Chardham: ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. చార్‌ధామ్‌ దేవస్థానం బోర్డు రద్దు

చార్‌ధామ్‌ దేవస్థానం బోర్డును రద్దు చేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నత స్థాయి కమిటీ ఆధ్వర్యంలో సమస్యకు సంబంధించిన అన్ని అంశాలను అధ్యయనం చేసిన తర్వాత.. బోర్డు చట్టాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌...

Published : 30 Nov 2021 18:48 IST

దేహ్రాదున్‌: చార్‌ధామ్‌ దేవస్థానం బోర్డును రద్దు చేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నత స్థాయి కమిటీ ఆధ్వర్యంలో సమస్యకు సంబంధించిన అన్ని అంశాలను అధ్యయనం చేసిన తర్వాత.. బోర్డు చట్టాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి మంగళవారం వెల్లడించారు. 2019లో మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ హయాంలో ఏర్పాటైన ఈ బోర్డు.. రాష్ట్రవ్యాప్తంగా 51 దేవాలయాల వ్యవహారాలను నిర్వహించింది. వీటిలో ప్రసిద్ధ కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి కూడ ఉన్నాయి.

అయితే, ఆలయాలపై తమ సంప్రదాయ హక్కులను ఉల్లంఘించారంటూ.. బోర్డు ఏర్పాటు చేసినప్పటినుంచి పూజారులు నిరసనలు తెలుపుతున్నారు. బోర్డును రద్దు చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన మనోహర్‌కాంత్ ధ్యాని నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ.. ఈ సమస్యను అధ్యయనం చేసింది. ఇటీవలే తన నివేదికను సమర్పించింది. ప్యానెల్ సిఫార్సుల పరిశీలన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు ధామి చెప్పారు.

‘ఎన్నికల్లో ఓటమిని పసిగట్టే..!’

ప్రభుత్వ నిర్ణయంపై చార్‌ధామ్‌ పూజారులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై తమ నిరంతర ఒత్తిడి ఫలితంగానే ఇది సాధ్యమైనట్లు చెప్పారు. ‘ఇది ఒక చారిత్రక నిర్ణయం. భారత ప్రజాస్వామ్యంలో ఒక అపూర్వ సంఘటన’ అని చార్‌ధామ్‌ తీర్థ పురోహిత్, హక్ హకూక్‌ధారి మహాపంచాయత్ ప్రతినిధి బ్రజేష్ సతి అన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్‌.. దీన్ని పూజారుల విజయంగా అభివర్ణించారు. సాగు చట్టాల మాదిరిగానే.. భాజపా దురహంకార వైఖరికి మరోసారి ఎదురుదెబ్బ తగిలిందన్నారు. రానున్న ఎన్నికల్లో ఓటమిని పసిగట్టే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని