Kashmir in UNGA: తీరు మార్చుకోని ఎర్డోగన్‌.. ఐరాసలో కశ్మీర్‌ ప్రస్తావన!

ఐరాసలో టర్కీ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తి మరోసారి తన బాధ్యతారాహిత్యాన్ని చాటుకుంది....

Published : 23 Sep 2021 02:01 IST

ఐరాస: కరోనా మహమ్మారి అంతం, ఉగ్రవాద నిర్మూలన, పర్యావరణ మార్పులు.. ఇలా పలు రకాల సమస్యలకు నిర్మాణాత్మక పరిష్కారాలపై యావత్‌ ప్రపంచం దృష్టి సారిస్తే.. టర్కీ, పాకిస్థాన్‌ మాత్రం ఇంకా కాలం చెల్లిన డిమాండ్లతో కాలం వెల్లదీస్తున్నాయి. కరోనా వ్యాక్సినేషన్‌, అఫ్గాన్‌ సంక్షోభం తర్వాత ప్రపంచ సంబంధాలు, ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం వంటి గంభీరమైన అంశాల మధ్య ఐరాస సర్వసభ్య సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే,  గత ఏడాది వర్చువల్‌ సమావేశాల్లోనూ ఇదే వైఖరిని అవలంభించిన టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌కు భారత్‌ అప్పుడే చురకలంటించింది. భాతర అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చొద్దని గట్టిగానే హెచ్చరించింది. అయినా, ఎర్డోగన్‌ బుద్ధి మాత్రం మారలేదు.

74 ఏళ్లుగా కొనసాగుతున్న కశ్మీర్‌ సమస్యను పరిష్కరించాలంటూ ఎర్డోగన్‌ మంగళవారం నాటి తన ప్రసంగంలో పేర్కొన్నారు. చర్చల ద్వారా, ఐరాస నిబంధనలకు అనుగుణంగా ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదుర్చాలంటూ తన నీతివాక్యాలు పలికారు. కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమన్న విషయంపై అవగాహన లేకుండా మాట్లాడారు.

ఎర్డోగన్‌ భారత్‌పై లేనిపోని విమర్శలు చేయడం ఇది కొత్తేమీ కాదు. గతంలో కశ్మీర్‌ విషయంలో పాకిస్థాన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తి విమర్శలపాలయ్యారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పైనా అర్థంలేని ఆరోపణలు చేశారు. ఇలా పలుసార్లు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, చట్టాలపై ఎలాంటి అవగాహన లేకుండానే వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని