corona:ఆ దేశంలో హైబ్రిడ్ కరోనా రకం..

కరోనా రూపాంతరం చెంది ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉన్న రకాలు చాలనట్లు..ఇంకో కొత్త వేషం వేసుకొని వియత్నాంను హడలగొడుతోంది.

Published : 29 May 2021 19:49 IST

రెండు ఉత్పరివర్తనాల కలయికతో కొత్త రకం


దిల్లీ: కరోనాలో వస్తున్న కొత్త కొత్త వేరియంట్లు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. తాజాగా వియత్నాంలో కొత్త రకం కరోనా వైరస్‌ను గుర్తించామని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి శనివారం వెల్లడించారు. అది భారత్‌, యూకేల్లో మొదట గుర్తించిన కరోనా రకాల కలయిక అని ఆయన తెలిపారు. అలాగే అది వేగంగా వ్యాప్తి చెందుతోందని స్థానిక మీడియా వెల్లడించింది. 

గతేడాది ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా విశ్వరూపం చూపిస్తుండగా..వియత్నాం మాత్రం దాన్ని విజయవంతంగా కట్టడి చేయగలిగింది. కానీ ప్రస్తుతం ఆ దేశంలో వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఏప్రిల్ చివరి నుంచి ఇప్పటివరకు అక్కడ సుమారు 3,600 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తంగా వెలుగుచూసిన కేసుల్లో ఇవి దాదాపు సగం. ‘ఇటీవల కరోనా బారిన పడిన బాధితుల్లో గుర్తించిన వైరస్‌కు జీనోమ్ సీక్వెన్సింగ్‌ నిర్వహించాం. అది భారత్‌, బ్రిటన్‌లో కనుగొన్న కరోనా రకాల కలయికతో కూడిన కొత్త వేరియంట్‌ అని గుర్తించాం. ఇంకా చెప్పాలంటే..భారత్‌లో గుర్తించిన రకానికి యూకే రకం ఉత్పరివర్తనలు కలగలిసి ఉన్నాయి’ అని వియత్నాం మంత్రి వెల్లడించారు. త్వరలో ఇది ప్రపంచానికి ముప్పుగా మారనుందని మంత్రిని ఉటంకిస్తూ అక్కడి మీడియా రాసుకొచ్చింది.

వియత్నాంలో ఇప్పటికే ఏడు రకాల వేరియంట్లను గుర్తించారు. వాటిలో భారత్‌, బ్రిటన్‌లో బయటపడిన రకాలున్నాయి. అలాగే ఈ హైబ్రిడ్ రకం వేగంగా వ్యాప్తి చెందుతోందని, అంతే వేగంగా ప్రతిరూపాలను సృష్టించుకుంటోందని తెలిపింది. ఇక, ఆ దేశంలో ఇప్పటివరకు 6,396 కొత్త కేసులు వెలుగుచూడగా..47 మరణాలు సంభవించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని