F35: రష్యన్లు రంగంలోకి దిగారేమో.. ఎఫ్‌35పై అమెరికాలో గుబులు..!

ఒక ఆయుధ రహస్యాలను కాపాడేందుకే అమెరికా నాటో కూటమిలోని సభ్యదేశమైన టర్కీతో విరోధం పెట్టుకొంది. భవిష్యత్తులో ఆ రహస్యాలు

Published : 02 Dec 2021 01:55 IST

 శకలాలను గుర్తించినా.. వెంటనే వెలికి తీయలేని పరిస్థితి

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఒక ఆయుధం రహస్యాలను కాపాడేందుకే అమెరికా నాటో కూటమిలోని సభ్యదేశమైన టర్కీతో విరోధం పెట్టుకొంది. భవిష్యత్తులో ఆ రహస్యాలు రష్యా చేతికి దక్కకూడదనే అలా చేసింది..! ఆ ఆయుధమే ఎఫ్‌-35 యుద్ధవిమానం. ఈ యుద్ధవిమానం తయారీకి ప్రపంచంలో ఏ ప్రాజెక్టుపై చేయనంతగా దాదాపు 1.5 ట్రిలియన్‌ డాలర్లను అమెరికా ఖర్చుచేసింది. అంటే 20 ఏళ్లపాటు అఫ్గానిస్థాన్‌ యుద్ధంపై వెచ్చించిన దాదాపు ట్రిలియన్‌ డాలర్ల కంటే మరో 50శాతం ఎక్కువన్నమాట. తాజాగా ఎఫ్‌-35 టెక్నాలజీ భద్రత మరోసారి ప్రమాదంలో పడటంతో అమెరికాకు కంటిమీద కునుకు కరవైంది.

ఇంజిన్‌ కవర్‌ ఎంత పనిచేసిందో..? 

నవంబర్‌లో బ్రిటన్‌కు చెందిన ‘క్వీన్‌ ఎలిజిబెత్‌’ విమాన వాహక నౌక పై నుంచి ఎఫ్‌-35బీ విమానం మధ్యదరా సముద్రంలో కూలిపోయినట్లు రాయల్‌ నేవీ ప్రకటించింది. ఈ ప్రమాదం నుంచి బ్రిటన్‌కు చెందిన ‘డ్యామ్‌ బస్టర్స్‌’ స్క్వాడ్రన్‌ పైలట్‌ సురక్షితంగా బయటపడినట్లు వెల్లడించింది. ఎఫ్‌35 విమాన ఎజెక్షన్‌ సీట్లను తయారు చేసిన మార్టిన్‌ బేకర్‌ సంస్థ కూడా లోపాయకారీగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ కూలిపోయిన ఎఫ్‌35బీ వేరియంట్‌ విమానంలో చాలా ప్రత్యేకమైన టెక్నాలజీని వాడారు. దీని ఖరీదు 100 మిలియన్‌ డాలర్లకు పైమాటే. ఇది హెలికాప్టర్‌ వలే నిట్టనిలువునా ఎగరగలదు.. ల్యాండ్‌ అవ్వగలదు. వర్షాల నుంచి రక్షణగా ఈ విమానంపై అమర్చిన కవర్‌ను ఇంజిన్‌ లోపలికి లాక్కోవడంతో  ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్‌ అయ్యింది.

ప్రమాదం చోటుచేసుకోగానే బ్రిటన్‌ ఆగమేఘాల మీద విమాన శకలాల కోసం గాలింపు మొదలు పెట్టింది. బాగా బరువుండే విమాన శకలాలు సముద్రం అడుగుకు చేరతాయి. కానీ, సముద్ర జలాల లోతుల్లోకి  వెళ్లడానికి మనుషులు, యంత్రాలకు పరిమితులు ఉన్నాయి. దీంతో ఈ శకలాలను కనుగొని వెలికితీసేంత టెక్నాలజీ బ్రిటన్‌ వద్ద లేకపోవడంతో అమెరికా, మిత్రదేశాల సాయం  కోరింది. 

రష్యన్లను తక్కువ అంచనావేయలేని పరిస్థితి..

దాదాపు రెండు వారాలకు పైగా కంటిమీద కునుకులేకుండా గాలించగా.. చివరికి ఆ శకలాలు ఉన్న ప్రదేశాన్నినిన్న గుర్తించారు. కానీ, వెంటనే వెలికి తీసే అవకాశం లేదు. ఈ లోపు రష్యన్లు ఎక్కడ రంగంలోకి దిగి ఆ శిథిలాలను అపహరిస్తారేమోనని అమెరికా ఆందోళన చెందుతోంది. ఎందుకంటే  కోల్డ్‌వార్‌ సమయంలో అమెరికా, రష్యాలు సముద్ర గర్భంలో రికవరీ ఆపరేషన్లు చేసే టెక్నాలజీని అభివృద్ధి చేశాయి. బాహ్య ప్రపంచానికి మాత్రం జలాంతర్గాములకు సాయం చేసే పరికరాలుగా చెప్పుకొంటూ ఇరుదేశాలు పలు కోవర్టు ఆపరేషన్లు నిర్వహించాయి. 

1966లో థర్మోన్యూక్లియర్‌ బాంబు కోసం వేటతో మొదలై..

1966లో అమెరికాకు చెందిన బీ-52 బాంబరు విమానం నాలుగు థర్మోన్యూక్లియర్‌ బాంబులతో ప్రయాణిస్తూ.. గాల్లో ఇంధనం నింపుకొనే క్రమంలో ట్యాంకర్‌ విమానాన్ని ఢీకొని స్పెయిన్‌ సమీపంలోని పాలోమరెస్‌ వద్ద కూలిపోయింది. మూడు అణు బాంబులు సమీపంలోని మత్సకారుల గ్రామం వద్ద పడి కొంత రేడియేషన్‌ వెదజల్లాయి. ఒకటి మాత్రం సముద్రంలో 2,500 అడుగుల లోతున పడిపోయింది. దీనిని వెలికి తీసేందుకు సరైన పరికరాలు లేక అమెరికా రెండున్నర నెలలు తిప్పలు పడాల్సి వచ్చింది. దీంతో సముద్రం అడుగు నుంచి కూడా శకలాలను సేకరించేలా యూఎస్‌ఎస్‌ హాలిబట్‌ అనే సబ్‌మెరైన్‌లో మార్పులు చేశారు. దీనిని రష్యా క్షిపణి టెక్నాలజీపై నిఘాకు వినియోగించారు.  క్షిపణి ప్రయోగం తర్వాత శకలాలను సేకరించేందుకు దీనిని వాడుతొన్నట్లు బాహ్యప్రపంచానికి చెప్పింది. కానీ, పెట్రోపావ్లోవ్స్క్‌లోని రష్యా పసిఫిక్‌ కమాండ్‌ నుంచి వ్లాదీవాస్తోక్‌ నగరంలోని నావికాదళ కేంద్రానికి వెళ్లే కేబుళ్లకు అమెరికన్లు నిఘా పరికరాలను అమర్చారు. ఈ సమయంలోనే రష్యా టార్పిడోల గమనానికి రాడార్లు వాడుతున్నట్లు గుర్తించింది. 

చమురు అన్వేషణ ముసుగులో..

రష్యా సబ్‌మెరైన్‌ కె-129 మునిగిపోవడంతో దాని టెక్నాలజీని సొంతం చేసుకోవడానికి అమెరికా 1971లో ‘ప్రాజెక్టు అజోరియన్‌’ చేపట్టింది. ఓ బిలియనీరు నిర్మించిన  చమురు అన్వేషణ కేంద్రం ముసుగులో రష్యా సబ్‌మెరైన్‌ శకలాలపై ఒక నిర్మాణం చేపట్టింది. కె-129 కోడ్‌ రూమ్‌తో సహా చాలా కీలక పరికరాలను అమెరికా నిఘా సంస్థ సీఐఏ దక్కించుకొంది. 

ఎన్‌ఆర్‌-1 పేరుతో అణుశక్తితో నడిచే ప్రత్యేకమైన మినీ జలాంతర్గామిని అమెరికా అభివృద్ధి చేసింది. ఇది సముద్రం అడుగుకు చేరి శకలాలను వెలికి తీయగలదు. ‘ఛాలెంజర్‌ స్పేస్‌ షటిల్‌’ విడిభాగాలను ఇదే వెలికి తీసింది.

మరోపక్క రష్యా కూడా ‘లోషారిక్‌’ పేరిట సముద్రపులోతుల్లో కార్యకలాపాలను నిర్వహించే ఓ సబ్‌మెరైన్‌ను తయారు చేసింది. దీనిని అండర్‌ వాటర్‌ కేబుళ్లపై నిఘా ఉంచేందుకు, ఇంటర్నెట్‌ సమాచారం వంటి వాటికోసం వాడేది. 2019లో ఇది సముద్రగర్భంలో ప్రమాదానికి గురై 14 మంది నావికులు సజీవదహనమైపోయారు.  ప్రస్తుతం బెస్టర్‌ డీప్‌సీ రెస్క్యూ వెహికల్‌(డీఎస్‌ఆర్‌వీ)ను ఉపయోగిస్తోంది. ఇది క్షిపణులు, కూలిపోయిన విమానాల భాగాలను సముద్రపు అడుగుభాగం నుంచి సేకరించగలదు. తాజాగా అమెరికాను భయపెడుతున్నది ఇదే.

ఎఫ్‌-35లో ప్రత్యర్థుల రాడార్లను తప్పుదోవ పట్టించే టెక్నాలజీ, రహస్య సెన్సర్లు, ఇతర టెక్నాలజీని వినియోగించారు. గతంలో ఎఫ్‌-117 అనే అత్యాధునిక అమెరికా స్టెల్త్‌ విమానం 1999లో సెర్బియాలో కూలిపోయింది. ఆ విమాన శకలాలను చైనా సంపాదించి.. తాజాగా జే-20 స్టెల్త్‌ జెట్‌ను తయారు చేసింది. ఇప్పుడు రష్యన్లు కూడా అలానే చేస్తారేమో అన్నదే అమెరికా భయం.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని