Vaccination: వేసింది 17కోట్లు.. మిగిలింది 15కోట్ల డోసులు..  

ఓ వైపు పండగల పేరుతో నిబంధనలు గాలికొదిలేస్తూ రద్దీగా తిరిగేస్తున్న జనం.. మరోవైపు నామమాత్రంగా సాగుతోన్న టీకా పంపిణీ.. ఇవన్నీ చూస్తుంటే కరోనా మూడో దశను మళ్లీ ఆహ్వానిస్తున్నామా అన్నట్లు ఉన్నాయి

Updated : 01 Nov 2021 12:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓ వైపు పండగల పేరుతో నిబంధనలు గాలికొదిలేస్తూ రద్దీగా తిరిగేస్తున్న జనం.. మరోవైపు నామమాత్రంగా సాగుతోన్న టీకా పంపిణీ.. ఇవన్నీ చూస్తుంటే కరోనా మూడో దశను మళ్లీ ఆహ్వానిస్తున్నామా అన్నట్లు ఉన్నాయి దేశంలో తాజా పరిస్థితులు. మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోనేలేదు. ఇప్పటికే చాలా దేశాలు బూస్టర్‌ డోసును మొదలుపెట్టాయి. కానీ మనదగ్గర మాత్రం టీకా పంపిణీ జోరు తగ్గుముఖం పట్టింది. కారణమేదైనా అక్టోబరు నెలలో వ్యాక్సినేషన్‌ నెమ్మదించింది. అంతక్రితం నెలతో పోలిస్తే డోసుల పంపిణీ 25శాతం మేర తగ్గింది. ఇక ఇదే సమయంలో రాష్ట్రాల వద్ద ఉన్న టీకాల నిల్వలు మూడు రెట్లు పెరగడం గమనార్హం. అందుకే స్వయంగా ప్రధానమంత్రి మోదీనే రంగంలోకి దిగి టీకా పంపిణీపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

డోసుల పంపిణీ 17 కోట్ల కంటే తక్కువే..

టీకా పంపిణీలో భారత్‌ ఇటీవల ‘శతకోటి’ డోసుల ప్రయాణాన్ని దాటుకుని అరుదైన ఘనత సాధించింది. అక్టోబరు 21న దేశంలో టీకాల పంపిణీ 100 కోట్ల డోసుల మైలురాయిని దాటింది. ఇప్పటివరకు 106కోట్లకు పైగా డోసులను పంపిణీ చేశారు. అయితే అక్టోబరులో వ్యాక్సినేషన్‌ అంతంత మాత్రంగానే సాగింది. సెప్టెంబరులో 24 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేయగా.. గత నెల అది 17కోట్ల దిగువకు పడిపోయింది. ముఖ్యంగా దసరా పండగ రోజుల్లో చాలా రాష్ట్రాల్లో టీకా పంపిణీ నిలిచిపోయింది. దీంతో డోసుల పంపిణీ తగ్గింది.

నిల్వ ఉన్న డోసులు.. 15కోట్లు

అక్టోబరు ఒకటో తేదీ నాటికి రాష్ట్రాల వద్ద 5 కోట్ల డోసుల నిల్వలు ఉన్నాయి. అయితే గత నెల పంపిణీ నెమ్మదించడంతో ఈ నిల్వలు కూడా పేరుకుపోయాయి. ఇప్పటివరకు రాష్ట్రాల వద్ద 13కోట్లకు పైగా డోసులు, ప్రైవేటు ఆసుపత్రుల వద్ద దాదాపు 2 కోట్ల డోసులు నిల్వ ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం. అంటే నెల వ్యవధిలోనే టీకా నిల్వలు మూడింతలు పెరిగాయి. దీంతో రాష్ట్రాల తీరుపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకప్పుడు టీకాల కొరతపై ప్రశ్నించిన రాష్ట్రాలు.. ఇప్పుడు సరిపడా డోసులు అందుబాటులో ఉన్నా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.

నిర్లక్ష్యమా.. భయమా..

కరోనా రెండో దశ విజృంభణ సమయంలో టీకా పంపిణీ కూడా జోరుగా సాగింది. అయితే ఈ మధ్య టీకాలు వేయించుకునేందుకు వచ్చేవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కన్పిస్తున్నాయి. ఒకటి.. టీకాలు వేయించుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్న అపోహ ఇంకా చాలామందిని వెంటాడుతోంది. రెండోది.. మన చుట్టూ ఉన్నవాళ్లంతా వ్యాక్సిన్‌ వేయించుకున్నారుగా.. మనం వేసుకోవాల్సిన అవసరం లేదన్న భ్రమలో కొందరు ఉండటం కలవరపెడుతోంది. ఈ రెండోది చాలా చోట్ల ప్రధాన సమస్యగా మారుతోంది.

దీనికి తోడు మరో సమస్య కూడా ఉంది. తొలి డోసు తీసుకున్నవారిలో చాలా మంది రెండో డోసు వేయించుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు. అలా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10.34కోట్ల మందికి పైగా ప్రజలు గడువు పూర్తయినా రెండో డోసు వేయించుకునేందుకు రాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఇటీవల ఓ సందర్భంగా చెప్పారు. వీరందరూ కనుక వ్యాక్సిన్‌ తీసుకుంటే టీకా నిల్వలు అంతగా పేరుకుపోయేవి కాదని అధికారులు చెబుతున్నారు.

ఇంటింటికీ వెళ్లి పంపిణీ..

ఈ ఏడాది చివరికల్లా అర్హులైన 94కోట్ల మందికి రెండు డోసుల పంపిణీ పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల వ్యాక్సినేషన్‌ నెమ్మదిస్తుండటంతో అప్రమత్తమైన కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. నవంబరు 2 నుంచి టీకా పంపిణీ తక్కువగా ఉన్న జిల్లాలో ఇంటింటి వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టాలని నిర్ణయించింది. ఇంకా ఒక్క డోసు కూడా తీసుకోని వారి ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్‌ వేయించుకునేలా వారికి సర్దిచెప్పి అక్కడే టీకాలు ఇవ్వాలని భావిస్తోంది. అలాగే రెండు డోసులు తీసుకున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో రెండో డోసు పంపిణీపై ప్రత్యేక దృష్టిపెట్టనుంది.

మోదీ అత్యవసర సమావేశం..

టీకా పంపిణీపై ప్రధాని మోదీ త్వరలో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటన నుంచి తిరిగిరాగానే.. నవంబరు 3న దీనిపై సమీక్ష నిర్వహించనున్నట్లు పీఎంవో కార్యాలయం నిన్న ప్రకటించింది. డోసుల పంపిణీ 50శాతం కంటే తక్కువ ఉన్న జిల్లాల అధికారులతో, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భేటీ కానున్నట్లు పీఎంవో వెల్లడించింది.

చివరగా.. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టాలంటే టీకాలు ఒక్కటే సరిపోవని నిపుణులు చెబుతూనే ఉన్నారు. వ్యాక్సిన్‌ వేయించుకున్నప్పటికీ జాగ్రత్తలు పాటించాలి. కానీ ఇటీవల పండగల పేరుతో జనం మాస్క్‌లు, భౌతిక దూరం దాదాపు మర్చిపోయారు. రద్దీ ప్రదేశాల్లో విచ్చలవిడిగా మాస్క్‌ లేకుండా తిరిగేస్తున్నారు. కొవిడ్ మూడో ముప్పు ముంగిట్లోనే ఉన్న విషయం ఏ మాత్రం మర్చిపోవద్దు.. దానికి మనమే ఆహ్వానం పలకొద్దు..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని