మరో 73 మందికి ట్రంప్‌ క్షమాభిక్ష!

అంతా అనుకున్నట్లుగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన చివరి పనిదినమైన బుధవారం రోజు అనేక మందికి క్షమాభిక్ష ప్రసాదించారు. అయితే, స్వీయ క్షమాభిక్షకు మాత్రం ట్రంప్‌ మొగ్గుచూపలేదు. అలాగే తన కుటుంబ........

Published : 20 Jan 2021 16:31 IST

స్వీయక్షమాభిక్షకు మొగ్గుచూపని అధ్యక్షుడు

వాషింగ్టన్‌: అంతా అనుకున్నట్లుగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అధ్యక్ష హోదాలో చివరి రోజున అనేక మందికి క్షమాభిక్ష ప్రసాదించారు. అయితే, స్వీయ క్షమాభిక్షకు మాత్రం ఆయన మొగ్గుచూపలేదు. అలాగే తన కుటుంబ సభ్యులను కూడా ఈ జాబితాలో చేర్చలేదు.

శ్వేతసౌధం మాజీ ఉన్నతాధికారి స్టీవ్‌ బ్యానన్‌ సహా మొత్తం 73 మందికి ట్రంప్‌ క్షమాభిక్ష పెట్టారు. దాదాపు మరో 70 మందికి శిక్షను తగ్గించారు. వైట్‌హౌజ్‌ను వీడడానికి కొన్ని గంటల ముందు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. బహుశా అధ్యక్ష హోదాలో ఆయన తీసుకున్న చివరి నిర్ణయం ఇదే కావొచ్చని తెలుస్తోంది. ఈ జాబితాపై ఆయన చాలాసేపు కసరత్తు చేశారని శ్వేతసౌధంలోని ఓ అధికారి తెలిపారు. చివరి నిమిషంలో ఆయన జాబితాను మార్చే అవకాశమూ లేకపోలేదని తెలిపారు. ఉత్తర్వులపై సంతకం చేసే వరకు ఏమీ చెప్పలేమని అభిప్రాయపడ్డారు.

సాధారణంగా కనీసం కొన్ని నెలల పాటు శిక్ష అనుభవించిన తర్వాత క్షమాభిక్ష ప్రసాదిస్తారు. బ్యానన్‌ విషయంలో మాత్రం అది జరగలేదు. ఆయన ఇటీవలే జైలుకు వెళ్లారు. కనీస శిక్షాకాలాన్ని పూర్తి చేయకముందే ఆయనను ట్రంప్‌ క్షమించేశారు. మెక్సికో సరిహద్దుల్లో నిర్మిస్తున్న గోడ కోసం సేకరించిన నిధులను దుర్వినియోగం చేసిన విషయంలో కోర్టు ఆయన్ని దోషిగా తేల్చింది. ఈ ప్రాజెక్టు ట్రంప్‌ మానసపుత్రిక అన్న విషయం తెలిసిందే. ఆయన అంతగా పట్టుబట్టి సాధించుకున్న ఈ ప్రాజెక్టులో మోసాలకు పాల్పడ్డ బ్యానన్‌ను క్షమించడంపై పలువురు చట్టసభ సభ్యులు పెదవి విరిచారు. బ్యానన్‌ 2016 ఎన్నికల సమయంలో ట్రంప్‌ ప్రచార బృందంలో కీలక పాత్ర పోషించారు.

డిసెంబరులోనే 40 మందికి పైగా వ్యక్తులకు ట్రంప్‌ క్షమాభిక్ష ప్రసాదించిన విషయం తెలిసిందే. వీరిలో వైట్‌ హౌస్‌ ఉన్నతాధికారి మైకేల్‌ ఫ్లిన్‌ సహా ఆయన మద్దతుదారులు, ఆయనతో పనిచేసిన మాజీ అధికారులు, రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదారులు ఉన్నారు. పదవిలో ఉండగానే తన తప్పిదాల నుంచి విముక్తి కల్పించుకోడానికి ‘స్వీయ క్షమాభిక్ష’ పెట్టుకోవడానికి ట్రంప్‌ యోచిస్తున్నట్లు ఇటీవల వార్తలు వెలువడ్డ విషయం తెలిసిందే. ఈ విశేషాధికారంపై ఆయన తన సలహాదారులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపారని సమాచారం. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని.. తప్పులను స్వయంగా ఒప్పుకున్నట్లవుతందని వారు హెచ్చరించడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి..

ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్‌

మళ్లీ అ‘మెరిక’ను చేయాలని

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని