Vaccine: వాళ్లలో సహజ రోగనిరోధకతను పెంచుతుంది

కొవిడ్‌ సోకిన వాళ్లు టీకా తీసుకోవడం వల్ల సహజ రోగనిరోధక శక్తి పెరుగుతుందని, కొత్తరకం కరోనా వైరస్‌ల నుంచి రక్షణ లభిస్తుందని నూతన అధ్యయనాలు చెబుతున్నాయి.

Updated : 01 Jun 2021 17:33 IST

అమెరికాలోని రాక్‌ఫెల్లర్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుల వెల్లడి 

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌ సోకిన వాళ్లు టీకా తీసుకోవడం వల్ల సహజ రోగనిరోధక శక్తి పెరుగుతుందని, కొత్తరకం కరోనా వైరస్‌ల నుంచి రక్షణ లభిస్తుందని నూతన అధ్యయనాలు చెబుతున్నాయి. రోగనిరోధక వ్యవస్థకు చెందిన మెమొరీ బీ కణాలు ఉత్పత్తి చేసే ప్రతిరోధకాలు కొవిడ్‌-19, దాని జన్యువు అయిన సార్స్‌-కోవ్‌-2 ను తటస్థీకరించడంలో మెరుగ్గా పనిచేస్తున్నాయని పరిశోధనల్లో తేలింది. 

అమెరికాలోని రాక్‌ఫెల్లర్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు గతేడాది కొవిడ్‌ సోకిన 63 మంది రక్తంలో ఉన్న ప్రతిరోధకాలను విశ్లేషించి, వాటి పరిణామాన్ని గుర్తించారు. మెమొరీ బీ కణాలు రోగనిరోధక రిజర్వాయర్‌గా పనిచేసి యాంటిబాడీలను సేకరిస్తాయని, ఈ యాంటీబాడీలు ఏర్పడిన వ్యక్తుల్లో వైరస్‌ నుంచి దీర్ఘకాలిక రక్షణ లభిస్తుందని పరిశోధకులు తెలిపారు.

మోడెర్నా, ఫైజర్‌ వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకున్న ఒక సమూహంలోని 26 మందిలో ప్రతిరోధకాలు బాగా పెరిగాయని కనుగొన్నారు. వీళ్లలో యూకే, దక్షిణాఫ్రికా, అమెరికాకు చెందిన సార్స్‌-కోవ్‌-2 వేరియంట్లను ఎదుర్కొనే యాంటీబాడీలను గుర్తించారు. ఈ ప్రతిరోధకాలు అభివృద్ధి చెందిన మెమొరీ బీ కణాల సమూహాల ద్వారా ఉత్పత్తి అవుతాయని, వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్లే ప్రతిరోధకాలు పెరిగాయని పరిశోధకులు తెలిపారు. కరోనా సోకని వాళ్లు టీకా తీసుకోవడం వల్ల వైరస్‌ నుంచి అదనపు రక్షణ లభిస్తుందని ఈ అధ్యయనం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని