేశారు.

* విద్యుత్తు శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న షహీన్‌ అహ్మద్‌ లోన్‌ అనే వ్యక్తి హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కోసం ఆయుధాలను సరఫరా చేసినట్లు గుర్తించారు. అతను గతేడాది జనవరిలో శ్రీనగర్‌ నుంచి జమ్ముకు వెళ్లే జాతీయ రహదారిపై ఇద్దరు ఉగ్రవాదులతో కలిసి ప్రయాణించినట్లు గుర్తించారు. ఆ సమయంలో వీరి వద్ద ఆయుధాలు, మందుగుండు సామగ్రి కూడా ఉన్నట్లు తేలింది.

* కుప్వారాలో ఇండస్ట్రీయల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఒక ఉద్యోగిని తొలగించారు. అతను లష్కరే  ఉగ్ర సంస్థకు భద్రతా దళాల కదలికలపై సమాచారం అందజేసినట్లు గుర్తించారు.

* దేశ వ్యతిరేక భావజాలాన్ని ప్రచారం చేస్తున్నట్లు అనంతనాగ్‌లో ఇద్దరు టీచర్లపై ఆరోపణలు వచ్చాయి.

2016లో ఉగ్రదాడి నుంచి కాపాడిన బలగాలు..

సలాహుద్దీన్‌ కుమారుల్లో ఒకరైన సయ్యద్‌ మొయిద్‌ 2016లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఈఐడీ)లో ఐటీ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆ  ఏడాది పాంపోరేలోని ఈఐడీ కార్యాలయంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ భవనంలో ఉన్న దాదాపు 100 మందిని భద్రతా బలగాలు సురక్షితంగా కాపాడాయి. వీరిలో సయ్యద్‌ మొయిద్‌ కూడా ఒకరు. అప్పట్లో బలగాలు అతడిని సాధారణ పౌరుడిలానే చూశాయి. తండ్రి ఉగ్రవాది కావడంతో దాడికి సంబంధం ఉందేమోనని అనుమానించలేదు. కనీసం ప్రశ్నించలేదు. ఇప్పుడు అతడి సోదరులైన సయ్యద్‌ అహ్మద్‌ షకీల్‌, షాహిద్‌ యూసఫ్‌లు ఉగ్రవాదులకు సహకరిస్తూ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు.

సలాహుద్దీన్‌ సంతానంలోని ఏడుగురిలో ఒక్కరు తప్ప మిగిలిన వారు మొత్తం  ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. మొయిద్‌ ఈఐడీలో చేస్తుండగా, షకీల్‌ షేర్‌-ఇ-కశ్మీర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్నారు. వాహిద్‌ యూసఫ్‌ స్కిమ్స్‌లో డాక్టర్‌గా, కుమార్తెలు నసీమా, అక్తారాలు ప్రభుత్వ టీచర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో ముగ్గురికి సొంత ప్రాంతాల్లోనే పోస్టింగ్‌లు ఇచ్చారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్