దిల్లీ విలయానికి ఆ రకమే కారణమా..?

దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్‌ మహమ్మారి విలయతాండవం చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, కొన్ని వారాల్లోనే ఒక్కసారిగా పెరిగిన ఉద్ధృతికి బ్రిటన్‌ రకం వేరియంట్‌ కారణం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Published : 24 Apr 2021 01:19 IST

ఎన్‌సీడీసీ నిపుణులు ఏమంటున్నారంటే..!

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్‌ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అయితే, కొన్ని వారాల్లోనే ఒక్కసారిగా పెరిగిన ఉద్ధృతికి బ్రిటన్‌ రకం వేరియంట్‌ కారణం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్చి నెలలో జరిపిన శాంపిళ్ల విశ్లేషణలో 50శాతం బ్రిటన్‌ వేరియంట్‌వే కావడం ఇందుకు నిదర్శనమని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) నిపుణులు అంచనా వేశారు.

దేశంలో కరోనా వైరస్‌ పరివర్తనలు, వాటి ప్రభావాన్ని అంచనా వేసేందుకు జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ) ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపడుతున్నారు. ఇందులో భాగంగా మార్చి రెండు, నాలుగు వారాల్లో దిల్లీలో కరోనా సోకిన వారి నమూనాలకు పరిశీలించారు. రెండో వారంలో చేపట్టిన నమూనాల్లో 28శాతం యూకే వేరియంట్‌ బయటపడగా.. అదే నెల చివరి వారంలో అవి 50శాతానికి పెరిగాయని ఎన్‌సీడీసీ డైరెక్టర్‌ సుజీత్‌ సింగ్‌ వెల్లడించారు. తద్వారా దిల్లీలో వైరస్‌ విలయతాండవానికి యూకే వేరియంట్‌ కారణమై ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. ముఖ్యంగా పంజాబ్‌లో బ్రిటన్‌ రకం వైరస్‌ ప్రభావమే అత్యధికంగా ఉందని సుజీత్‌ సింగ్‌ పేర్కొన్నారు.

దిల్లీలో ఇప్పటివరకు 15వేల నమూనాలకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ (INSACOG కన్సార్టియం ఆధ్వర్యంలో) చేపట్టినట్లు ఎన్‌సీడీసీ చీఫ్‌ వెల్లడించారు. వీటిలో ప్రస్తుతం రెండు రకాల (B.1.617, యూకే) కరోనా వేరియంట్‌లను గుర్తించామన్నారు. మహారాష్ట్రలో వెలుగుచూసిన B.1.617 వేరియంట్‌నే డబుల్‌ మ్యుటేషన్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే, సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కొనసాగుతున్న చాలా నగరాల్లో ఈ రకం వేరియంట్‌ కేసులే 50శాతం వెలుగుచూస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని