Sansad TV: లోక్‌సభ, రాజ్యసభ ఛానళ్ల స్థానంలో కొత్త టీవీ.. రేపే ప్రారంభం

పార్లమెంట్‌ ఉభయ సభల కార్యకలాపాలను ప్రత్యక్షప్రసారం చేసేందుకు వీలుగా కొత్తగా ఏర్పాటు చేసిన సంసద్‌ టీవీ ఛానల్‌ బుధవారం ప్రారంభం కానుంది.ఈ ఛానల్‌ను.....

Published : 14 Sep 2021 23:05 IST

దిల్లీ: పార్లమెంట్‌ ఉభయ సభల కార్యకలాపాలను ప్రత్యక్షప్రసారం చేసేందుకు వీలుగా కొత్తగా ఏర్పాటు చేసిన సంసద్‌ టీవీ ఛానల్‌ బుధవారం ప్రారంభం కానుంది.ఈ ఛానల్‌ను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా బుధవారం సాయంత్రం 6గంటలకు ప్రారంభించనున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఓ ప్రకటనలో వెల్లడించింది. అంతర్జాతీయ ప్రజాస్వామిక దినోత్సవం రోజున ఈ ఛానల్‌ను ప్రారంభం కాబోతోందని పేర్కొంది. సంసద్‌ టీవీ కార్యక్రమాలు నాలుగు కేటగిరీలుగా ప్రసారం అవుతాయని పీఎంవో తెలిపింది. పార్లమెంట్‌, ప్రజాస్వామిక సంస్థల కార్యకలాపాలు, పరిపాలన, పథకాలు, విధానాల అమలు, భారతీయ చరిత్ర సంస్కృతి, సమకాలీన అంశాలు తదితర అంశాలపై ప్రసారాలు ఉంటాయని పేర్కొంది.

పార్లమెంట్‌ ఉభయ సభల కార్యకలాపాలను లోక్‌సభ, రాజ్యసభ టీవీ ఛానళ్లు వేర్వేరుగా ప్రసారం చేస్తూ వస్తున్నాయి. అయితే, ఈ రెండింటినీ కలిపి సంసద్‌ టీవీ పేరుతో కొనసాగించాలని ఈ ఏడాది మార్చిలో రాజ్యసభ సచివాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. సంసద్‌ టీవీ ఛానల్‌కు సీఈవోగా విశ్రాంత ఐఏఎస్‌ రవికపూర్‌ను నియమించింది. ఉభయ సభల టీవీ ఛానళ్లను కలిపి వేయడంపై గతేడాది జూన్‌లో నిర్ణయం తీసుకోగా.. మార్చి 1న అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని