Covid: మురుగునీటిలో వైరస్‌ను గుర్తించే సెన్సార్‌!

కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన వైరస్‌ను మురికినీటిలో గుర్తించే నూతన విధానాన్ని బ్రిటన్‌, భారతీయ శాస్త్రవేత్తలు రూపొందించారు.

Updated : 10 Jun 2021 18:40 IST

అభివృద్ధి చేసిన భారత, బ్రిటన్‌ శాస్త్రవేత్తలు

లండన్‌: కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన వైరస్‌ను మురుగునీటిలో గుర్తించే నూతన విధానాన్ని బ్రిటన్‌, భారతీయ శాస్త్రవేత్తలు రూపొందించారు. తద్వారా వైరస్‌ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించడం ఆరోగ్యశాఖ అధికారులకు చాలా తేలిక అవుతుందని రూపకర్తలు పేర్కొన్నారు.

కొవిడ్‌-19ను నిర్ధారించుకునేందుకు భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు ఆర్‌టీపీసీఆర్‌తో పాటు యాంటీజెన్‌ పరీక్షలను చేపడుతున్నారు. ముఖ్యంగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షకు ప్రత్యేకమైన ల్యాబ్‌లు, శిక్షణ పొందిన నిపుణులు అవసరం కావడంతో కచ్చితమైన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ సమయం పడుతోంది. దీంతో ఏయే ప్రాంతాల్లో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉందో తెలుసుకోవడం ఇబ్బందిగా మారింది. ఇలాంటి సమయంలో వ్యర్థ జలాల్లో వైరస్‌ను గుర్తించే ప్రక్రియతో ఆయా ప్రాంతాల్లో వైరస్‌ ప్రాబల్యాన్ని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పద్ధతిని మరింత తేలిక చేసేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ స్ట్రాచ్‌క్లైడ్‌, ఐఐటీ బాంబేకు చెందిన పరిశోధకులు నూతన సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఇందులో భాగంగా కరోనా వైరస్‌ను గుర్తించే పీసీఆర్‌ పరీక్ష కోసం సెన్సార్‌ కలిగిన పోర్టబుల్‌ పరికరాన్ని తయారు చేశారు. తద్వారా పరీక్ష కోసం ఖరీదైన రసాయనాలు, ల్యాబ్‌ పరికరాల అవసరం లేకుండానే వైరస్‌ను నిర్ధారించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ప్రయోగాల్లో భాగంగా ఈ సెన్సార్‌ పరికరాన్ని ఉపయోగించి ముంబయిలోని ఓ మురుగునీటి శుద్ధి కేంద్రం వద్ద సేకరించిన నమూనాలను పరీక్షించారు. తద్వారా ఆ ప్రాంతంలో వైరస్‌ తీవ్రతను గుర్తించగలిగారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో చాలా పేద, మధ్య ఆదాయ దేశాలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా భారీ స్థాయిలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను చేపట్టడం ఇబ్బందిగా మారింది. ఇలాంటి సమయంలో మురికినీటిలో వైరస్‌ జాడలను గుర్తించడం వల్ల ఆయా ప్రదేశాల్లో వైరస్‌ తీవ్రతను ప్రజారోగ్య అధికారులు అర్థం చేసుకోవడం తేలిక అవుతుంది’ అని బ్రిటన్‌కు చెందిన నిపుణులు డాక్టర్‌ ఆండీ వార్డ్‌ పేర్కొన్నారు. తద్వారా ఆ ప్రాంతంలో వైరస్‌ కట్టడికి సత్వరమే చర్యలు చేపట్టవచ్చని సూచించారు. కేవలం కొవిడ్‌కు కారణమయ్యే సార్స్‌-కోవ్‌-2 వైరస్‌నే కాకుండా అన్ని రకాల వైరస్‌లను గుర్తించడానికి ఈ సాంకేతికతను వాడవచ్చని ఐఐటీ బాంబేకి చెందిన నిపుణులు డాక్టర్‌ సిద్ధార్థ్‌ తాళ్లూర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని