Updated : 27/07/2021 05:50 IST

UK: పెరిగింది చాలు.. ఇక సన్నబడండి.. తగ్గిన వారికి ప్రోత్సాహకాలు!

లండన్‌: కరోనా తెచ్చి పెట్టిన సమస్యల్లో బరువు పెరగడం ఒకటి! సుదీర్ఘ లాక్‌డౌన్ కారణంగా అనేక మంది ఇళ్లలో ఖాళీగా ఉన్నారు. ఖాళీగా ఉంటే నోటికి పనిచెప్పడం మానవ నైజం. దీంతో చాలా మంది బరువు పెరిగారు. యూకేలో నిర్వహించిన ఓ సర్వేలో 41 శాతం మంది తాము లావయ్యామని అంగీకరించారు. సగటున ఒక్కొక్కరు 4 కిలోలు పెరిగినట్లు అక్కడి ‘నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌(ఎన్‌హెచ్‌ఎస్‌)’ అంచనా వేసింది. దీంతో దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అక్కడి పౌరులకు సన్నబడాలని సూచించింది.

ఈ మేరకు ప్రభుత్వం తరఫున కొన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎన్‌హెచ్‌ఎస్ సిద్ధమైంది. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని ప్రజలకు సూచించింది. టీవీల్లో జంక్‌ ఫుడ్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలపై నియంత్రణ విధించింది. ఆహార పదార్థాల్లో ఉండే కెలోరీల వివరాల్ని అందరికీ తెలియజేసేలా పోస్టర్లు పెట్టాలని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్‌ కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్న భోజనంలో ఆరోగ్యకరమైన ఆహారం అందించేలా చర్యలు చేపడుతోంది. జంక్‌ ఫుడ్‌లపై పన్నులు పెంచాలన్న ప్రతిపాదన కూడా ఉంది. కానీ, ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బరువు తగ్గడానికి ఉపయోగపడే యాప్‌లు, ప్రణాళికలను ఎన్‌హెచ్‌ఎస్ ప్రోత్సహిస్తోంది. అలాగే బరువును తగ్గించుకునేందుకు ఉపయోగపడే ఆహార పదార్థాల తయారీకి సంబంధించిన ప్రకటనలను టీవీల్లో ఇస్తోంది.

ప్రత్యేక ప్రోత్సాహకాలు...

అందుకే, ప్రజలు బరువు తగ్గి.. ఆరోగ్యంగా ఉండటం కోసం బ్రిటన్‌ ప్రభుత్వం ఒక కొత్త కార్యక్రమాన్ని అమలు చేయబోతుంది. బ్రిటన్‌ పౌరుల్లో ఎవరైతే ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటారో వారికి నగదు ప్రోత్సాహకాలు, బోనస్‌లు, డిస్కౌంట్‌ కూపన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జంక్‌ఫుడ్‌ తినడం మానేసి, ఎక్కువ కూరగాయాలు.. పండ్లు తినేవారికి ఈ ప్రోత్సాహకాలు అందించనున్నారట. ఊబకాయంపై పోరాటంలో భాగంగా ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరీస్‌ జాన్సన్‌ సైతం ఈ కార్యక్రమంలో భాగమై బరువు తగ్గుతానని ప్రతిజ్ఞ చేశారు.

ఈ ప్రోత్సాహకాలకు అర్హులను ఎంపిక చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. ఈ యాప్‌ ద్వారా సూపర్‌ మార్కెట్లలో పౌరుల నెలవారీ కొనుగోళ్ల లెక్కలను విశ్లేషించనున్నారు. ఎవరైతే జంక్‌ఫుడ్‌ను తగ్గించి.. కూరగాయాలు, పండ్లు కొనుగోలు చేస్తారో వారిని గుర్తించి యాప్‌ ద్వారానే లాయల్టీ పాయింట్లు ఇస్తారు. విద్యాసంస్థలకు, ఆఫీసులకు వాహనాల్లో కాకుండా కాలినడక వెళితే అదనంగా మరిన్ని పాయింట్లు లభిస్తాయి. అలా వచ్చిన పాయింట్లను క్యాష్‌బ్యాక్‌ రూపంలో నగదుగా మార్చుకోవచ్చు లేదా డిస్కౌంట్‌.. ఫ్రీ టికెట్స్‌ పొందొచ్చు. ఈ కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం అమలుకు, యాప్‌ అందుబాటులోకి తేవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఇలాంటి కార్యక్రమమే దుబాయ్‌లో కొన్నేళ్ల కిందటి నుంచి అమలు చేస్తున్నారు. అక్కడ కూడా ఊబకాయం, అధిక బరువు సమస్యలు ఉండటంతో ఈ వినూత్న కార్యక్రమం ప్రారంభించారు. పౌరులు తమ శరీర బరువులో ఎన్ని కిలోలు తగ్గితే అన్ని గ్రాముల బంగారం ఇస్తున్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని