Afghan Refugees: శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తాం..

మానవత్వం మరిచి మారణకాండ సృష్టిస్తున్న తాలిబన్ల చెర నుంచి బయటపడేందుకు అఫ్గాన్ వాసులు పడుతున్న కష్టాలు అంతర్జాతీయ సమాజాన్ని కదిలిస్తున్నాయి.....

Published : 24 Aug 2021 19:05 IST

అఫ్గాన్లను అక్కున చేర్చుకుంటున్న పలు దేశాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మానవత్వం మరిచి మారణకాండ సృష్టిస్తున్న తాలిబన్ల చెర నుంచి బయటపడేందుకు అఫ్గాన్ వాసులు పడుతున్న కష్టాలు అంతర్జాతీయ సమాజాన్ని కదిలిస్తున్నాయి. కాబుల్ విమానాశ్రయం వద్ద చోటుచేసుకుంటున్న హృదయవిదారక దృశ్యాలు ప్రపంచదేశాల్ని  కలిచివేస్తున్నాయి. అఫ్గాన్ పౌరుల నిస్సహాయస్థితి చూసి పలు దేశాలు శరణార్థులను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నాయి.

అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో ఆ దేశ పౌరుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఫలితంగా ప్రమాదకర పరిస్థితులను సైతం లెక్కచేయకుండా దేశం విడిచి వెళ్లేందుకు అప్గాన్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అఫ్గాన్‌ ప్రజల ప్రస్తుత పరిస్థితికి అమెరికానే కారణమని విమర్శలు వినిపిస్తున్న వేళ.. శరణార్థుల విషయంలో అగ్రరాజ్యం ఉదార వైఖరి కనబరుస్తోంది. సుమారు 30 వేల మందికి పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు 20వేల మందికి ఆశ్రయం కల్పించాలని కెనడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంఖ్య పెరిగినా.. అందుకు తగిన విధంగా చర్యలు తీసుకుంటామని కెనడా స్పష్టం చేసింది. బ్రిటన్‌ సైతం అఫ్గాన్‌ పౌరులపై సానుభూతితో వ్యవహరిస్తోంది. బ్రిటన్‌ సైనికులకు చాలా మంది అఫ్గాన్లు అనువాదకులు, ఇన్ఫార్మర్లుగా  పనిచేసిన నేపథ్యంలో వారందరికీ పునరావాసం కల్పించేందుకు సర్వం సిద్ధం చేసింది. వీరితోపాటు మరో 5వేల మంది శరణార్థులకు ఆశ్రయం ఇవ్వాలని.. అందులో మహిళలు, చిన్నారులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని బ్రిటన్ భావిస్తోంది.

ఇక అప్గానిస్థాన్‌ ప్రజలకు భారత్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. అఫ్గాన్‌లో భారత్‌ ఏ కార్యక్రమం చేపట్టినా వారు సహకారం అందిస్తూనే వచ్చారు. గత 20 ఏళ్లలో భారత్‌కు సహకరించిన వారందరికి అండగా ఉండాలని విదేశాంగ శాఖ అధికారులు భావిస్తున్నారు. అక్కడి హిందువులు, సిక్కులను భారత్‌కు తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానాలను నడుపుతున్నారు. మరోవైపు అఫ్గానిస్థాన్‌తో 900 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్న ఇరాన్‌ ఇప్పటికే 35 లక్షల మంది అఫ్గాన్లకు ఆశ్రయమిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ దేశంలోకి మరింతమంది ప్రవేశించే అవకాశం ఉంది. ఇలా వలస వచ్చే వారికి సాయమందించేందుకు సరిహద్దుల్లోని మూడు ప్రావిన్సుల్లో ఇరాన్‌ పలు ఏర్పాట్లు చేసింది. అమెరికా అభ్యర్థనతో ఉగాండా 2వేల మంది శరణార్థుల కోసం తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేస్తోంది.

అయితే అఫ్గాన్‌ విషయంలో పాకిస్థాన్‌ది ఎప్పుడూ ద్వంద వైఖరే. ఆ దేశాన్ని తాలిబన్లు ఆక్రమిస్తే తమ దేశ సరిహద్దుల్ని మూసివేస్తామని జూన్‌లోనే ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రకటించారు. అందుకు అనుగుణంగానే తాలిబన్లు చెలరేగిన సమయంలో సరిహద్దులకు వేలాదిమంది అఫ్గాన్లు చేరినా పాక్‌ కనికరించలేదు. చివరకు అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గింది. సరిహద్దులను తెరిచింది. అనేక దేశాలు అఫ్గాన్‌ శరణార్థులకు అండగా నిలుస్తుంటే టర్కీ మాత్రం ఎలాంటి సహకారం అందించకపోగా ఏకంగా సరిహద్దుల్లో గోడలు కడుతోంది. ఇరాన్‌ మీదుగా వచ్చే అఫ్గాన్‌లను కట్టడి చేసేందుకు ఈ చర్యలు తీసుకుంటోంది. అఫ్గాన్‌ పొరుగు దేశమైన ఉజ్బెకిస్థాన్‌ కూడా కరోనా వైరస్‌ పేరిట వీసాలను తిరస్కరిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని